ట్రాన్స్‌కో సిబ్బంది నిర్బంధం

ABN , First Publish Date - 2021-02-06T05:24:34+05:30 IST

మండలంలోని తిమ్మాపురం ఎస్సీ కాలనీకి విద్యుత్‌ సరఫరా నిలిపివేయటంతో గ్రామస్థులు ట్రాన్స్‌కో సిబ్బందిని శుక్రవారం నిర్బంధించారు.

ట్రాన్స్‌కో సిబ్బంది నిర్బంధం
ట్రాన్స్‌కో సిబ్బందిని నిర్బంధించి ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

సరఫరా నిలిపివేయడంతో తిమ్మాపురం గ్రామస్థుల ఆగ్రహం

అర్వపల్లి, ఫిబ్రవరి 5: మండలంలోని తిమ్మాపురం ఎస్సీ కాలనీకి విద్యుత్‌ సరఫరా నిలిపివేయటంతో గ్రామస్థులు ట్రాన్స్‌కో సిబ్బందిని శుక్రవారం నిర్బంధించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిమ్మాపురం గ్రామంలో 300 కుటుంబాలు నివసించే ఎస్సీ కాలనీలో కొంతమంది విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి ఉండగా; కొన్ని కుటుంబాలు మీటర్లు ఏర్పాటు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో 10 రోజుల క్రితం ట్రాన్స్‌కో విజిలెన్స్‌ అధికారులు గ్రామానికి వచ్చి తాళాలు వేసి ఉన్న ఇళ్లతో పాటు మొత్తంగా 32 మందిపై కేసులు నమోదుచేశారు. విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోవడంతో ఎస్సీ కాలనీకి శుక్రవారం ఉదయం విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో ఎస్సీ కాలనీవాసులు ట్రాన్స్‌కో సిబ్బందిని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్బంధించి, గేటుకు తాళం వేశారు. అదే గేటు ఎదుట సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ 100 యూనిట్ల లోపు ఎస్సీలకు ఉచిత కరెంట్‌ ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే ట్రాన్స్‌కో సిబ్బంది పట్టించుకోకుండా అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ట్రాన్స్‌కో విజిలెన్స్‌ అధికారులు గ్రామానికి వచ్చి తాళాలు వేసి ఉన్న ఇళ్లతో పాటు మొత్తంగా 32 మందిపై కేసులు నమోదుచేశారని, ఒక్కొక్కరికీ రూ.2500 జరిమానా విధించారని అన్నారు. అందులో కొన్ని కుటుంబాలు 2020 డిసెంబర్‌ నెలలో బతుకుదెరువుకోసం నిజామాబాద్‌, విజయవాడకు వెళ్లాయన్నారు. గ్రామంలో 300 కుటుంబాలు నివసించే ఎస్సీ కాలనీకి అధికారులు విద్యుత్‌ సరఫరాను ఎలా నిలిపేస్తారని నిలదీశారు. రెండు గంటల అనంతరం గ్రామస్థులు ఆందోళనను విరమించటంతో విద్యుత్‌ సిబ్బంది బయటకు వచ్చారు. నిరసనలో ఎస్సీ కాలనీకి చెందిన బొడ్డు శంకర్‌, జీడి ఉపేందర్‌, బూర్గుల వెంకన్న, కృష్టయ్య, లక్ష్మణ్‌, వెంకన్న పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-06T05:24:34+05:30 IST