అదుపు తప్పి కారు బోల్తా : ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-10-20T06:34:33+05:30 IST

కూతురు పెళ్లికి అప్పు కోసం వెళ్లిన తండ్రి కానరాని లోకాలకు వెళ్లాడు. కారు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో మృతి చెందాడు.

అదుపు తప్పి కారు బోల్తా : ఒకరి మృతి
బానోతు సైదా(ఫైల్‌)

చివ్వెంల, అక్టోబరు 19 : కూతురు పెళ్లికి అప్పు కోసం వెళ్లిన తండ్రి కానరాని లోకాలకు వెళ్లాడు. కారు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం కుడకుడ సమీపంలో సూర్యాపేట- దంతాలపల్లి రహదారిపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మోతె మండలం బీక్యాతండా గ్రామానికి చెందిన బానోతు సైదా(36) ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నెమ్మికల్‌లో పంక్చర్‌షాప్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తన కూతురు పెళ్లి నిశ్చయం కావడంతో పెళ్లి అవసరాల కోసం అప్పు కావాలని కుడకుడకు చెందిన స్నేహితుడు చల్ల పెదనాగరాజును అడిగాడు. దీంతో సైదాతో పాటు పెదనాగరాజు, ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఏనుబాముల గ్రామానికి చెందిన బోళ్ల కరుణాకర్‌రెడ్డి కలిసి పెదనాగరాజు భార్య కారులో మిర్యాలగూడకు వెళ్లి నగదు తీసుకొని నెమ్మికల్‌కు వచ్చారు. అనంతరం నాటుకోళ్ల కోసమని నెమ్మికల్‌ నుంచి కుడకుడకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో కుడకుడ సమీపంలో సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై పెద్దగుంట వద్ద సడెన్‌ బ్రేక్‌ వేయడంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సైదా అక్కడికక్కడే మృతిచెందగా, పెదనాగరాజుకు, కరుణాకర్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-10-20T06:34:33+05:30 IST