ఉద్యోగ భద్రత కోసం ఎదురుచూపు

ABN , First Publish Date - 2021-12-19T05:30:00+05:30 IST

తెలంగాణ విద్యుత్‌ శాఖలో రాష్ట్రంలో 23 వేల మందిని ఆర్టిజన్‌లుగా తీసుకుని నాలుగేళ్లు గడుస్తున్నా క్రమబద్ధీకరించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

ఉద్యోగ భద్రత కోసం ఎదురుచూపు

 ఏపీఎ్‌సఈబీ రూల్స్‌ను పరిగణలోకి తీసుకోవాలి 

 ఆర్టిజన్‌ కార్మికుల డిమాండ్‌


సిద్దిపేట రూరల్‌, డిసెంబరు 19: తెలంగాణ విద్యుత్‌ శాఖలో రాష్ట్రంలో 23 వేల మందిని ఆర్టిజన్‌లుగా తీసుకుని నాలుగేళ్లు గడుస్తున్నా క్రమబద్ధీకరించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే సంబంధిత సంఘాలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాయి. ఇటీవల అసెంబ్లీలో ఆర్టిజెన్‌ కార్మికులను క్రమబద్ధీకరించి, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రస్తావించారు. కానీ అమలుకు మాత్రం నోచుకోలేదు.

రాష్ట్రంలో సుమారు 23 వేల మందిని 2017 జూలై 17న ఆర్టిజన్‌ కార్మికులుగా తీసుకున్నారు. సిద్దిపేట జిల్లాలో 187 సబ్‌ స్టేషన్లు ఉండగా 640 మంది ఆర్టిజన్‌ కార్మికులుగా గుర్తించబడ్డారు. మరో 23 మంది నాన్‌ ఆర్టిజన్‌ కార్మికులుగా మిగిలిపోయారు. 2016 డిసెంబరు 4 వరకు కటాఫ్‌ డేట్‌ నిర్ణయించి అప్పటివరకు అగ్రిమెంట్‌ అయి విధులు నిర్వహిస్తున్న కార్మికులను ఆర్టిజన్‌ కార్మికులుగా గుర్తించారు. కానీ జిల్లాలో కొన్ని సబ్‌ స్టేషన్లు అనధికారికంగా ప్రారంభించి ఆపరేటర్లను నియమించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారికంగా సబ్‌ స్టేషన్లను ప్రారంభించకపోవడంతో కటాఫ్‌ తేదీకి  కాంట్రాక్టర్లు అగ్రిమెంట్‌ ఇవ్వలేదు. దాంతో ప్రభుత్వం వారిని ఆర్టిజన్‌ కార్మికులుగా గుర్తించలేదు. 2017 జూలై 17తర్వాత జరిగిన అగ్రిమెంట్లు పాత తేదీల్లోనే ప్రభుత్వం వన్‌-డే మెంట్‌ తీసుకుంది. కాబట్టి ఇలాంటి సబ్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కార్మికులను ఆర్టిజన్‌ కార్మికుల గుర్తించాలని కోరుతున్నారు. విద్యుత్‌ సంస్థల్లో స్టాండింగ్‌ ఆర్డర్‌ను తొలగించాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్టిజన్‌ కార్మికులను పూర్తి స్థాయి ఉద్యోగులుగా పరిగణించాలని, అందుకు ఏపీఎ్‌సఈబీ రూల్స్‌ను పరిగణలోకి తీసుకోవాలని నాలుగు దఫాలుగా లేబర్‌ కమిషనర్‌ వద్ద సమావేశాలు కూడా నిర్వహించారు. ఎలక్ట్రిసిటీ ట్రేడ్‌ యూనియన్‌ ఫ్రంట్‌గా ఏర్పడి ప్రభుత్వానికి వినతిపత్రాన్ని అందజేశారు. పెన్షన్‌ సౌకర్యం, ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 24గంటల నిరంతర విద్యుత్‌ అలవెన్స్‌, మెడికల్‌ పాలసీ, నివాస సముదాయాల నిర్మాణం కల్పించాలని కోరుతున్నారు. కానీ కార్మికులతో పలుమార్లు విద్యుత్తు యాజమాన్యాలు, కార్మిక శాఖ అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా స్పందించినా ఆలస్యమవుతుండడంపై ఆవేదన చెందుతున్నారు. 


 

Updated Date - 2021-12-19T05:30:00+05:30 IST