రండి.. చూసొద్దాం

ABN , First Publish Date - 2021-10-03T06:26:36+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు. ఎన్నో చారిత్రక కట్టడాలకు నెలవు. కృష్ణా, మూసీ నదీ తీరం, ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్‌, పలు ఆలయాల సమాహారంగా ఉమ్మడి జిల్లా పేరొందింది. ఈ నెల 6వ తేదీ నుంచి 12 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ఉన్నాయి.

రండి.. చూసొద్దాం

(ఆంధ్రజ్యోతి, యాదాద్రి, సూర్యాపేట)/నల్లగొండ క్రైం, దామరచర్ల, దేవరకొండ, చౌటుప్పల్‌ : ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు. ఎన్నో చారిత్రక కట్టడాలకు నెలవు. కృష్ణా, మూసీ నదీ తీరం, ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్‌, పలు ఆలయాల సమాహారంగా ఉమ్మడి జిల్లా పేరొందింది. ఈ నెల 6వ తేదీ నుంచి 12 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ఉన్నాయి. ఈ సెలవుల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎన్నో ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం..


చరిత్రకు సజీవ సాక్ష్యం

దేవరకొండ ఖిల్లా 700ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ని లుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అధికార చిహ్నమైన పూర్ణకుంభాన్ని అందించిన చరిత్ర దేవరకొండ కోటకు ఉంది. గిరి దుర్గంగా పేరుగాంచిన దేవరకొండ కోట 524ఎకరాల్లో, 550అడుగుల ఎత్తులో నిర్మితమై ఉంది. దీంతోపాటు చందంపేట మండలంలోని అటవీ ప్రాంతంలో మునుస్వామి గుట్టల్లో వెలిసిన పరమేశ్వరుడి ఆలయం పర్యాటక ప్రాంతం గా విలసిల్లుతోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎత్తిపోతలపథకం ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎమ్మార్పీ) ప ర్యాటకులను ఆకట్టుకుంటుంది. డిండి ప్రాజెక్టు, ఇక్కడ నై జాం కాలంలో నిర్మించిన బాపన్‌కుంట అతిథి గృహాలు చూ డదగినవి. నల్లగొండ నుంచి దేవరకొండకు 60కి.మీ. దేవరకొండ నుంచి 35కి.మీ దూరంలో దేవరచర్లతండా ఉండగా, అక్కడి నుంచి 1కి.మీ దూరం కాలినడకన మునుస్వామి గుట్టకు చేరుకోవచ్చు. ఏమ్మార్పీ దేవరకొండ నుంచి 33కి.మీ దూరంలో ఉంది. డిండి ప్రాజెక్టు  39కి.మీదూరంలో ఉంది.


ఏకశిలపై భువనగిరి కోట

సముద్ర మట్టానికి 609.6మీటర్ల ఎత్తులో ఏకశిల పర్వతంపై నిర్మించిన ఏకైక కోట భువనగిరి కోట. హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి పక్కన యాదాద్రి జిల్లా కేంద్రం ఉన్న ఈ కోట పర్యాటకులను ఎంతగానే ఆకట్టుకుంటోంది. ఎవరెస్ట్‌ పర్వతారోహకుడు బచేనపల్లి శేఖర్‌బాబు ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటుచేసిన రాక్‌ క్లైంబింగ్‌ శిక్షణ కేంద్రం ద్వారా ఈ ఖిల్లా అంతర్జాతీయస్థాయి గుర్తింపు లభించింది. 40ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోటను 12వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య పాలకుడు త్రిభునమల్ల విక్రమాధిత్య నిర్మించాడు. కోట చుట్టూ కందల్‌, ఆయుధ భాండాగారాలు, ఇతర నిర్మాణాలు ఉన్నాయి. నల్లగొండ నుంచి భువనగిరి 70కిలోమీటర్ల దూరంలో ఉంది. నల్లగొండ నుంచి 10 నిమిషాలకు ఓ బస్సు ఉంది. భువనగిరి ఖిల్లాతోపాటు ఇక్కడి నుంచి 18కి.మీ దూరంలో ఉన్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి లక్ష్మీనృసింహుడి ఆలయాన్ని దర్శించుకోవచ్చు.


