భక్తజనసంద్రం.. యాదాద్రి క్షేత్రం

ABN , First Publish Date - 2021-07-12T06:11:48+05:30 IST

గుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తజన సంద్రాన్ని తలపించింది. వరుస సెలవుల నేపథ్యం లో క్షేత్ర సందర్శనకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధికసంఖ్య లో తరలివచ్చి ఇష్టదైవాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

భక్తజనసంద్రం.. యాదాద్రి క్షేత్రం
నిత్య తిరుకల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకుడు

కిక్కిరిసిన దర్శన క్యూలైన్లు, సేవా మండపాలు 

ధర్మ దర్శనాలకు నాలుగు గంటల సమయం

వర్షంతో ఇబ్బంది పడిన భక్తులు 


యాదాద్రి టౌన్‌, జూలై 11: గుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తజన సంద్రాన్ని తలపించింది. వరుస సెలవుల నేపథ్యం లో క్షేత్ర సందర్శనకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధికసంఖ్య లో తరలివచ్చి ఇష్టదైవాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేకువజామునుంచే కొండకింద తులసీకాటేజ్‌లోని కల్యాణకట్టలో స్వా మికి మొక్కు తలనీలాలు సమర్పించిన భక్తజనులు తాత్కాలిక షవర్ల కింద పుణ్యస్నానాలు ఆచరించి కొండపైకి చేరుకున్నారు. కొండపైన దేవదేవడి దర్శనాలు, ఆర్జిత సేవల నిర్వహణకోసం క్యూలైన్ల లో గంట ల తరబడి వేచి ఉన్నారు. స్వామి ధర్మదర్శనాలకు నాలుగు గంటల సమయం, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆర్జిత సేవలైన నిత్యకల్యాణోత్సవం, వ్రతపూజలు, సువర్ణ పుష్పార్చన పూజల్లో భక్తులు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. భక్తుల వాహనాలతో ఆలయ ఘాట్‌రోడ్‌, పట్టణ ప్రధానవీధులు కోలాహలంగా మారాయి. గుట్టలో వర్షం కురవడంతో ఇష్టదైవాల దర్శనాలకు వచ్చిన భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. స్వామికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.19,03,224 ఆదాయం సమకూరింది.


స్వామికి ఘనంగా నిత్య కైంకర్యాలు

యాదాద్రి లక్ష్మీనృసింహుడికి నిత్య విధి కైంకర్యాలు ఘనంగా నిర్వహించారు. వేకువజామునే స్వామిని మేల్కొలిపిన అర్చకులు బిందెతీర్థంతో నిత్య కైంకర్యాలను ప్రారంభించారు. స్వయంభువులకు ఆస్థానపరంగా ఆరాధనలుచేసి, బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం, నిత్యార్చనలు జరిపి హోమ పూజలు చేపట్టారు. కల్యాణమండపంలో ఉత్సవమూర్తులను గజవాహనసేవలో తీర్చిదిద్ది సేవోత్సవం నిర్వహించారు. ఆలయంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు కొనసాగాయి. రామలింగేశ్వరుడిని కొలిచిన పూజారులు చరమూర్తులను అభిషేకించి బిల్వపత్రాలతో అర్చించారు. 


స్వామి సేవలో ప్రముఖులు

యాదాద్రీశుడిని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి చిరంజీవులు కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా భాజాపా నాయకులు గూడూరు నారాయణరెడ్డి, అన్నమనేని శ్రీనివాసరావులు వేర్వేరుగా దర్శించుకుని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పుట్టినరోజును పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహుడి చెంత ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు.  


 కేసీఆర్‌తోనే ఆలయాల అభివృద్ధి : మేయర్‌ విజయలక్ష్మి

సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రంలో ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని ఆదివారం హైదరాబాద్‌ నగర కార్పొరేటర్లతో కలిసి ఆమె సందర్శించారు. బాలాలయంలో కవచమూర్తులను ఆమె దర్శించుకుని సువర్ణ పుష్పార్చన, ఉత్సవమూర్తుల చెం త అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రధానాలయ పునర్నిర్మాణ పనుల పరిశీలించారు. ప్రధానాలయం, పరిసర ప్రాంతాలను ముసురు వర్షంలోనే పర్యటించి పనుల పురోగతి, నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లక్ష్మీనృసింహుడి పుణ్యక్షేత్రం మహిమాన్విత క్షేత్రమని,యాదాద్రి ఆలయ అభివృద్ధికి సంకల్పించిన సీఎం కేసీఆర్‌కు ఆయురారోగ్యాలు కల్పించాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ఆమెవెంట యాదగిరిగుట్ట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధా హేమేందర్‌గౌడ్‌, నాయకులు మిట్ల వెంకటయ్య, హేమేందర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, నర్సింహ, ముక్కెర్ల సతీష్‌, కనకరాజ్‌ తదితరులున్నారు. 

Updated Date - 2021-07-12T06:11:48+05:30 IST