బస్వాపురం నుంచి యాదాద్రికి కేబుల్‌ బ్రిడ్జి

ABN , First Publish Date - 2021-01-12T05:43:11+05:30 IST

హైదరాబాద్‌ నగరానికి అత్యంత చేరువలో..

బస్వాపురం నుంచి యాదాద్రికి కేబుల్‌ బ్రిడ్జి
కేబుల్‌ బ్రిడ్జి ఏర్పాటుకు ప్రతిపాదిత ప్రాంతం

సీఎం కేసీఆర్‌ నిర్ణయం

ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించిన స్మితా సబర్వాల్‌ 

థీమ్‌పార్క్‌ అభివృద్ధికి సన్నాహాలు 


(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్‌ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌ నుంచి యాదాద్రి దివ్య క్షేత్రం వరకు కేబుల్‌ బ్రిడ్జిని ఏర్పాటు చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, అదేశాఖకు చెందిన ముగ్గురు ఈఎన్‌సీలు బస్వాపూర్‌ రిజర్వాయర్‌ పరిసరాలను ఈనెల 10న పరిశీలించారు. హెలికాప్టర్‌ ద్వారా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ను సందర్శించిన ఉన్నత స్థాయి అధికారులు ఏరియల్‌ వ్యూ ద్వారా యాదాద్రి నుంచి బస్వాపూర్‌ మార్గాన్ని పరిశీలించారు. 


హైదరాబాద్‌ నగరానికి అత్యంత చేరువలో తిరుమలస్థాయిలో దేశంలోనే అద్భుత ఆలయంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. కొద్ది నెలల్లోనే ఆలయ ఉద్ఘాటన తర్వాత యాదాద్రి ఆలయాన్ని దేశ, విదేశాలకు చెందిన భక్తులు సందర్శించనున్నారు. అయితే యాదాద్రి ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఆహ్లాదం కల్పించడానికి ఆలయ పరిసరాలను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. దీనిలో భాగంగానే 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణంలో ఉన్న బస్వాపూర్‌ రిజర్వాయర్‌ వద్ద మైసూరులోని బృందావన్‌ గార్డెన్‌స్థాయిలో థీమ్‌ పార్క్‌ను అభివృద్ధి చేయడానికి పర్యాటక శాఖ సన్నాహాలు ప్రారంభించింది. అయితే యాదాద్రి నుంచి ఈ థీమ్‌ పార్క్‌ వరకు ప్రధాన ఆకర్షణగా భక్తుల రాకపోకల సౌలభ్యం కోసం యాదాద్రి సమీపంలోని పెద్దగుట్టనుంచి బస్వాపూర్‌ రిజర్వాయర్‌ కట్టవరకు కేబుల్‌ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈకేబుల్‌ బ్రిడ్జి ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోవడానికి  సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌ హెలికాప్టర్‌లో యాదాద్రి మీదుగా బస్వాపూర్‌ వరకు ఈనెల 10న ఏరియల్‌ సర్వే చేశారు. అనంతరం బస్వాపూర్‌ రిజర్వాయర్‌ పరిసరాలను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 


శిల్పారామం పనులకు శ్రీకారం 

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా రాయగిరి చెరువు సమీపంలోని శిల్పారామం నిర్మాణ పనులకు వైటీడీఏ అధికారులు శ్రీకారం చుట్టారు. ఈమేరకు గత అక్టోబరులో స్వాగత తోరణం పనులను ప్రారంభించారు. యాదాద్రి క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా వైటీడీఏ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా రాయిగిరి చెరువు వద్ద శిల్పారామంతోపాటు బోటింగ్‌ సౌకర్యాలను కల్పించనున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను శిల్పారామంలో పొందుపర్చనున్నారు. ఆడిటోరియం, ల్యాండ్‌ స్కేపింగ్‌ గార్డెన్‌లు, ఉద్యానవనాలు, రెస్టారెంట్‌ నిర్మించనున్నారు. ఈ మేరకు పనులను ప్రారంభించిన అధికారులు త్వరలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపారు.  


