ఎట్టకేలకు నియోజకవర్గ అభివృద్ధి
ABN , First Publish Date - 2021-08-25T05:59:11+05:30 IST
నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఎట్టకేలకు ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.

నిధులు విడుదల
ఉమ్మడి జిల్లాకు రూ.382కోట్లు
నల్లగొండ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఎట్టకేలకు ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏటా రూ.5కోట్ల నిధులు కేటాయిస్తానని సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. భారీ అభివృద్ధి పనులకు నిధులు లేకపోగా కనీసం సీడీపీ(నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం) ద్వారానైనా సమస్యలు తీర్చవచ్చని ప్రజాప్రతినిధులు భావించారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో 2018-19, 19-20, 20-21 ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. ఈ అంశంపై సర్వత్రా నిరసన, నిట్టూర్పులు ఎదురవుతుండటంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి, రెండు విడతల నిఽధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది. ఈ నిధుల్లో 40శాతం విద్యారంగానికే ఖర్చు చేయాలని నిబంధన విధించింది. ఉమ్మడి జిల్లాకు మొత్తం రూ.382.50కోట్లు విడుదలయ్యాయి. వీటిని జనాభా ప్రాతిపదికన ఖర్చు చేయాల్సి ఉంటుంది. జనరల్ విభాగానికి రూ.288.67కోట్లు, ఎస్సీలకు రూ.59.09కోట్లు, ఎస్టీలకు రూ.34.73కోట్లు కేటాయించారు.
నియోజకవర్గం జనరల్ ఎస్సీ ఎస్టీ మొత్తం
(రూ.లక్షల్లో)
దేవరకొండ 132.18 40.99 76.83 250
మిర్యాలగూడ 166.46 39.03 44.51 250
మునుగోడు 187.79 45.69 16.52 250
నాగార్జునసాగర్ 164.58 43.89 41.53 250
నకిరేకల్ 189.40 57.59 3.01 250
నల్లగొండ 198.48 48.12 3.40 250
లోకల్ బాడీ ఎమ్మెల్సీ 188.68 38.62 22.70 250
(చిన్నపరెడ్డి)
టీచర్ ఎమ్మెల్సీ 188.68 38.62 22.70 250
(ఎ.నర్సిరెడ్డి)
హుజూర్‌నగర్ 168.66 45.65 35.69 250
కోదాడ 173.25 51.88 24.87 250
సూర్యాపేట 162.92 49.05 38.03 250
తుంగతుర్తి 168.05 60.54 21.41 250
ఆలేరు 186.17 45.25 18.58 250
భువనగిరి 203.14 38.50 8.36 250
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ 188.68 38.62 22.70 250
(ఎ.కృష్ణారెడ్డి)
మొత్తం 28867.24 5909.66 3473.10 38250
నిధులు సకాలంలో వస్తేనే ప్రయోజనం
ఏటా రూ.5కోట్ల నిధులు అభినందించే విషయమే. అయితే అవి సకాలంలో విడుదలైతేనే ప్రయోజనం. ప్రతీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఈ నిఽధుల్లో 40శాతం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి కేటాయించాలనే నిబంధన ఉంది. ఇది స్వాగతించాల్సిన అంశం. నేను ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యా. నా నిధుల్లో అత్యధిక శాతం బడుల బాగుకోసమే వినియోగిస్తా. అయితే మూడేళ్లుగా రూపాయి బడ్జెట్ విడుదల కాలేదు. బడ్జెట్‌లో కేటాయిస్తే ప్రయోజనం లేదు. ఏటా సకాలంలో నిధులు విడుదల అయితేనే అభివృద్ధి పనులు పూర్తి చేయగలుగుతాం.
అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