ప్రాణం తీసిన భూవివాదం

ABN , First Publish Date - 2021-07-27T06:10:19+05:30 IST

భూవివాదం ప్రాణం తీసింది. బంధువులు మాటు వేసి దాడి చేసి హత్య చేశారు.

ప్రాణం తీసిన భూవివాదం

మాటు వేసి దాడి చేసిన బంధువులు

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో ఘటన

హత్యకు గురైన జానయ్య(ఫైల్‌)

మఠంపల్లి, జూలై 26: భూవివాదం ప్రాణం తీసింది. బంధువులు మాటు వేసి దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెంలో సోమవారం జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపాలెం గ్రామానికి చెందిన సల్వాది జానయ్య(37) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతని పొలానికి సమీపంలో బంధువైన శ్రీపతి వెంకటేష్‌ కూడా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇద్దరి భూమి హద్దుల్లో ఉన్న రెండు ఎకరాల భూమిపై ఏడాదిగా వివాదం నడుస్తోంది. భూమి తమదంటే తమదని ఇరు కుటుంబాల వారు ఘర్షణ పడుతున్నారు. ఈ పంచాయితీ పెద్ద మనుషుల వద్దకు చేరినా పరిష్కారం కాలేదు. 20రోజుల క్రితం ఇరువురూ పరస్పరం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. ప్రతిరోజూ జానయ్య తన పశువులను మేతకు తీసుకెళ్లి భూమి సమీపంలో కట్టేస్తుంటాడు. ఇది గమనించిన వెంకటేష్‌ కుటుంబీకులు సోమవారం ఒంటరిగా ఉన్న జానయ్యతో గొడవపడి గొడ్డళ్లతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జానయ్య స్పృహ తప్పి పడిపోవడంతో చుట్టుపక్కల రైతులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. జానయ్యకు భార్య లక్ష్మి, కుమారుడు కార్తీక్‌, కుమార్తె ప్రవళిక ఉన్నారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి తెలిపారు. 

 రఘునాథపాలెంలో సంచలనంగా జానయ్య హత్య

రఘునాథపాలెంలో జరిగిన జానయ్య హత్య సంచలనంగా మారింది. గుండ్లపల్లి, రఘునాథపాలెం, చౌటపల్లి, పెదవీడు, భీల్యానాయక్‌తండా, గుర్రంబోడుతండా, కృష్ణతండా, రామచంద్రాపురంతండా తదితర గ్రామాల్లో భూ వివాదాలకు సంబంధించి పదుల సంఖ్యలో ఘర్షణ కేసులు నెలకొంటున్నాయి. పోలీసులు ఈ తగాదాలను పరిష్కరించకపోవడంతో వ్యవసాయ పనులు మొదలైన ప్రతి సీజన్‌లో ఆయా గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. పెద్ద మనుషులు ఇరువర్గాల విభేదాలను తీర్చకపోవడం, రాజీచేయకపోవడం, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు కారణంగా భూమి పంచాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి.  దీంతో గొవడలు  కాస్త చిలికిచిలికి వానలా మారి ఘర్షణలకు తీస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. 

Updated Date - 2021-07-27T06:10:19+05:30 IST