పాతకక్షతో కొబ్బరిబొండాల కత్తితో దాడి

ABN , First Publish Date - 2021-12-15T05:40:32+05:30 IST

నల్లగొండ జిల్లా కేంద్రంలో కొబ్బరిబొండాలు కోసే కత్తితో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. టూటౌన్‌ ఎస్‌ఐ కాశీ తెలిపిన వివరాల ప్రకారం తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన మాగి బాబు సావర్కర్‌నగర్‌ సర్కిల్‌లో ఐదేళ్లుగా మిల్క్‌సెంటర్‌ నిర్వహిస్తూ, అదే అద్దె మడిగలో కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు.

పాతకక్షతో కొబ్బరిబొండాల కత్తితో దాడి
గాయపడ్డ మాగి బాబు,

రెండు వేట్లు పడ్డాక తప్పించుకున్న బాధితుడు

ఆటోలో ప్రభుత్వాస్పత్రికి ...

నల్లగొండ క్రైం, డిసెంబరు 14 : నల్లగొండ జిల్లా కేంద్రంలో కొబ్బరిబొండాలు కోసే కత్తితో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. టూటౌన్‌ ఎస్‌ఐ కాశీ తెలిపిన వివరాల ప్రకారం తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన మాగి బాబు సావర్కర్‌నగర్‌ సర్కిల్‌లో ఐదేళ్లుగా మిల్క్‌సెంటర్‌ నిర్వహిస్తూ, అదే అద్దె మడిగలో కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. రెండు నెలల కిందట పనినిమిత్తం కుటుంబంతో కలిసి ఊరెళ్లాడు. ఇదే అదునుగా భావించిన పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన కరెంట్‌ పనిచేసుకుంటూ, మద్యానికి బానిసై మునాస శ్రీనివాస్‌ మిల్క్‌సెంటర్‌ వెనకాల ఉన్న రూ.3600 విలువైన పాత్రలు, బకెట్‌ చోరీ చేశాడు. ఊరెళ్లిన శ్రీనివాస్‌ తిరిగి వచ్చాక చోరీ జరిగిన విషయాన్ని పక్కవారికి చెప్పాడు. దీంతో వారు శ్రీనివాస్‌ వచ్చాడని చెప్పి సావర్కర్‌నగర్‌కు శ్రీనివాస్‌ వచ్చిన సమయంలో బాబుకు చూపించారు. దీంతో బాబు అతడిని నిలదీయగా, చోరీ చేశానని అంగీకరించడంతో పాటు వారం రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని శ్రీనివాస్‌ తల్లికి బాబు చెప్పగా రూ.2500 ఇస్తానని చెప్పి ఆమె వివిధ వాయిదాల్లో ఈ నెల 8వ పూర్తిగా ముట్టజెప్పింది. అంతా సర్దుకున్న తర్వాత శ్రీనివాస్‌ ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని బాబుపై దాడిచేసేందుకు కుట్రపన్నాడు. ఇదిలా ఉండగా మంగళవారం మధ్యాహ్నం బాబు దుకాణంలో ఉండగా అక్కడికి వచ్చిన శ్రీనివాస్‌ వెంటనే తన చేతిలో ఉన్న కవర్‌లో నుంచి కొబ్బరిబొండాలు కొట్టే కత్తిని తీసి బాబు తలపై దాడి చేశాడు. బాబు తేరుకునే లోపే శ్రీనివాస్‌ మరోసారి చేతిపై దాడి చేశాడు. అప్రమత్తమైన బాబు అక్కడి ఉన్న తన కూతురిని తీసుకుని అద్దె మడిగెలోని మూడో రూంలోకి వెళ్లి గడియపెట్టి, వెనకాల నుంచి కారుతున్న రక్తంతోనే ఆటోలో జిల్లా జనరల్‌ ఆస్పత్రికి వెళ్లాడు. 

బాబు తలకు సుమారు 10 కుట్లు, చేతికి 3 కుట్లు పడగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు. అయితే బాబును వెంబడించిన శ్రీనివాస్‌ పక్కనే ఉన్న వైన్స్‌ సిట్టింగ్‌లోకి వెళ్లి ఉంటాడని అనుకుని చేతిలో రక్తం కారుతున్న కత్తితోనే సిట్టింగ్‌లోకి వెళ్లగా అక్కడ మద్యం సేవిస్తున్న వారు అవాక్కయ్యారు. వెంటనే అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వచ్చే లోపు శ్రీనివాస్‌ అక్కడి నుంచి వెళ్లిపో యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితుడు మాగి బాబు భార్య పరిమళ ఫిర్యాదుమేరకు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Updated Date - 2021-12-15T05:40:32+05:30 IST