రేషన్‌పై నీలినీడలు

ABN , First Publish Date - 2021-05-05T07:01:53+05:30 IST

రేషన్‌ బియ్యం పంపిణీపై కరోనా కత్తి వేలాడుతోంది. నెల రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో 10మంది డీలర్లు ఈ మహమ్మారికి బలవడం కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో థర్డ్‌ పార్టీ ద్వారా ధ్రువీకరణకు అవకాశం ఇస్తేనే బియ్యం పంపిణీ చేస్తామని డీలర్లు అంటున్నారు.

రేషన్‌పై నీలినీడలు

ఉమ్మడి జిల్లాలో తెరుచుకోని 1982 దుకాణాలు

9.32లక్షల మంది పేదలకు అందని చౌక బియ్యం

ఉమ్మడి జిల్లాలో కరోనాతో 10మంది మృత్యువాత

100 మంది డీలర్లు ఆస్పత్రిపాలు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): రేషన్‌ బియ్యం పంపిణీపై కరోనా కత్తి వేలాడుతోంది. నెల రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో 10మంది డీలర్లు ఈ మహమ్మారికి బలవడం కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో థర్డ్‌ పార్టీ ద్వారా ధ్రువీకరణకు అవకాశం ఇస్తేనే బియ్యం పంపిణీ చేస్తామని డీలర్లు అంటున్నారు. అప్పటి వరకు రేషన దుకాణాలు తెరిచేది లేద ని తేల్చి చెబుతుండగా, అధికారులు మాత్రం దుకాణాలు తీయాల్సిందే అని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతి నెల 2వ తేదీ నాటికి చౌక బియ్యం తీసుకొని కుటుంబాన్ని పోషించుకునే పేదలు అటు డీలర్లు, ఇటు అధికారుల పోరు మధ్య నలిగిపోతున్నారు. ఈ నెల 4వతేదీ ముగిసినా రేషన్‌ బియ్యం అందక ఆందోళన చెందుతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో అదనంగా బియ్యం అందుతాయని పేదలు ఆశ పెట్టుకోగా, ఇవ్వాల్సిన బియ్యమే సకాలంలో రాకపోవడం గమనార్హం.


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1982 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 9.32లక్షల మంది పేద కుటుంబాలకు ప్రతి నెలా 1.38లక్షల క్వింటా ళ్ల బియ్యం పంపిణీ జరుగుతోంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి నెలకు ఆరుకిలోల చొప్పున రూపాయికి కిలో బియ్యం సుమారు 27.96క్షల మందికి పంపిణీ జరుగుతోంది. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకుల పంపిణీ చేయాల్సి ఉంటుంది. కరోనా దృష్ట్యా మే, జూన్‌ నెలల్లో ఒక్కొక్కరికి 10కేజీల చొప్పున పంపిణీ చేస్తారని ప్రచారం జరిగినా, ఇంకా అధికారిక ఉత్తర్వులు అందకపోవడంతో ఎప్పటి మాదిరిగానే ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని డీలర్లకు అధికారులు సూచించారు. ఇదే క్రమంలో కరోనా ఉధృతి దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో రేషన్‌ డీలర్లు మృత్యువాత పడుతుండటం వారిలో ఆందోళన కలిగిస్తోంది. డీలర్ల సంఘం రాష్ట్ర, జిల్లా శాఖలు ఇదే అంశంపై లోతుగా చర్చించి దుకాణాలు తీయాలంటే థర్డ్‌ పార్టీ ధ్రువీకరణకు ఏర్పాట్లు చేయాలని, అప్పటి వరకు బియ్యం పంపిణీ చేయలేమని అధికారులకు లిఖితపూర్వకంగా వినతి అందజేశారు. ఐరిష్‌ విధానంలో బియ్యం పంపిణీ చేస్తే కరోనా సోకే ప్రమా దం ఎక్కువగా ఉందని డీలర్లు అభిప్రాయపడుతున్నారు.


