నల్లమట్టి దందా!

ABN , First Publish Date - 2021-02-08T06:13:50+05:30 IST

కరోనా అనంతరం ఇప్పుడిప్పుడే గృహనిర్మాణ రంగం పుంజుకుంటోంది. దీంతో ఇటుకలకు గిరాకీ పెరిగింది. వీటి తయారీకి ప్రధాన ముడిసరుకు నల్లరేగడి మట్టి అవసరం ఏర్పడింది. రెండేళ్ల క్రితమే ముందుచూపుగా వ్యవహరించిన వ్యాపారుల వద్ద రేగడిమట్టి నిల్వలు నిండుకుంటుండటంతో డంపిం గ్‌ కేంద్రాల పై దృష్టిపడింది.

నల్లమట్టి దందా!
మిర్యాలగూడ సమీపంలోని ఏడుకోట్లతండా వద్ద ఓ రైతు భూములో నిల్వచేసిన నల్లమట్టిని ఇటుకబట్టికి తరలిస్తున్న ట్రిప్పర్లు

లీజు భూములనుంచి తరలుతున్న మట్టిదిబ్బలు

నాడు రైతుల పేర బుకాయింపు, నేడు ఇటుక బట్టీలకు

ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వ్యాపారులు


మిర్యాలగూడ అర్బన్‌: కరోనా అనంతరం ఇప్పుడిప్పుడే గృహనిర్మాణ రంగం పుంజుకుంటోంది. దీంతో ఇటుకలకు గిరాకీ పెరిగింది. వీటి తయారీకి ప్రధాన ముడిసరుకు నల్లరేగడి మట్టి అవసరం ఏర్పడింది. రెండేళ్ల క్రితమే ముందుచూపుగా వ్యవహరించిన వ్యాపారుల వద్ద రేగడిమట్టి నిల్వలు నిండుకుంటుండటంతో డంపిం గ్‌ కేంద్రాల పై దృష్టిపడింది. 2019 వేసవిలో మిషన్‌కాకతీయ పథకం కింద చెరువుల్లో పూడిక తీశారు. అప్పట్లో ఇటుకబట్టీల నిర్వాహకులు చెరువు పరిసరాల్లోని వ్యవసాయ భూములను లీజుకు తీసుకొని పైసా పన్ను చెల్లించకుండా ఐబీ అధికారుల సహకారంతో రైతుల పేరుతో నల్లమట్టిని తెలివిగా కొల్లగొట్టారు. ఈ మట్టిని కొందరు వ్యాపారులు డంప్‌ చేయగా, భవిష్యత్‌ అవసరాలను గుర్తించిన బడా రైతు లు భూమి చదును పేరుతో నల్లమట్టిని నిల్వచేసి వ్యాపారులకు క్యూబిక్‌ మీటర్ల లెక్కన ప్రస్తుతం విక్రయిస్తున్నారు. మిర్యాలగూడ డివిజన్‌లో ఈ దందా జోరుగా సాగుతోంది.


చెరువుల పూడికతీతతో ఉపాధిహామీ పథకం కింద కూలీలకు పనులు లభించడంతోపాటు రైతుల పంటభూముల్లో సారం పెరిగి మంచి దిగుబడులొస్తాయన్నది ప్రభుత్వ ఆలోచన. మిషన్‌కాకతీయ పథకంతో చెరులకు పునరుజ్జీవం ఏర్పడి నీటినిల్వ సామర్థ్యం పెరగడంతోపాటు సమీప గ్రామాల్లో తాగు, సాగునీటి కొరత ఉండదన్న భావనతో అమల్లోకి తెచ్చిన ఈ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. ఎక్స్‌కవేటర్ల సహాయంతో తవ్విన నల్లమట్టిని రైతుల పేరు తో వ్యాపారులు తరలించిన డంప్‌ చేశారు.


వాస్తవంగా రైతులు మిన హా ఇతరులెవ్వరైనా నల్లమట్టిని తరలించాలంటే క్యూబిక్‌ మీటర్‌కు రూ.44చొప్పన ఐబీ,మైనింగ్‌శాఖలకు సీనరేజీ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉం టుంది. మిర్యాలగూడ డివిజన్‌లోని అన్ని చెరువుల్లో నాణ్యమైన నల్లమట్టి నిల్వలు ఉండటంతో ఈ ప్రాంత పరిసరాల్లోనే అధికంగా ఇటుకబట్టీలు విస్తరించాయి. వీటికి వేలాది క్యూబిక్‌ మీటర్ల మట్టి అవసరం. అంతమొత్తంలో మట్టిని సమకూర్చుకోవాలంటే లక్షలాది రూపాయాల సీనరేజీ చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని తప్పించుకునేందుకు వ్యాపారులు మిషన్‌కాకతీయ పనులు జరిగే రోజుల్లో ఐబీ అధికారులను మభ్యపెట్టి మట్టిని భారీగా నిల్వచేసుకొని ఇతర వ్యాపారులకు ట్రిప్పర్ల లెక్కన విక్రయించి ఆదాయం గడిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.


యథేచ్ఛగా రవాణా

మిషన్‌ కాకతీయ పథకం కింద మిర్యాలగూడ పరిధిలోని పందిళ్లపల్లి చెరువుతోపాటు వేములపల్లి, దామరచర్ల, మాడ్గులపల్లి, సాగర్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని చెరువుల్లో ఏడాదిన్నర క్రితం పూడికతీత పనులు చేశారు. అప్పట్లో సేకరించిన మట్టిని వ్యాపారులు సమీపంలోని ఇటుకబట్టీలకు రవాణా చేస్తున్నారు. ప్రధాన రహదారులపై భారీవాహనాల్లో నల్లమట్టి తరలిస్తున్నా అధికారులెవ్వరూ కన్నెత్తిచూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్‌, మైనింగ్‌శాఖల అధికారుల మధ్య సమన్వయలోపం అక్రమార్కులకు కలిసివస్తోంది. ఫలితంగా రేగడిమట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది.


అనుమతి తప్పనిసరి : వెంకటేశ్వరరావు, నల్లగొండ మైనింగ్‌ ఏజీ

రైతులు వ్యవసాయ భూముల్లో సారాన్ని పెంచుకునేందు కు మాత్రమే చెరువుమట్టిని ఉచితంగా ఇచ్చాం. ఆ మట్టి నిల్వలను వ్యాపారలావాదేవీలకు వినియోగిస్తే శాఖాపరంగా కఠిన చర్యలుంటాయి. మట్టితవ్వకాలు చేయాలంటే రెవెన్యూ, ఐబీ, మైనింగ్‌శాఖల నిబంధనల మేరకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలకు విరుద్ధంగా నల్లమట్టిని ఇటుకబట్టీలకు తరలిస్తే నోటీసులు జారీచేసి చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2021-02-08T06:13:50+05:30 IST