అర్ధాకలి చదువులు

ABN , First Publish Date - 2021-11-09T06:46:32+05:30 IST

ప్రభుత్వ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులు అర్ధాకలితోనే విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. కళాశాలల్లో సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని మూడేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించింది.

అర్ధాకలి చదువులు

కళాశాల విద్యార్థులకు అమలుకాని మధ్యాహ్న భోజన పథకం

ఇబ్బందులుపడుతున్న పేద విద్యార్థులు


చౌటుప్పల్‌: ప్రభుత్వ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులు అర్ధాకలితోనే విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. కళాశాలల్లో సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని మూడేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత కరోనా మహమ్మారి కారణంగా కళాశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టగా కళాశాలలు తిరిగి తెరుచుకున్నాయి. అయితే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రధానంగా పల్లెల నుంచి రోజూ వస్తూ విద్యాభ్యాసం చేస్తున్న పేద విద్యార్థులు అర్ధాకలితోనే చదువును కొనసాగిస్తున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 30 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. అందులో యాదాద్రి జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా, 4264మంది విద్యార్థులు విద్యాభ్యాసం చే స్తున్నారు.నల్లగొండ జిల్లాలో 12కళాశాలలు ఉండగా,8146 మంది విద్యార్థులు, సూర్యాపేట జిల్లాల్లో ఏడు కళాశాలలు ఉండగా, 3508 విద్యార్థు లు చదువులు కొనసాగిస్తున్నారు. ఈ కళాశాలలు పట్టణాల్లో ఉండగా, పల్లెల నుంచి అధికసంఖ్యలో పేద విద్యార్థులు నిత్యం వచ్చిపోతున్నారు.

 

సాయంత్రం వరకు పస్తులే

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తరగతులు కొనసాగుతున్నాయి. విద్యార్థులు మారుమూల గ్రామాల నుంచి సకాలంలో కళాశాలకు చేరాలంటే ఉదయం 7గంటలకే ఇంటినుంచి బయల్దేరాల్సి వస్తోంది. ఆ సమయంలో ఇంట్లో వంట చేయకుంటే ఏం తినకుండానే కళాశాలకు వస్తున్నారు. లేదంటే ఏదో ఒక అల్పాహారం, లేదా బిస్కెట్లు తిని కళాశాలకు వస్తున్నారు. కొందరు అదే అల్పాహారాన్ని కళాశాలకు తెచ్చుకొని మధ్యా హ్న భోజన సమయంలో తింటున్నారు. మరికొందరు సాయంత్రం వరకు పస్తులుంటూ కళాశాల పూర్తయ్యాక సాయంత్రానికి గాని ఇంటికి చేరుకొని భోజనం చేస్తున్నారు. రోజంతా తరగతిగదిలో ఆకలితో నే పాఠాలు వింటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థు ల్లో అధికంగా పేదలు, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. వేలకు వేలు ఫీజులు చెల్లించి ప్రైవేటు కళాశాలల్లో చదివించే స్థోమత లేనివారే ప్రభు త్వ కళాశాలలకు పిల్లలను పంపిస్తున్నారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఉపకారవేతనం వంటి సౌకర్యంతోపాటు మధ్యాహ్న భోజనం ఉంటుందని పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించేందుకు గ్రామీణ ప్రాంత తల్లిద్రండులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కళాశాలల్లో మధ్యాహ్న భోజనం లేకపోవడంతో పిల్లల ఇక్కట్లు చూడలేక తల్లిద్రండులు ఆందోళన చెందుతున్నారు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిని సాయంత్రం వరకు తరగతులు వినేవారు ఇంటర్మీడియట్‌కు వచ్చే సరికి కళాశాలలో ఆ సౌకర్యం లేక ఇబ్బందిపడుతున్నారు. ఈ ఏడాది నుంచైనా కళాశాలల్లో మధ్యా హ్న భోజన పథకం ప్రారంభించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇటీవలి వరకు తెలుగు మీడియంలోనే తరగతులు కొనసాగాయి. గత ఏడాది నుంచి ఇంగ్లీష్‌ మీడియం అమలవుతోంది. అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులు కొనసాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గత ఏడాది నుంచి అధ్యాపకులు గ్రామాల్లో తిరిగి ప్రచారం నిర్వహించారు. కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తే ప్రభుత్వ కళాశాలల మనుగడ కొనసాగుతుందని అధ్యాపకులు పేర్కొంటున్నారు.


మూడు పాఠశాలల్లో నిలిచిన మధ్యాహ్న భోజనం

కనగల్‌: మండలంలోని జీ.ఎడవల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాల, శాబ్దులాపురం ప్రాఽథమిక పాఠశాలలో మధాహ్న భోజన పథకం నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మూడు పాఠశాలల్లో సుమారు 250 మంది విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. కాగా, బిల్లులు గిట్టుబాటుకావడం లేదని, సకాలంలో బిల్లులు సైతం రావడం లేదని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు వంట చేసేందుకు ఆసక్తిచూపడం లేదు. దీంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. జీఎడవల్లి ప్రధానోపాధ్యాయురాలు పద్మ ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు, అదికారులకు విన్నవించినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఇదే పరిస్థితి కనగల్‌ ప్రాథమిక పాఠశాలలో ఉండగా, స్థానిక సర్పంచ్‌ చొరవచూపి మధ్యాహ్న భోజనాన్ని వండే బాధ్యతను ఒకరికి అప్పగించడంతో సమస్య పరిష్కారమైంది.


ప్రజాప్రతినిధులు సహకరించాలి : రాములు, కనగల్‌ ఎంఈఓ 

జీఎడవల్లి ప్రైమరీ, హైస్కూల్‌లో మధ్యాహ్న భోజ నం వండేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఈవిషయంలో సర్పంచ్‌, ఎంపీటీసీ, ఇతర ప్రజాప్రతినిధులు చొరవ చూపి ఉపాధ్యాయులకు సహకరించాలి.


ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు : సంజీవ, ఇంటర్మీడియట్‌ యాద్రాది జిల్లా అధికారి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజ నం అమలుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తామ ని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొవిడ్‌ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కళాశాలలు తెరుచుకున్నా ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వర కు ఎలాంటి ఆదేశాలు రాలేదు. కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుచేస్తే దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది.మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలి : నవీన్‌రెడ్డి, విద్యార్థి, కల్వకుంట్ల, నారాయణపూర్‌ మండలం

మాది కల్వకుంట్ల గ్రామం. రోజూ సంస్థాన్‌నారాయణపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు 25కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నా. మాది వ్యవసాయ కుటుంబం. ఉదయం 9.30కు కళాశాలకు రావాలంటే 8గంటల లోపే ఇంట్లో నుంచి బయల్దేరాల్సి వస్తోంది. అంత పొద్దు ఇంట్లో భోజనం వండటం ఇబ్బందిగా మారుతుంది. దీంతో ఒక్కోసారి భోజనం తినకుండానే కళాశాలకు వస్తున్నా. రాత్రి ఇంటికి వెళ్లాకే భోజనం. కళాశాలల్లో సైతం మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తే మాలాంటివారి ఇబ్బందులు తొలగుతాయి.


Updated Date - 2021-11-09T06:46:32+05:30 IST