ఇంకెన్నాళ్లు
ABN , First Publish Date - 2021-11-28T06:16:15+05:30 IST
నాలుగు దశాబ్దాలుగా వెలుగువెలిగిన సాంబమసూరి రకం ధాన్యానికి ప్రస్తుతం ఆదరణ కరువైంది. ఈ రకాలను కొనుగోలుచేసేందుకు వ్యాపారులు ముందుకురాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

సాంబమసూరి కొనుగోళ్లు లేక రైతుల అవస్థలు
కేందాలు ఏర్పాటు చేసినా అంతంతే
ఐదు లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా
ఆందోళనలో ఆయకట్టు రైతులు
త్రిపురారం, నవంబరు 27: నాలుగు దశాబ్దాలుగా వెలుగువెలిగిన సాంబమసూరి రకం ధాన్యానికి ప్రస్తుతం ఆదరణ కరువైంది. ఈ రకాలను కొనుగోలుచేసేందుకు వ్యాపారులు ముందుకురాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సాగర్ ఆయకట్టులో 3.50లక్షల ఎకరా ల్లో సన్న రకాల వరిని రైతులు సాగు చేయగా, అందులో సుమారు 20 శాతం మేర సాంబమసూరి రకం వరి ఉంది. దిగుబడులు ఆశించిన మేర కు వచ్చినా కొనుగోలుచేసే దిక్కు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రైవేటు రకాలకే మొగ్గు
సాంబమసూరి ప్రైవేటు రకాల వరికంటే కొంత లావుగా ఉంటుంది. దీంతో సన్నగా ఉండే ప్రైవేటు రకాల కొనుగోలుకే వ్యాపారులు మొగ్గుచూపుతున్నారు. సాంబ రకాలను మిల్లర్లు కొనుగోలు చేయడంలేదు. కొందరు మిల్లర్లు కొనుగోలు చేస్తున్నా రూ.1,600కు మించి ధర చెల్లించడంలేదని రైతులు వాపోతున్నారు.
20 రోజులుగా కల్లాల్లోనే
ఆయకట్టులో 20 రోజులు క్రితం సాంబమసూరి వరి కోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు కల్లాల్లోనే ధాన్యం ఆరబోశారు. ఆరబోసిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. కోతలు పూర్తయి 20రోజులకుపైగా అవడంతో ధాన్యంలో తేమశాతం పూర్తిగా తగ్గింది. దీంతో తూకాల్లో కూడా చాలా వరకు తేడాలు వస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు చాలా మంది రైతులు వరి నూర్పిడి చేయకుండానే ఉంచారు. దీంతో వర్షాలకు చాలా వరకు వరి నేలవాలి ధాన్యం రాలింది.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా..
సాంబమసూరి సాగుపై ప్రభుత్వం పూర్తిస్థాయి అంచనాకు రాలేకపోయింది. దీంతో ఇప్పటి వరకు కొనుగోళ్లపై సరైన నిర్ణయం తీసుకోలేదు. రైతుల విజ్ఞప్తి మేరకు త్రిపురారం, చెన్నాయిపాలెం, నిడమనూరు, హాలియా, పెద్దవూరలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిని ఆర్భాటంగా ప్రారంభించినా మిల్లులకు మాత్రం కేటాయించలేదు. దీంతో ఫలితం లేకుండాపోయింది. బాబుసాయిపేట పీఏసీఎస్ పరిధిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా సాంబమసూరికి కొనుగోలుకు అనుమతి ఇవ్వలేదు. దీని పరిధిలో సుమారు 50వేల క్వింటాళ్ల ధాన్యం సిద్ధంగా ఉంది. ఒక్క త్రిపురారంలో రెండు లక్షల క్వింటాళ్లు, మొత్తం ఐదు కొనుగోలు కేంద్రాల పరిధిలో ఐదు లక్షల క్వింటాళ్లపైన ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు అంచనా. కాగా, సాంబమసూరి రకం వరిని కొనుగోలు చేయాలని ఇప్పటికే రైతులు ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం నేటికీ ఈ రకం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించలేదు. యాసంగి సీజన్ పనులు ప్రారంభం కానున్నందున వెంటనే సాంబమసూరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పట్టించుకునే వారే లేరు : మెండె రామలింగం, రైతు బాబుసాయిపేట
పొలం కోసి 20 రోజుల క్రితం ధాన్యాన్ని కల్లంలోనే ఆరబోసి ఉంచా. మబ్బుపట్టినప్పుడు పట్టాలు కప్పడం, ఆ తరువాత ఆరబోయడం చేస్తున్నాం. పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసినా ఇప్పటి వరకు కొనుగోళ్లు ప్రారంభం కాలే దు. అధికారులు సాంబమసూరి కొనుగోలుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఏంచేయాలో అర్థం కావడం లేదు. రైతుల బాధలు పట్టించుకునేవారే లేరు. వెంటనే సాంబ రకాలను కొనుగోలు చేసి ఆదుకోవాలి.
మిల్లులు కేటాయించకపోవడంతో జాప్యం : కొరివి నర్సయ్య, త్రిపురారం సహకార సంఘం సీఈవో
కొనుగోలు కేంద్రాలకు అనుమతి ఇచ్చినా, ఇప్పటి వరకు మిల్లులు కేటాయించలేదు. దీంతో సాంబమసూరి ధాన్యం కొనుగోలు చేయలేకపోతున్నాం. రైతుల నుంచి ఒత్తిడి వస్తుండగా, సమాధానం చెప్పలేకపోతున్నాం. సివిల్సప్లయ్ అధికారులను అడిగితే త్వరలో కేటాయిస్తామని చెబుతున్నారు.