భక్తజన సంద్రం.. యాదాద్రిక్షేత్రం

ABN , First Publish Date - 2021-11-28T05:56:01+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం శనివారం భక్తజన సంద్రాన్ని తలపించింది. కార్తీక మాసం... వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి యాత్రాజనులు అధిక సంఖ్యలో క్షేత్ర సం దర్శనకు విచ్చేసి ఇష్టదైవాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

భక్తజన సంద్రం.. యాదాద్రిక్షేత్రం
ఆలయ తిరువీధుల్లో భక్తుల రద్దీ

యాదాద్రి టౌన్‌, నవంబరు 27: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం శనివారం భక్తజన సంద్రాన్ని తలపించింది. కార్తీక మాసం... వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి యాత్రాజనులు అధిక సంఖ్యలో క్షేత్ర సం దర్శనకు విచ్చేసి ఇష్టదైవాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేకువజామునుంచే కొండకింద తులసీకాటేజ్‌లోని స్వామివారి కల్యాణకట్టలో మొక్కు తలనీలాలు సమర్పించుకున్న భక్తులు తాత్కాలిక షవర్ల కింద పుణ్యస్నానాలు ఆచరించారు. హరిహరుల దర్శనాల కోసం ఆటో లు, ఆర్జీసీ, దేవస్థాన బస్సులలో కొండపైకి చేరుకున్నారు. దర్శనాలు.. మొక్కుపూజల నిర్వహణ కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. ధర్మ దర్శనాలకు నాలుగు గంటలు.. ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. బాలాలయంలో నిత్య కల్యాణోత్సవం, ఆర్జిత సేవలు, కొండకింద పాత గోశాలలోని వ్రత మండపంలో సత్యనారాయణ వ్రతపూజలలో భక్తులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన తగినంత పార్కింగ్‌ ప్రదేశాలు లేకపోవడంతో పోలీసులు భక్తుల వాహనాలను కొండకిందే పార్కింగ్‌ చే యించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వాహనాలలో తరలిరావడంతో ఆలయ ఘాట్‌రోడ్‌లో, పట్టణంలో పలుమార్లు ట్రా ఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. హరిహరుల దర్శనానంత రం స్వామివారి ప్రసాదాలను కొనుగోలు చేశారు. కొండకిం ద పాత గోశాలలో వ్రతపూజల్లో 667 మంది దంపతులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామికి ప్రసాదాల విక్రయం ద్వారా రూ.6.01లక్షలు, వ్రతపూజల ద్వారా రూ. 3.33లక్షల ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. వివిధ విభాగాల ద్వారా రూ.23,23,642 ఆదా యం ఖజానాలో జమయ్యినట్టు అధికారులు పేర్కొన్నారు. 


లక్ష్మీనృసింహుడికి ఘనంగా నిత్య కైంకర్యాలు

యాదాద్రీశుడికి నిత్యపూజా కైంకర్యాలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు బాలాలయంలో కవచమూర్తులను కొలిచారు. ఉత్సవమూర్తులను అభిషేకించి తులసీ దళాలతో అర్చించి, సుదర్శన హోమం, నిత్యకల్యాణపర్వాలను ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లను గజవాహనసేవలో అలంకరించి సేవోత్సవం నిర్వహించి బాలాలయంలో ఊరేగించారు. ఆలయంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు, వ్రతమండపంలో సత్యదేవుడి వ్రతపూజలు కొనసాగాయి. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి, ఉపాలయంలో చరమూర్తులకు నిత్యపూజలు స్మార్త సంప్రదాయరీతిలో కొనసాగాయి.


యాదాద్రీశుడిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకొని ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. నేషనల్‌ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌, ఐజీ మధుసూధన్‌రెడ్డి, రాష్ట్ర ఎలకో్ట్రలర్‌ అబ్జర్వర్‌, ఐఏఎస్‌ అధికారి కె.నిర్మల, అడిషనల్‌ ప్రిన్సిపల్‌ చీప్‌ కన్జర్వేటర్‌ ఆప్‌ ఫారెస్ట్‌ తెలంగాణ, ఐఏఎస్‌ అధికారి కౌశిక్‌ వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం తెలిపారు. బాలాలయంలో కవచమూర్తులను దర్శించుకుని సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. వీరికి బాలాలయ మండపంలో అర్చకులు ఆశీర్వచనం అందజేయగా, దేవస్థాన అధికారులు అభిషేకం లడ్డూ ప్రసాదాలను అందజేశారు. వీరివెంట రెవెన్యూ, ఫారెస్టు, దేవస్థాన అధికారులు ఉన్నారు. ఇదిలా ఉంటే స్వామికి ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు విమాన గోపురం బంగారు తాపడంకోసం వివిధ విభాగాల ద్వారా రూ.29,94,276 విరాళాలను వచ్చినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.  

Updated Date - 2021-11-28T05:56:01+05:30 IST