నాగార్జునసాగర్‌ డ్యాం

ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్‌ జలాశయం ప్రస్తుతం నిండుకుండలా మారి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. సాగర్‌ డ్యాం, 1926లో చేపట్టిన తవ్వకాల్లో బయటపడిన శాతవాహనుల ధాన్యకూటకం, ఇక్ష్వాకుల రాజధాని శ్రీపర్వతం (విజయపురి), క్రి.పూ మూడో శతాబ్దంలో విరాజిల్లిన బౌద్ధనాగరిక కాలం నాటి స్మారకాలు భద్రపరిచిన కృష్ణానది మధ్యలో ఉన్న మ్యూజియం, అనుపు వాటర్‌ఫాల్స్‌, బుద్ధవనం ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. కృష్ణమ్మ ఒడిలో కొనసాగే లాంచీ ప్రయాణం పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి నాగార్జునసాగర్‌ 63కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది.


పానగల్‌ ఆలయాలు

నల్లగొండ పట్టణ పరిధిలోని పానగల్‌లో పచ్చల, ఛాయాసోమేశ్వరాలయాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పండుగలు, మహాశివరాత్రి, ఏకాదశి పర్వదినాల్లో ఇక్కడికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. 11వ శతాబ్ద కాలంలో ఈ ఆలయాలు నిర్మి తం కాగా, పక్కనే ఉన్న ఉదయసముద్రం చెరువు ఆహ్లాదకరంగా ఉం టుంది. పచ్చల సోమేశ్వరాలయంలో పురావస్తు మ్యూజియంలో పలు శిల్పకళాఖండాలు ఉన్నాయి. నల్లగొండ నుంచి పచ్చల సోమేశ్వరాలయం 2కి.మీ, ఛాయా సోమేశ్వరాలయం 4కి.మీ దూరంలో ఉంది.


 ఆలయాల  సమాహారం వాడపల్లి

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లిలో కృష్ణానది తీరంలో రెడ్డి రాజులు నిర్మించిన పలు ఆలయాలు, వాటి నిర్మాణశైలి చూపరులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి మీనాక్షి అగస్త్యేశ్వర, లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలతోపాటు కృష్ణా-మూసీ నదులు సంగమం చూడదగిన ప్రదేశాలు. తెలుగు రాష్ట్రాల్లోని పంచనృసింహ క్షేత్రాల్లో వేదాద్రి, కేతవరం, మట్టపల్లి, మంగళగిరిలతోపాటు వాడపల్లి ఒకటి. ఇక్కడి ఆలయ ప్రాంగణంలోని దేవతా వృక్షాన్ని కొలిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి వాడపల్లికి 69కిలోమీటర్లు. 


జైన దేవాలయం, రాచకొండగుట్టలు

కొలనుపాక జైన మందిరాలు, వీర, వైష్ణవ, శైవ మందిరాలు ఎంతో పేరుగాంచాయి. నల్లగొండ నుంచి 102కి.మీ దూరంలో ఉన్న కొలనుపాకకు భువనగిరి, ఆలేరు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. యాదాద్రి-రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం మండలాల్లో విస్తరించిన రాచకొండ గుట్టలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కొండలు, పచ్చని ప్రకృతి రమణీయత, పక్షుల కిలకిలారావాలు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి. రాచకొండలోని శివాలయం, ప్రాచీన దర్గా, రాచరికపు కట్టడాలను ఇక్కడ సందర్శించవచ్చు. నల్లగొండ నుంచి రాచకొండ గుట్టలు 78కి.మీ దూరంలో ఉండగా, ఇక్కడికి చౌటుప్పల్‌ నుంచి వెళ్లాల్సి ఉంటుంది.


