ఉద్రిక్తతకు దారితీసిన కూల్చివేతలు

ABN , First Publish Date - 2021-02-06T05:27:22+05:30 IST

మండలంలో మరో భూవివాదం అధికారులు, బాధితులకు మధ్య వాగ్వాదంతో పాటు ఉద్రిక్తతకు దారితీసింది.

ఉద్రిక్తతకు దారితీసిన కూల్చివేతలు

మఠంపల్లి, ఫిబ్రవరి 5 : మండలంలో మరో భూవివాదం అధికారులు, బాధితులకు మధ్య వాగ్వాదంతో పాటు ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన పెదవీడు పరిధిలోని అమరేశ్వరి పరిశ్రమ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే 540 సర్వే నెంబరులోని మట్టపల్లి-హుజూర్‌నగర్‌ ప్రధాన రహదారి వెంబడి ప్రభుత్వానికి చెందిన సుమారు 51 ఎకరాల భూమి ఉంది. ఇందులో 46 ఎకరాలను రైతులు ఆక్రమించుకోగా, 5 ఎకరాలను స్వాతంత్ర సమరయోధులకు కేటాయించారు. వీరికి కేటాయించిన భూమిని కొందరు ఆక్రమించి, లేఅవుట్‌ చేసి విక్రయించారు. కొనుగోలు కొందరు ఇంటి నిర్మాణాలు చేపట్టారు. ఈ ఉదంతంపై స్థానికులు, నాయకులు, రైతులు గవర్నర్‌, సీఎ్‌సలతో పాటు జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో నియోజకవర్గంలోని పలు మండలాల రెవెన్యూ, పోలీస్‌ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు శుక్రవారం బృందంగా వెళ్లారు. ఓ ఇంటి గోడను కూల్చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. తమకు పట్టాలు ఉన్నాయని, సొంత భూమిలోనే నిర్మాణం చేశామని, కూల్చివేత అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు, స్థానికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్‌ఐ విష్ణువర్ధన్‌ జోక్యం చేసుకుని పది రోజుల్లో ఇంటి నిర్మాణాలకు సంబంధించిన అనుమతి పత్రాలను అధికారులకు చూపించాలని గడువు ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. 

Updated Date - 2021-02-06T05:27:22+05:30 IST