ఎంజీనగర్‌తండాలో ఘర్షణ
ABN , First Publish Date - 2021-02-01T05:46:38+05:30 IST
భూ వివాదాల నేపథ్యంలో మండల పరిధిలోని ఎంజీనగర్‌తండాలో శనివారం రాత్రి ఘర్షణ జరిగింది.

చివ్వెంల, జనవరి 31: భూ వివాదాల నేపథ్యంలో మండల పరిధిలోని ఎంజీనగర్‌తండాలో శనివారం రాత్రి ఘర్షణ జరిగింది. ఎస్‌ఐ లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సర్పంచ్ కమల్‌నాథ్‌సింగ్, అదే గ్రామానికి చెందిన లక్ష్మాకు భూవివాదాలు ఉన్నాయి. తమపై దాడి చేస్తున్నారని లక్ష్మా, అతని భార్య సుశీల, కూతురు సరస్వతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి గ్రామంలో ఆటో కోసం వెళ్తున్నారు. మార్గమధ్యలో అదే గ్రామానికి చెందిన సర్పంచ్ రత్నావత్ కమల్‌నాథ్‌సింగ్ కుటుంబసభ్యులు రత్నావత్ నారాయణ, దేవత గౌతం, వెంకట్, వినయ్, రోషిత్ పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న లక్ష్మా, అతని భార్య, కూతురిపై దాడి చేశారు. అదే సమయంలో కమల్‌నాథ్‌సింగ్ అక్కడికి వచ్చి కేకలు వేయడంతో గొడవ మరింత ముదిరింది. దీంతో గ్రామస్థులు పెద్దసంఖ్యలో వచ్చి దాడి చేస్తున్న వారినుంచి లక్ష్మా కుటుంబసభ్యులను కాపాడారు. గాయపడిన లక్ష్మా, అతని భార్య సుశీల, కూతురు సరస్వతీలను పోలీసులు 108అంబులెన్స్ ద్వారా సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. లక్ష్మా పరిస్థితి విషమంగా ఉందని వారి బంధువులు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెటింగ్ సడుస్తున్నప్పటికీ చట్ట వ్యతిరేకంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు. లక్ష్మా కూతురు సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.