నీలగిరిలో రెండిళ్లలో వరుస చోరీలు

ABN , First Publish Date - 2021-10-25T06:18:38+05:30 IST

నల్లగొండ పట్టణంలో శనివారం వరుసగా రెండిళ్లలో ఒకే సమయంలో చోరీ జరిగింది.

నీలగిరిలో రెండిళ్లలో వరుస చోరీలు

 15.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.9.81లక్షల నగదు అపహరణ

నల్లగొండ క్రైం, అక్టోబరు 24 :  నల్లగొండ పట్టణంలో శనివారం వరుసగా రెండిళ్లలో ఒకే సమయంలో చోరీ జరిగింది. ఈ చోరీలో ఆ రెండిళ్లలో కలిపి 15.5తులాల బంగారు ఆభరణాలు, రూ.9.81లక్షల నగదు అపహరణకు గురైంది. నల్లగొండ టూటౌన్‌ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ దోరెపల్లి నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డులో ఉన్న లక్ష్మీనగర్‌ కాలనీకి చెందిన బసవోజు శ్రీనివాసచారి సూర్యాపేట జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన విధులకు వెళ్లగా ఆయన భార్య కృష్ణవేణి మధ్యాహ్నం 12గంటల సమయంలో ఇంటికి తాళం వేసి పట్టణంలోని రవీంద్రనగర్‌లో ఉన్న ఆమె తల్లి గారింటికి వెళ్లింది. సాయంత్రం 4గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా బయట తాళం పగలగొట్టడంతో పాటు ఇంట్లో ఉన్న బీరువాను సైతం పగలగొట్టి బీరువాలో ఉన్న 14.5తులాల బంగారు ఆభరణాలు, వారి కుమారుడు విదేశాలకు వెళ్లేందుకు సమకూర్చిన రూ.9.76లక్షల నగదును అపహరించారు. అదేవిధంగా మీర్‌బాగ్‌ కాలనీకి చెందిన ఫజలున్నీసా మధ్యాహ్నం 12గంటల సమయంలో ఇంటికి తాళం వేసి ఆమె కుమారుడు నల్లగొండ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతుండగా మధ్యాహ్నం భోజనం ఇచ్చి 15 నిమిషాల వ్యవధిలోనే ఇంటికి రాగా, అప్పటికే గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న తులం బంగారం, రూ.5వేల నగదును చోరీ చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దోరెపల్లి నర్సింహులు తెలిపారు. చోరీ జరిగిన స్థలాన్ని సీసీఎస్‌ డీఎస్పీ మొగులయ్య, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ చంద్రశేఖర్‌రెడ్డి పరిశీలించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వారి నివాసానికి వెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించి ధైర్యం చెప్పారు. 


Updated Date - 2021-10-25T06:18:38+05:30 IST