కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే ఎలా?

ABN , First Publish Date - 2021-09-04T05:02:02+05:30 IST

ఉపాధ్యాయులే కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే విద్యార్థులు ఎలా పాటిస్తారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే ఎలా?
రుద్రారంలో పాఠశాలను తనిఖీ చేస్తున్నకలెక్టర్‌ హన్మంతరావు

 చదువుతో పాటు విద్యార్థుల ఆరోగ్యమూ ముఖ్యమే

 నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపాధ్యాయులపై చర్యలు

 సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు

సంగారెడ్డి రూరల్‌, సెప్టెంబరు 3 : ఉపాధ్యాయులే కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే విద్యార్థులు ఎలా పాటిస్తారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు కరోనా నిబంధనలు పాటించకపోవడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిస్థితు మెరుగు పడుతుండటంతో సుదీర్ఘ విరామం అనంతరం పాఠశాలలను ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని హెచ్చరిస్తున్నా ఉపాధ్యాయులు ఖాతరు చేయకపోవడంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు చదువు ఎంత అవసరమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని కలెక్టర్‌ స్పష్టం చేశారు. పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొన్న భయాలను తొలగించేందుకు   చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి బోధనా సంబంధమైన విషయాలను తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-09-04T05:02:02+05:30 IST