వ్యర్థాలతో పంట పొలాలు బుగ్గి

ABN , First Publish Date - 2021-09-03T06:25:15+05:30 IST

మండల పరిధిలోని ధర్మాజీగూడెం గ్రామంలో పరిశ్రమల నుంచి వదులుతున్న వ్యర్థ రసాయనాలతో పచ్చని పొలాలు మాడిపోతున్నాయి.

వ్యర్థాలతో పంట పొలాలు బుగ్గి
కాలుష్యపు నీరు పారి మాడిపోయిన వరి పైరు

 మాడిపోతున్న వరి పైర్లు
చెరువులు కాలుష్యమయం
 ఆత్మహత్యే శరణ్యమంటున్న రైతులు

చౌటుప్పల్‌ టౌన, సెప్టెంబరు 2 :
మండల పరిధిలోని ధర్మాజీగూడెం గ్రామంలో పరిశ్రమల నుంచి వదులుతున్న వ్యర్థ రసాయనాలతో పచ్చని పొలాలు మాడిపోతున్నాయి. భూగర్భ జలాలు రంగు మారడంతో పాటు, స్వచ్ఛమైన వాతావరణం కలుషితమవుతోంది. కలుషిత నీరు పంట పొలాలోకి వెళ్లకుండా రైతులు గోడలను కట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే ఈ ప్రాంత  రైతులు తమ భూములను వదిలిపెట్టాల్సిన పరిస్థితి తలెత్తుంది. దీంతో పాటు ఈ వ్యర్థాలతో చెరువులు సైతం కాలుష్యమయం అవుతున్నాయి. 10రోజులుగా కు రుస్తున్న వర్షాలకు  పరిశ్రమలోని వ్యర్థాలను వరద నీటిలో కలిపి వదులుతున్నారు. ఈ కలుషిత నీరు రైతుల పంట పొలాల నుంచి సుమారు 2కి.మీ పొడవున ప్రవహించి లక్కారం చెరువులోకి చేరుతున్నాయి. ఈ చెరువు అలుగు పారుతుండడంతో చౌటుప్పల్‌ చెరువులోకి ప్రవహిస్తున్నాయి. వరి పొలాల నుంచి కలుషిత నీరు నిరంతరాయంగా ప్రవహిస్తుండడంతో తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రసాయన పరిశ్రమలకు సమీపంలోని కొంత మంది రైతులకు చెందిన వరి పొలాలు రసాయనాల తీవ్రతకు మాడిపోయాయి. ఈ ప్రాంతంలోని రైతులకు చెందిన బోరు బావుల్లోని నీరు సైతం కలుషితమైంది. జూలై మాసంలో కురిసిన వర్షాలకు దాదాపుగా 15రోజుల పాటు ఈ వరి పంట పొలాల నుంచి కలుషిత నీరు లక్కా రం చెరువులోకి ప్రవహించింది. ప్రస్తుతం మళ్లీ ఐదారు రోజులుగా కాలుష్యపు నీరు వరి పంట పొలాల నుంచి ప్రవహిస్తుండడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచారంగా మారింది. అదేవిధంగా పరిశ్రమల కాలుష్యపు నీటితో చెరువులలోని చేపలకు సైతం ముప్పు పొంచి ఉంది. చౌటుప్పల్‌లోని మునిసిపాలిటీలోని లక్కారం, చౌటుప్పల్‌ చెరువులోకి ప్రమాదకరమైన కాలుష్యపు నీరు  ప్రవహిస్తోంది.
ఉద్యమాలకు సిద్ధమవుతున్న రైతులు
పరిశ్రమల కాలుష్యంపై ధర్మాజీగూడెం గ్రామానికి చెందిన రైతులు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. కలుషితమైన నీటితో వరి పొలాలకు తీవ్రమైన నష్టం వాటిల్లడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కా లుష్యంపై ఇప్పటికే పలుమార్లు పరిశ్రమల యాజమాన్యాలను రైతులు నిలదీయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. కాలుష్య నియంత్రణకు ప్రభు త్వం  తగిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆత్మహత్యలే శరణ్యమం టు ఇద్దరు మహిళా రైతులు కన్నీరు పెట్టుకున్నారు. కొద్దిపాటిగా ఉన్న భూమిలో సాగు చేసిన వరి పంట పరిశ్రమల కలుషిత జలాలు నాశనం చేశాయని వారు తెలిపారు. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పరిశ్రమల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వరి పంటకు తీవ్ర నష్టం

- సామిడి అచ్చిరెడ్డి , రైతు, ధర్మాజీగూడెం
రసాయన పరిశ్రమల కాలుష్యపు నీరు వరి పంట పొలాల నుంచి వెళ్తుండడంతో తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. నెల రోజుల క్రితం ఇదే మాదిరిగా 15రోజుల పాటు రసాయన పరిశ్రమల కాలుష్యపు నీరు పొలాల నుంచి ప్రవహించింది. పరిశ్రమల వ్యర్థ రసాయనాలతో  పంటలకు తీవ్ర నష్టం జరుగుతోంది. నష్టపోయిన వరి పంటలకు యాజమాన్యాలు తగిన నష్ట పరిహారం చెల్లించాలి. లేనిపక్షంలో పరిశ్రమల ఎదుట ఆందోళన నివహిస్తాం.
ప్రజా ఉద్యమాలు తప్పవు
పరిశ్రమల యాజమాన్యాలు కాలుష్యపు నివారణ చర్యలను తీసుకోకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవు. వ్యర్థ రసాయనాలు వర్షపు నీటిలో కలిసి ప్రవహిస్తుండడంతో  వరి పొలాలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇప్పటికే భూగర్బ జలాలు కలిషితమై సాగునీటికి ఉపయోగపడడం లేదు. వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న కాలుష్య పరిశ్రమలపై తగిన చర్యలను తీసుకోవాలి. ఈ సమస్యపై  త్వరలోనే ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తాం.
- సామిడి నాగరాజురెడ్డి, డీవైఎ్‌ఫఐ మండల అధ్యక్షుడు

Updated Date - 2021-09-03T06:25:15+05:30 IST