గెలుపెవరిదో!

ABN , First Publish Date - 2021-05-02T05:46:56+05:30 IST

సిద్దిపేట మున్సిపాలిటీ పోలింగ్‌ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్‌రూముల్లో భద్రంగా ఉన్నది. పోలింగ్‌ ముగిసిన వెంటనే బ్యాలెట్‌ బాక్సులను పటిష్టమైన భద్రత నడుమ ఇందూరు కళాశాలలోని స్ట్రాంగ్‌రూములకు చేరవేశారు.

గెలుపెవరిదో!
బ్యాలెట్‌బాక్సులను భద్రపర్చి స్ట్రాంగ్‌రూంవద్ద బందోబస్తు

బ్యాలెట్‌ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం

పోలింగ్‌ సరళిపై అభ్యర్థుల తర్జనభర్జన

అందరిలోనూ గెలుస్తామనే ధీమా

రేపే సిద్దిపేట మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 1: సిద్దిపేట మున్సిపాలిటీ పోలింగ్‌ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్‌రూముల్లో భద్రంగా ఉన్నది. పోలింగ్‌ ముగిసిన వెంటనే బ్యాలెట్‌ బాక్సులను పటిష్టమైన భద్రత నడుమ ఇందూరు కళాశాలలోని స్ట్రాంగ్‌రూములకు చేరవేశారు.  ఓట్ల లెక్కింపునకు మరోరోజు సమయం ఉన్న నేపథ్యంలో గెలుపుపై చర్చ నడుస్తున్నది. పోటీలో నిలిచిన అభ్యర్థులు తమ గెలుపుపై అంచనాలను వేసుకుంటున్నారు. గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు ధీమాగా ఉన్నారు. రేవు ఓట్ల లెక్కింపు అనంతరం అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.


కరోనా ముప్పు ఉన్నా ..

 ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని కోరుకునే ప్రజలు ఓటేసేందుకు రావడంతో కరోనా ముప్పు ఉన్నా 60 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైందని అధికార పార్టీ అభ్యర్థులు భావిస్తున్నారు. అయితే అధికార పార్టీ అభ్యర్థులపై వ్యతిరేకంగా మారడంతోనే పోలింగ్‌ శాతం సడలకుండా ఓటర్లు తీర్పు చెప్పారని ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థులను నొప్పించకుండా ఓటర్లు సైతం తమ అభిప్రాయాలను ఎక్కడా బయటపడనీయకుండా జాగ్రత్తపడ్డారు. ఏ అభ్యర్థినీ నొప్పించకుండా వ్యవహరించారు. పోలింగ్‌ సమయంలోనూ ఇదే విధానం ఆచరించిన పరిస్థితి కనిపించింది. అందుకే ఓటర్ల శైలిపై అభ్యర్థులంతా ఆశలు పెట్టుకున్నారు. మొత్తంగా పరిశీలిస్తే ఈసారి సిద్దిపేట ఓటరునాడి అభ్యర్థులకు అంతుబట్టకుండా ఉన్నది. 


రేపు ఓట్ల లెక్కింపు

సిద్దిపేట పట్టణంలోని 43 వార్డుల్లో 1,00,678 ఓట్లకు 67,539 ఓట్లు పోలయ్యాయి. స్థానికంగా ఉన్న ఇందూరు కళాశాలలో రేపు ఓట్లు లెక్కించనున్నారు. వార్డులవారీగా కౌంటర్లు ఏర్పాటుచేసి లెక్కిస్తారు. బ్యాలెట్‌పత్రాల లెక్కింపు కొంత ఆలస్యం జరిగే అవకాశముంది. మధ్యాహ్నం వరకు ఫలితాలపై స్పష్టత వస్తుంది.

Updated Date - 2021-05-02T05:46:56+05:30 IST