ఇల వైకుంఠం

ABN , First Publish Date - 2021-03-05T06:25:27+05:30 IST

ఇల వైకుంఠం

ఇల వైకుంఠం
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఆలయ ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి

దేదీప్యమానంగా వెలిగేలా విద్యుదీపాలంకరణ

అర్చకులకు నివాస సముదాయం

తిరుమల తరహాలో పూజా కైంకర్యాలు

నిర్వాసితులకు మడిగెలు, ఇంటి స్థలం

మే నెలలో ఆలయ ఉద్ఘాటన

ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఆరుగంటలపాటు పర్యటన

యాదాద్రి, మార్చి4(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఇలా వైకుంఠంలా తీర్చిదిద్ది మే మాసంలో ఉద్ఘాటన ముహూర్తానికి సిద్ధం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ గురువారం పరిశీలించారు. మధ్యాహ్నం 12.07గంటలకు హెలీకాప్టర్‌ ద్వారా హైదారాబాద్‌ నుంచి పెద్దగుట్టపైకి చేరిన సీఎం కేసీఆర్‌ సాయంత్రం 5.55కు తిరుగు ప్రయాణమయ్యారు. సుమారు ఆరుగంటల పాటు ఆలయ ప్రాంగణంతో పాటు, కొండపై అనుబంధ పనులు, కొండ కింద అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

వైకుంఠాన్ని తలపించేలా ఆలయ ప్రాంగణం

భక్తులు వైకుంఠంలో సంచరిస్తున్నామనే తలంచేలా యాదాద్రి ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. దేవతల చరిత్రలతో పాటు ప్రహ్లాద, నృసింహ ఆవిర్భావ ఘట్టాలు భక్తుల కనులకు కట్టేలా ఆలయ ప్రాకార మండపాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవాలయాన్ని దూరం నుంచి చూసేవారికి పైతం భక్తిభావం కలగాలన్నారు. దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్మేలా విద్యుదీపాలంకరణ ఉండాలన్నారు. చైనా దేశంలో ఓ మాల్‌లో ఏర్పాటు చేసిన లైటింగ్‌ ఏడు కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుందని, దీన్ని పరిశీలించేందుకు ఆ దేశానికి వెళ్లిరావాల్సిందిగా సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డిని ఆదేశించారు. ఆలయ తుది మెరుగులు చేపడుతున్నందున దేశంలోని ఇతర ఆలయాల్లో శిల్ప సంపదను పరిశీలించి, ఇక్కడ మెరుగైన రీతిలో చేపట్టాలని ఆదేశించారు. అద్దాల మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్నారు.

శివాలయ ప్రాకారం ఎత్తు తగ్గింపునకు ఆదేశం

యాదాద్రి కొండపై పర్వత వర్ధని రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాకార గోడను ఎత్తు తగ్గించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. శివాలయం గోపురాలు కనిపించకుండా ప్రాకార గోడ ఎత్తుగా ఉందని, వెంటనే దీన్నితగ్గించాలన్నారు. దీంతో కొండపైకి వచ్చిన ప్రతీ భక్తుడికి శివాలయ గోపురాలు స్పష్టంగా కనిపిస్తాయన్నారు. శివాలయం ద్వారాలకు ఇత్తడి తొడుగులు అమర్చాలన్నారు. లోహపు క్యూ లైన్లను ప్రసాదాల కాంప్లెక్స్‌ గోడ వెంట ఏర్పాటు చేయాలన్నారు.

ఆలయం చెంతనే అర్చకులకు నివాసం

తిరుపతి తరహాలో యాదాద్రీశుడికి సేవలు అందించేలా అర్చకులు కార్యాచరణ రూపొందించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. అర్చకులు, సిబ్బందికి ఆలయ సమీపంలోనే అన్ని వసతులతో నివాస సముదాయం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమలకు దీటుగా నిత్య పూజా కైంకర్యాలు వైభవంగా నిర్వహించాలని అర్చకులకు సూచించారు. ఓడిషాలోని పూరీ జగన్నాథ ఆలయంలో మాదిరిగా విశ్రాంత అర్చకులు, పేద బ్రాహ్మణుల భుక్తి కోసం భక్తుల నుంచి కానుకలు స్వీకరించి జీవన భృతి కొనసాగించే విధంగా యాదాద్రి కొండపై ప్రత్యేక మండపం ఏర్పాటు చేయాలన్నారు. అందుకు పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించాలన్నారు. ఉద్ఘాటన తర్వాత నిత్యం 50వేలకు తగ్గకుండా భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామన్నారు. స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో ఇతర దేవాలయాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. అందుకు అవసరమైన ఉద్యోగులను నియమించాలన్నారు. ఉద్యోగులతో పాటు ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యమైన శిల్పులకు సైతం ఇళ్ల స్థలాల కేటాయింపును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

నిర్వాసితులకు మడిగెలు, ఇంటి స్థలం

యాదాద్రి పునర్నిర్మాణం, రహదారి విస్తరణలో నష్టపోతున్న నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత కోరిక మేరకు నిర్వాసితులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పాతగుట్ట చౌరస్తా, వైకుంఠ ద్వారం వద్ద ప్రధాన రహదారి విస్తరణ నిర్వాసితుల సంఘం కన్వీనర్‌ డాక్టర్‌ ముడుంబై గిరిధర్‌ ఆధ్వర్యంలో గంట పాటు పరిహారం, పునరావాస చర్యలపై చర్చించారు. గండి చెరువు, కల్యాణ కట్ట ప్రాంతంలో ప్రత్యేకంగా వంద గజాల్లో మడిగెలు నిర్మించి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. సైదాపురం శివారులో 200గజాల ఇంటి స్థలం పట్టాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. కొండపై దుకాణదారులకు టెంపుల్‌ సిటీలో లీజ్‌ పద్ధతిలో కేటాయింపులు చేస్తామని, స్థానికులకు ఉద్యోగాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం చెప్పారు. సీఎం వెంట ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ జి.కిషన్‌రావు, ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఎస్‌ఈలు గణపతిరెడ్డి రవీందర్‌రావు, ఆలయ ఈవో గీతారెడ్డి, ఆర్కిటెక్‌ ఆనందసాయి, స్థపతి ఆనందచారి వేలు, వాస్తు సలహాదారుడు సుద్దాల అశోక్‌ తేజ తదితరులు ఉన్నారు.

యాదాద్రీశుడి పూజల్లో సీఎం

యాదాద్రి టౌన్‌: యాదాద్రికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆలయ సంప్రదాయ ప్రకారం అర్చకబృందం పూర్ణకుంభ స్వాగతం పలికింది. అనంతరం బాలాలయంలో సువర్ణ ప్రతిష్ఠ అలంకారమూర్తులను సీఎం దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం సీఎంకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి అర్చకులు మహదాశీర్వచనం చేశారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో నిత్య కైంకర్యాలను గంట ముందుగానే ముగించారు. కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించలేదు. సీఎం వెళ్లాక భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. సీఎం పర్యటన నేపథ్యంలో అదనపు సీపీ సుధీర్‌ బాబు, డీసీపీ కె.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 11 మంది ఏసీపీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్‌ఐలు, 555 మంది ఏఎ్‌సఐలు బందోబస్తులో పాల్గొన్నారు.



Updated Date - 2021-03-05T06:25:27+05:30 IST