దూదిపూలపై తగ్గిన మోజు

ABN , First Publish Date - 2021-08-21T06:25:05+05:30 IST

ఉమ్మడి జిల్లాలో పత్తి సాగుపై రైతుల మోజు తగ్గింది. గత ఏడాది వానాకాలం సీజన్‌తో పోల్చితే ఈ ఏడాది వానాకాలంలో పత్తి విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.

దూదిపూలపై తగ్గిన మోజు
సాగర్‌ ఆయకట్టు పరిధిలో సూర్యాపేట జిల్లాలో నారుమడి సిద్ధం చేస్తున్న రైతు

ఉమ్మడి జిల్లాలో పడిపోయిన పత్తి సాగు విస్తీర్ణం

వరి వైపే రైతుల మొగ్గు

సూర్యాపేట సిటీ, ఆగస్టు 20: ఉమ్మడి జిల్లాలో పత్తి సాగుపై రైతుల మోజు తగ్గింది. గత ఏడాది వానాకాలం సీజన్‌తో పోల్చితే ఈ ఏడాది వానాకాలంలో పత్తి విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. సూర్యాపేట జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 1,39,514 ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు 1,01,320 ఎకరాల్లో మాత్రమే పత్తి సాగైంది. గత ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,44,254 ఎకరాల్లో పత్తి సాగుకాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 9,34,320 ఎకరాల్లో పత్తి సాగైంది. సూర్యాపేట జిల్లాకు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు, మూసీ నీరు వస్తుండటం, నల్లగొండ జిల్లాకు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో రైతులు పత్తికి బదులు, వరి సాగుకే అధికంగా ఆసక్తి చూపుతున్నారు. అంతేగాక పత్తికి పెట్టుబడి వ్యయం పెరగడంతో ఏటా తెల్లబంగారం సాగుపై రైతులకు ఆసక్తి తగ్గుతోంది.


ఆయకట్టుకు పుష్కలంగా నీరు

ఉమ్మడి జిల్లాలో సాగు నీటి నిల్వలు పెరిగాయి. అంతేగాక ప్రాజెక్టులు నిండుకున్నాయి. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు జూలై చివర, ఆగస్టు మొదటి వారంలోనే భారీగా వరద రావడంతో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. దీంతో ఎడమ కాల్వలకు సాగు నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వ పరిధిలో హాలియా, నేరేడుచర్ల, హుజూర్‌నగర్‌, కోదాడ, మునగాల, నడిగూడెం, పాలేరు వరకు సుమారు 1,91,539ఎకరాల ఆయకట్టులో వరి సాగుకు సాగునీటిని విడుదలచేస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు సైతం జూలై చివరి వారంలో భారీగా వరద రావడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో రైతులు నాట్లువేసే పనులు ముమ్మరంగా చేశారు. మూసీ ఆయకట్టు పరిధిలో సూర్యాపేట, పెన్‌పహాడ్‌, నేరేడుచర్ల, మఠంపల్లి మండలాల్లో సుమారు 30వేల ఎకరాల్లో వరి సాగువుతోంది. నాగార్జునసాగర్‌, మూసీ ప్రాజెక్టుల ఆధారంగా సూర్యాపేట జిల్లాలో 70శాతం వ్యవసాయ భూములు సేద్యం అవుతుండగా, ఎస్సారెస్పీ కింద మరో 20శాతం భూమి సాగులో ఉంది. ఎస్సారెస్పీ కాల్వ పరిధిలో రెండు సీజన్లకు సాగునీటిని విడుదల చేస్తుండటంతో గతంలో పత్తిసాగు చేసిన రైతులు సైతం ప్రస్తుతం వరిసాగుకే మొగ్గుచూపుతున్నారు. నాగారం, తుంగతుర్తి, అర్వపల్లి, ఆత్మకూర్‌(ఎస్‌), చివ్వెంల, పెన్‌పహాడ్‌ మండలాల వరకు ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ ద్వారా సాగు నీరు అందుతోంది. ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో సుమారు 2,20,764 ఎకరాలకు నీరందుతోంది. సాగర్‌, మూసీ, ఎస్సారెస్సీ పరిధిలో అవసరానికి మించి నీటిలభ్యత ఉండటంతో పత్తికి బదులు రైతులు వరి సాగుకే ఆసక్తి చూపుతున్నారు.


గత ఏడాదితో పోల్చితే 

గత ఏడాదితో పోల్చితే ప్రస్తుత వానాకాలం సీజన్‌లో పత్తి సాగు తగ్గింది. గత ఏడాది వానాకాలం సీజన్‌లో 10,44,254 ఎకరాల్లో పత్తి సాగుకాగా, ప్రస్తుతం 9,34,320 ఎకరాల్లో తెల్లబంగారం సాగైంది. గత ఏడాది సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పత్తి 1,51,183 ఎకరాల్లో సేద్యం కాగా, ఈ ఏడాది 1,01,320 ఎకరాల్లో సాగైంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 49,863 ఎకరాల విస్తీర్ణం తగ్గింది. యాదాద్రి జిల్లాలో గత వానాకాలంలో 1,82,635 ఎకరాల్లో పత్తి సాగుకాగా, ప్రస్తుతం 1,53,000 ఎకరాల్లో సేద్యమైంది. 29,635 ఎకరాల్లో పత్తి విస్తీర్ణం తగ్గింది. నల్లగొండ జిల్లాలో గత ఏడాది వానకాలం సీజన్‌లో 7,10,436 ఎకరాల్లో పత్తి సాగుకాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 6,80,000 ఎకరాల్లో సేద్యమైంది. మొత్తం మీద 30,436ఎకరాల పత్తి విస్తీర్ణం తగ్గింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం 1,09,934ఎకరాల్లో పత్తి విస్తీర్ణం తగ్గింది.


గత వానాకాలం, ప్రస్తుతం పత్తి సాగు ఇలా..

జిల్లా గత ఏడాది ప్రస్తుతం

(ఎకరాల్లో) (ఎకరాల్లో)

సూర్యాపేట 1,51,183 1,01,320 

యాదాద్రి 1,82,635 1,53,000       

నల్లగొండ 7,10,436 6,80,000

మొత్తం     10,44,254 9,34,320


సమృద్ధిగా నీరు లభిస్తుండటంతో పత్తి సాగు తగ్గింది : డి.రామారావునాయక్‌, వ్యవసాయ అధికారి, సూర్యాపేట జిల్లా 

సూర్యాపేట జిల్లాలో మూసీ, నాగార్జునసాగర్‌, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సమృద్ధిగా సాగు నీరు అందుతుండటంతో రైతులు పత్తి సాగును తగ్గించి వరిపై మొగ్గుచూపుతున్నారు. సాగు నీరు అందుబాటులో రావడంతో గతంలో పత్తి సాగైన భూములన్నీ వరిపొలాలుగా మారాయి. ఏటా పత్తి సాగు తగ్గుతూ వస్తోంది.

Updated Date - 2021-08-21T06:25:05+05:30 IST