ఉమ్మడి జిల్లాలో 10 మంది డీలర్లు మృతి

కరోనా తొలి, రెండో దశలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 55మంది మృత్యువాతపడ్డారు. సుమారు 400మంది డీలర్లు కొవిడ్‌తో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 1500 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. గతం లో వేలి ముద్రల ద్వారా రేషన్‌ పంపిణీ జరగ్గా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐరిష్‌ లేదంటే ఫోన్‌ ఓటీపీ విధానాన్ని అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు, నిరక్షరాస్యులు ఉన్నందున ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ని వారి ఫోన్లు తీసుకొని డీలర్లే స్వయంగా ఎంటర్‌ చేయాల్సి వస్తోంది. ఇలా వైరస్‌ బారినపడే ప్రమాదముందని డీలర్లు ఆందోళన చెందుతున్నా రు. అదేవిధంగా ఐరిష్‌ నమోదు సమయంలో వారు తలను సరిగా ఉంచకపోతే డీలర్లు తలపై చేయి పెట్టి దగ్గర ఉండి ఐరిష్‌ నమోదు చేయించా ల్సి వస్తోంది. అంతేగాక నిత్యం రోషన్‌ కోసం 50 నుంచి 100 మంది లబ్ధిదారులు వస్తుంటారు. అందులో ఓ ఒక్కరికి వైరస్‌ ఉన్నా క్యూలో ఉన్న అందరికీ వ్యాప్తిచెందుతుంది. గతంలో నాలుగు నెలలపాటు థర్డ్‌ పార్టీ వేలిముద్రల నమోదుకు అవకాశం ఇచ్చారు. తొలిదశ లాక్‌డౌన్‌లో ఉపాధ్యాయులు, వీఆర్వోలు, వీఆర్‌ఏలతో థర్డ్‌ పార్టీ వేలిముద్రలు నమోదు చేయించే అవకాశం కల్పించారు. వారు వేలి ముద్ర వేయగానే, లబ్ధిదారు డు రేషన్‌ కార్డు నంబర్‌ చెచితే, వాటి వివరాలు సరిపోలితే బియ్యం కోటా మంజూరయ్యేది. ఈ విధానం నాలుగు నెలలు కొనసాగిన అనంతరం ఐరి్‌షను తీసుకొచ్చారు. ప్రస్తుతం కొవిడ్‌ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ఐరిష్‌ విధానం అమలు చేయడం ఇబ్బందే అని డీలర్లు చెబుతున్నారు. థర్డ్‌ పార్టీ వేలిముద్రలకు అవకాశం కల్పిస్తేనే రేషన్‌ పంపిణీ చేస్తామని, అప్పటి వరకు దుకాణాలు తెరిచేది లేదని స్పష్టం చేస్తున్నారు. అధికారులు మాత్రం దుకాణాలు తెరవాల్సిందేనని చెబుతుండగా, ఈ వివాదం ఎప్పుడు ముగిసిబియ్యం వస్తాయో అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.


థర్డ్‌ పార్టీకి అవకాశం ఇస్తేనే రేషన్‌ పంపిణీ: వైద్యుల సత్యనారాయణ, డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

పట్టణం, పల్లె అనే తేడా లేకుండా కరోనా పాజిటివ్‌ కేసు లు పెరుగుతున్నాయి. రేషన్‌ డీలర్లు పిట్టల్లా రాలిపోతున్నా రు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో 10మంది వరకు రేషన్‌ డీలర్లు మృతిచెందాడం బాధాకరం. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని థర్డ్‌ పార్టీ వేలిముద్రలకు అవకాశం కల్పిస్తేనే రేషన్‌ పంపిణీ చేయాలని నిర్ణయించాం. రేషన్‌ డీలర్లకు శానిటైజర్లు, మాస్క్‌లు సరఫరా చేయాలి. అదేవిఽధంగా ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తింపు ఇవ్వాలి. కనీసం మేం అడిగిన బీమా సౌకర్యం కూడా కల్పించడం లేదు. అధికారులకు విన్నవించినా ఫలితం ఉండటం లేదు. వెంటనే మా సమస్యలను పరిష్కరించాలి.



వెంటనే బియ్యం పంపిణీ చేయాలి: కోట లలిత, ఎన్జీవో కాలనీ, నల్లగొండ 

అసలే కరోనా కాలంలో పనుల్లేక సాధారణ, మధ్యతరగతి ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో సకాలంలో రేషన్‌ బియ్యం పంపిణీచేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పస్తులు ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి నెల 2వ తేదీ నుంచే అంతటా రేష న్‌ ఇచ్చే డీలర్లు 4వ తేదీ ముగిసినా దుకాణాలు తెరవడంలేదు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.


రేషన్‌ పంపిణీ చేపిస్తాం : నిత్యానందం, ఏఎ్‌సవో, జిల్లా పౌరసరఫరాల సంస్థ

రేషన్‌ డీలర్ల డిమాండ్స్‌ రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అంశం. మేం డీలర్లు అందరితో మాట్లాడుతున్నాం. వెంటనే దుకాణాలు తెరిపించి రేషన్‌ పంపిణీ చేపిస్తాం. ప్రస్తుతం ఒకరికి ఆరు కిలోల చొప్పున రూపాయి కిలో బియ్యం పంపిణీ చేస్తాం. కరోనా సెకెండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఉచితంగా, అదనపు బియ్యం పంపిణీపై ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.


Updated Date - 2021-05-05T07:01:53+05:30 IST