జడ్పీటీసీ హత్యకు కుట్ర?

ABN , First Publish Date - 2021-12-08T06:48:06+05:30 IST

సూర్యాపేట జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ జడ్పీటీసీ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేసినట్లు తెలిసింది. హత్య చేసేందుకు సుపారీ తీసుకున్న కిరాయి హంతకులు, నిందితులు పలుమార్లు సమావేశం కావటంతో విషయం బయటకు పొక్కింది.

జడ్పీటీసీ హత్యకు కుట్ర?

 కిరాయి హంతకులతో మంతనాలు 

ఆస్తి, పార్టీ తగాదాలతో హత్య చేయించేందుకు కారణం 

ముందే పసిగట్టిన జడ్పీటీసీ 

పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

రహస్యంగా విచారణ

నల్లగొండ, డిసెంబరు 7: సూర్యాపేట జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ జడ్పీటీసీ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేసినట్లు తెలిసింది. హత్య చేసేందుకు సుపారీ తీసుకున్న కిరాయి హంతకులు, నిందితులు పలుమార్లు సమావేశం కావటంతో విషయం బయటకు పొక్కింది. దీంతో అప్రమత్తమైన సంబంధిత జడ్పీటీసీ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో హత్య కుట్రను భగ్నం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోని జనగాం-సూర్యాపేట రహదారిపై ఉన్న ఓ మండలానికి చెందిన అధికార పార్టీ జడ్పీటీసీని అంతమొందించేందుకు ప్రతిపక్ష పార్టీకి చెందిన సమీప బంధువు పథకం రచించాడు. అందుకోసం అదే మండలానికి చెందిన మరికొందరి సహకారం తీసుకున్నాడు. వీరంతా కలిసి పలుమార్లు రహస్యంగా సమావే శమయ్యారు. హత్య చేసేందుకు సూర్యాపేటతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు నేరగాళ్లతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే రహస్య సమావేశాలు నిర్వహిస్తుండడంతో అది కాస్త అనుమానాలకు దారితీసింది. దీంతో అప్రమత్తమైన సంబంధిత జడ్పీటీసీ మరింత లోతుగా విషయాన్ని సేకరించటంతో అసలు విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో జిల్లా స్థాయి పోలీసు అధికారులు విషయాన్ని తీవ్రంగా పరిగణించి హత్యకు పథకం రచించిన సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా మరికొందరిని కూడా అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. అయితే జడ్పీటీసీని ఆయన సమీపబంధువు, ప్రతిపక్ష పార్టీకి చెందిన మండల నాయకుడే హత్య చేయించేందుకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. వారి కుటుంబాల మధ్య ఉన్న ఆస్తి తగాదాలు, పార్టీల పరంగా గతంలో, ఇటీవల నెలకొన్న వివాదాలే కారణంగా భావిస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న అదే ప్రాంత ప్రజాప్రతినిధులతో వివాదాలు ఉండటంతో వారి సహకారం ఏమైనా ఉందా అనే కోణంలోనే దర్యాప్తు కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న జడ్పీటీసీ వెంటనే తన ఇంటి వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తన రక్షణకు ఆయుధ లైసెన్సు కోసం కూడా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. త్వరలో జడ్పీటీసీ హత్యకు పన్నిన కుట్రకు సంబంధించిన కేసు వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.   

Updated Date - 2021-12-08T06:48:06+05:30 IST