ముంపు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి
ABN , First Publish Date - 2021-12-30T16:33:40+05:30 IST
కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపురం వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బీఎన్‌తిమ్మాపురం నిర్వాసితులకు పరిహారం..

భువనగిరి రూరల్, డిసెంబరు 29: కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపురం వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బీఎన్‌తిమ్మాపురం నిర్వాసితులకు పరిహారం వెంటనే చెల్లించి పునరావాసం కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ముంపు నిర్వాసితులతో కలిసి కలెక్టరేట్ ఎదుట బుధవారం నిరసన తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ డి.శ్రీనివా్‌సరెడ్డి, ఆర్డీవో ఎంవీ.భూపాల్‌రెడ్డితో కలిసి రిజర్వాయర్ నిర్మాణంలో 1670ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ అందజేసి, ఇప్పటి వరకు 400ఎకరాలకు మాత్రమే పరిహారం ఇవ్వడం సరికాదన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద భువనగిరి శివారులోని హుస్సేనాబాద్ వద్ద ఏర్పాటు చేస్తున్న పునరావాస పనులను త్వరితగతిన చేపట్టాలని కోరారు. 18సంవత్సరాలు నిండిన యువతీయువకులందరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందచేయాలని అధికారుల దృష్టికి తీసుకవెళ్లారు. ఈ సమస్యలను సీఎం దృష్టికి తీసుకవెళ్లి నిర్వాసితులందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ముంపు నిర్వాసితుల సంఘం ప్రతినిధులు వల్దాసు రాజు, వల్లందాసు గండయ్య, శ్రీను, నర్సింహ, బాలయ్య, ఉపేందర్, లింగారెడ్డి, మోహన్‌రెడ్డి ఉన్నారు.