కాంగ్రెస్‌ గూటికి చెరుకు సుధాకర్‌

ABN , First Publish Date - 2021-12-08T06:37:05+05:30 IST

తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ ఈ నెల 14వ తేదీన కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారైనట్టు సమాచారం.

కాంగ్రెస్‌ గూటికి చెరుకు సుధాకర్‌
చెరుకు సుధాకర్‌, జిట్టా బాలకృష్ణారెడ్డి

ఢిల్లీ, హైదరాబాద్‌ నేతలతో ముగిసిన చర్చలు

14న  నల్లగొండలో భారీ సభ

నల్లగొండ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ ఈ నెల 14వ తేదీన కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారైనట్టు సమాచారం. తేదీపై ఇంకా స్పష్టత లేకపోయినా ఈ నెలలోనే కాంగ్రె్‌సలో చేరడం ఖాయమైంది. ఒక ప్రాంతీయ పార్టీని ఒక జాతీయ పార్టీలో విలీనం చేస్తున్న సందర్భం కావడంతో సుధాకర్‌ చేరికకు ఢిల్లీనే వేదిక కానుంది. యువనేత రాహుల్‌గాంధీ లేదా సీనియర్‌ నేత మల్లిఖార్జున్‌ ఖర్గేల నుంచి ఆయన కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. జిల్లా నాయకులతో సంబంధం లేకుండా చెరుకు  చేరికకు ఢిల్లీ నుంచే ఊతం అందింది. ఏఐసీసీలో కీలక నేత కొప్పుల రాజు, బీసీ నాయకుడు కత్తుల వెంకటస్వామిలు ప్రయత్నాలు ప్రారంభించగా అది ఫలప్రదమైంది. ఆ తరువాత దశల వారీగా ఢిల్లీలో చర్చలు జరిగాయి. చివరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికంఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలు ఇటీవల ఢిల్లీలో సమావేశమై చెరుకు చేరికకు ముహూర్తం ఖరారు చేశారు. ఆయన చేరిక ఖాయం కావడంతో జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ దిగ్గజాలు కొందరు సైతం చెరుకు సుధాకర్‌ను ఫోన్‌లో సంప్రదించినట్టు సమాచారం. విఠల్‌, తీన్మార్‌ మల్లన్న వంటి బీసీ సామాజిక వర్గ నేతలు కమలం గూటికి చేరడంతో కాంగ్రెస్‌ నేతల్లో కదలిక మొదలైంది. చర్చల్లో ఉన్న చెరుకు చేరిక అంశాన్ని వేగవంతం చేసి ముహూర్తం ఖరారు చేశారు. చెరుకు సుధాకర్‌ చేరిక నేపథ్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో భారీ సభ నిర్వహించే ఆలోచనలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నట్టు తెలిసింది. చెరుకు సుధాకర్‌తోపాటు ఆయన భార్య లక్ష్మి, కుమారుడు సుహాస్‌ కుటుంబం కూడా ఒకే సారి కాంగ్రె్‌సలో చేరనున్నారు. చెరుకు కుటుంబం చేరికతో నకిరేకల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన అభ్యర్థి దొరికినట్టే అవుతుంది.  

జిట్టా బాలకృష్ణారెడ్డి ఎటో?

యువతెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి సైతం తన పార్టీని ఓ జాతీయ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధపడ్డారు. అయితే తనకు సరైన వేదిక కాంగ్రెసా? బీజేపీనా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. ఇరు పార్టీల పెద్దలతోనూ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణి రుద్రమ చర్చల్లో ఉన్నారు. వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన రుద్రమ బీజేపీ వైపు మొగ్గుచూపుతుండగా జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ వైపు ఆసక్తిగా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒకే పార్టీలో చేరేది ఉంటే విలీనం చేయాలని; లేదంటూ రుద్రమ ముందుగా బీజేపీలో చేరితే ఆ తరువాత జిట్టా కాంగ్రె్‌సలో విలీనం కావాలనే ఆలోచనల్లో ఉన్నట్టు సమాచారం. భువనగిరి ఎంపీగా లేదంటే ఎమ్మెల్యేగా బరిలో ఉండాలని; అది ఏ పార్టీలో సాధ్యమవుతుందనే లెక్కల్లో జిట్టా ఉన్నట్టు తెలిసింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రె్‌సలో ఉంటారా? బీజేపీలో చేరతారా? ఆయన భువనగిరికేంద్రంగానే పావులు కదుపుతున్న నేపఽథ్యంలో జిట్టా వేచి చూస్తున్నట్టు సమాచారం. వెంకటరెడ్డి పార్లమెంటు స్థానాన్ని వదిలి నల్లగొండ అసెంబ్లీకి వెళతారా? లేదా? అన్న అంశాలను జిట్టా బేరీజు వేసుకుంటున్నారు.

Updated Date - 2021-12-08T06:37:05+05:30 IST