ఉండ్రుగొండ గిరిదుర్గం

సూర్యాపేట పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి సమీపంలో వల్లభాపురం గ్రామంలో ఉండ్రుగొండ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం ఉంది. దేవాల యం చుట్టూ ఎత్తయిన కొండలతో ప్రకృతి రమణీతతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలనాటి రాజులు కట్టిన కొలిమిచావిడి, ఎనుగు దర్వాజ, ప్రాకారాలు, రాతి గోడలు, బురుజు లు, కోనేరు, గుర్రపు శాలలు, పురాతన బావులు దర్శనమిస్తాయి. ఉండ్రుగొండ గిరిదుర్గంపై 13 దేవాలయాలు ఉన్నాయి. వీటికి రెండు వేల ఏళ్లనాటి చరిత్ర ఉంది. క్రీస్తుశకం 1వ శతాబ్దం నుంచి 2వ శతాబ్దం వరకు పాలించిన రాజులు ఈ ప్రాంతాన్ని సైనిక శిబిరాలుగా వినియోగించారు. 15వ శతాబ్దంలో ప్రతాపరుద్ర గజపతి కొలిమిచావిడిని కేంద్రంగా చేసుకొని రాజ్యపాలన చేసినట్లు ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. నల్లగొండ నుంచి సూర్యాపేటకు 50 కిలోమీటర్లు.


పిల్లలమర్రి శివాలయాలు

కాకతీయుల శిల్పకళా వైభవానికి పెట్టింది పేరు సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామ దేవాలయాలు. సూర్యాపేటకు మూ డు కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి ఉంది. రెడ్డివంశీయులు కాకతీయులకు సేనలుగా, సామంతులుగా ఆమనగల్లు, ఎలకుర్తి, పిల్లలమర్రి రాజ్యాలను పరిపాలించారు. కాకతీయుల మహాసామంతుడైన బేతిరెడ్డి ఆమనగల్లును రాజధానిగా పరిపాలించే కాలంలో పిల్లలమర్రిని నిర్మించారు. రాజధానిని ఇక్కడికి మార్చి పిల్లలమర్రి బేతిరెడ్డిగా ఆయన ప్రఖ్యాతిగాంచాడు. క్రీస్తుశకం 1202లో రేచర్ల నామిరెడ్డి నామేశ్వరాలయాన్ని నిర్మించాడు. త్రికూట ఆలయంలో మూడు శివాలయాలు ఉన్నాయి. నామిరెడ్డి తన పేరుమీద నామేశ్వర, తల్లి పేరు మీద కాచేశ్వర, తండ్రి పేరు మీద కామేశ్వర లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరుక సానమ్మ 1208లో ఎరికేశ్వరాలయం నిర్మించింది.  చెన్నకేశ్వరస్వామి దేవాలయం కూడా ప్రసిద్ధిచెందినదే.


ఫణిగిరి బౌద్ధక్షేత్రం

నాగారం మండలం ఫణిగిరి గ్రామ సమీపంలో ఏకశిల కొండపై బౌద్ధక్షేత్రం ఎంతో ప్రసిద్ధిచెందినది. గౌతమ బుద్ధుడి శిష్యులు ఇక్కడ ఆరామాలు నిర్మించినట్టు తవ్వకాల్లో బయటపడిం ది. 900డిగ్రీల కోణంలో ఇక్కడ నిర్మించిన మహాస్తూపం ప్రధానమైంది. కొండపైన 16 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆరామాలు ఉన్నాయి.  సూర్యాపేట నుంచి ఫణిగిరికి 41కిలోమీటర్లు. వీటితోపాటు రెండేళ్లకు ఒకసారి నిర్వహించే దురాజ్‌పల్లి జాతర ప్రాంతం చివ్వెంల మండలం పెద్దగట్టు లింగమంతులస్వామి గుడి, పెన్‌పహాడ్‌ మండలంలో నాగులపహాడ్‌ శివాలయాలు, మేళ్లచెరువు స్వయంశంభులింగేశ్వరస్వామి, నేరేడుచర్ల మండలం జాన్‌పహాడ్‌, మఠంపల్లి నృసింహుడి ఆలయాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. మరి ఆలస్యమెందుకు ఈ దసరా సెలవుల్లో వీటిని చూసొద్దాం..

Updated Date - 2021-10-03T06:26:36+05:30 IST