యాదాద్రి విస్తరణ పనుల పరిశీలన 

యాదాద్రి ఆలయ విస్తరణ పనులను వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి సోమవారం పరిశీలించారు. విస్తరణ పనులు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి పనులను పూర్తిచేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రధానాలయం, శివాలయం పుష్కరిణి, తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పనుల పురోగతి నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పుష్కరిణి పక్కన ఎస్కలేటర్‌, దర్శన క్యూ కాంప్లెక్స్‌ పనుల తీరుపై ఆరాతీశారు. ప్రధాన ఆలయంతోపాటు తిరువీధులు ప్రాకార మండపాల్లో తుది మెరుగులు దిద్దేపనులు త్వరగా పూర్తికావాలని ఆదేశించారు. అంతకుముందు ఆయన యాదాద్రి లక్ష్మీనృసింహుడిని దర్శించుకొని ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు.  


బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు 

యాదాద్రి టౌన్‌: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు దేవస్థాన అధికారులు రెండు నెలల ముందుగానే సన్నాహాలు ప్రారంభించారు. అయితే ఫిబ్రవరి 18న పాతగుట్ట ఆలయ వార్షిక అధ్యయనోత్సవాలు, 22 నుంచి బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి. అదేవిధంగా మార్చి 15వ తేదీ నుంచి 25వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం యాదాద్రి లక్ష్మీనరసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో దేవస్థాన ఈవో గీతారెడ్డి సోమవారం సహాయక కార్యనిర్వాహక అధికారులు, పర్యవేక్షకులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న  నేపథ్యంలో ఉద్ఘాటనకు ఉత్సవాల సమయంలో ముహూర్తాలు లేకపోవడంతో ఈఏడాది కూడా బ్రహ్మోత్సవాలను బాలాలయ గడపలోనే నిర్వహించనున్నారు.


గతేడాది ఉత్సవాలను కరోనా ప్రభావంతో పరిమితసంఖ్యలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణను కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా ఏవిధంగా చేపట్టాలి అనే యోచనలో అధికారులు సమాయత్తమయ్యారు. పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలకు యథావిధిగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తులు పెద్దసంఖ్యలో వీక్షించనున్న నేపథ్యంలో కొవిడ్‌-19 నిబంధనల మేరకు ఉత్సవాల నిర్వహణ తదితర అంశాలతో కూడిన నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్‌కు పంపించనున్నట్లు సమాచారం. కమిషనర్‌ ఉత్తర్వులకు లోబడి యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిసింది. 


కొండ కింద కల్యాణం.. రథోత్సవంపై సంశయం 

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం ఉత్సవాలను బాలాలయ గడపలోనే నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో విశేష పర్వదినాలైన ఎదుర్కోలు మహోత్సవం, బ్రహ్మోత్సవ తిరుకల్యాణం, రథోత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. స్వామివారి ఉత్సవ వేడుకలను అశేష భక్త జనులు వీక్షించేందుకు వీలుగా వైభవోత్సవ కల్యాణం, దివ్యవిమాన రథోత్సవాలను కొండకింద నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది కొవిడ్‌-19 నిబంధనల మేరకు ఈవిశేష ఉత్సవాలను కొండకింద నిర్వహించాలా.. వద్దా.. అనే అంశంపై అధికారుల్లో సంశయం నెలకొంది.  


యాదాద్రికి చేరిన శివాలయ కలప ద్వారాలు 

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా శివాలయ గర్భగుడి ప్రధాన కలప ద్వారాలు, ధ్వజస్తంభం పైభాగంలో అమర్చే మేఖలాలు  సోమవారం యాదాద్రికి చేరాయి. ప్రధానాలయ ద్వారాలతోపాటు శివాలయ ద్వారాలను హైదరాబాద్‌లోని అనురాధ టింబర్‌ డిపోలో తయారు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-12T05:43:11+05:30 IST