సిద్దిపేటలో వీరుని గుడి

ABN , First Publish Date - 2021-05-08T05:35:18+05:30 IST

సిద్ధులున్నపేట కనుక సిద్దిపేట అనే పేరొచ్చిందంటారు. పేరు పుట్టడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.

సిద్దిపేటలో వీరుని గుడి
సిద్దిపేటలోని పారుపల్లివీధిలోని భోగేశ్వరాలయ సమీపంలో నాలుగు రాతి స్థంభాల నడుమ వీరుని విగ్రహం

 గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర సభ్యులు 


సిద్దిపేట, మే 7 : సిద్ధులున్నపేట కనుక సిద్దిపేట అనే పేరొచ్చిందంటారు. పేరు పుట్టడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. దేవుడి పేరు మీద గుడికి పేరొచ్చినట్టు దేనికైనా ఆ పేరు రావడానికి ఓ చరిత్ర ఉంటుంది. అది తెలుసుకోవడము కూడా ఓ చరిత్రే. కొన్ని శిల్పాలు చెప్పే కథలు మనల్ని చరిత్రలోకి తీసుకెళ్తాయి. రాజుల చరిత్రకు తీసిపోని విధంగా యుద్ధవీరుల చరిత్రా ఉంటుంది. పూర్వం ఊరును కాపాడడానికి వీరులుండేవారు. వారు ఆ గ్రామంలోని పిల్లల్ని, స్ర్తీలను, పశువులను, సంపదలను కాపాడడానికి దొంగలతోనైనా, పరాయి సైనికులతోనైనా, క్రూరజంతువులతోనైనా ప్రాణాలకు తెగించి పోరాడేవారు. ఇటువంటి పోరులో అమరులైన వీరుల పేరిట గ్రామస్థులు, పాలకులు నిలిపిన స్మారకశిలలే వీరగల్లులు. ఈ వీరుల్లో మతం కోసం తలను, శరీరంలోని అంగాలను అర్పించేవారు. ఇలాంటి వారు వీరశైవులలో ఎక్కువగా కనిపిస్తారు. ఈ ఆత్మాహుతి వీరుల పేరిట కూడా వీరగల్లులు వేయబడ్డాయి. భర్తలు మరణిస్తే ప్రాణత్యాగం చేసిన భార్యల (స్ర్తీల) పేరిట వేసిన సతిశిలలు కూడా ఉన్నాయి. ఇదంతా వీరగల్లుల చరిత్ర. 

సిద్దిపేటలోని పారుపల్లివీధిలోని భోగేశ్వరాలయంలోపల, బయట, పొలాల్లో వీరగల్లులున్నాయి. వీటిలో ఆత్మాహుతి శిలలెక్కువ. యుద్ధం చేసి మరణించిన వీరుల శిలలు కూడా ఉన్నాయి. ఇటీవల గుడి పక్కన ఉన్న పొలాల్లో పశువులను కట్టేసే చోట నాలుగురాతి స్థంభాల నడుమ భూమిలోపల నడుము వరకు పాతుకుపోయి ఉన్న వీరుని శిల్పం కన్పించింది. ఆ నాలుగు స్థంభాలు కూడా వీరుని గుడి కోసం పాతినవి. వీరునికి గుడి కట్టడం చాలా అరుదు. అలాంటి గుడి సిద్దిపేటలో కనిపించడం విశేషం. ఈ రాచవీరునికి తలపై సిగ కుడివైపునకు కట్టి ఉంది. చెవులకు పెద్దకుండలాలున్నాయి. 10, 11 శతాబ్దాల నాటి ఆహార్యంతో వీరుడు దర్శనమిస్తున్నాడు. వీరుని మెడలో రత్నాలు పొదిగిన హారాలున్నాయి. వీరుని తలమీద రాచహోదాను తెలిపే ఛత్రం(గొడుగు) పెద్దకళ్లు, తిప్పిన మీసాలు, దీర్ఘచతురస్రాకారపు ముఖంతో కనిపిస్తున్నాడు. దండరెట్టలమీద కడియాలున్నాయి. ఎదరొమ్ముమీద గుచ్చుకుంటున్న బాకును ఎడమచేత పట్టుకుని ఆత్మాహుతి చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. భోగేశ్వరాలయంలో శూలాలతో నిల్చున్న ఇద్దరు వీరులు ఆత్మాహుతికి సిద్ధపడివున్న శిల్పం ఉన్నది. మరికొన్ని వీరశిలలు ఆలయం చుట్టుపక్కలనే ఉన్నాయి. కొత్త తెలంగాణ చరిత్ర సభ్యులు అహోబిలం కరుణాకర్‌ సామలేటి మహేశ్‌లు ఈ వీరుని విగ్రహం గుర్తించారు.

Updated Date - 2021-05-08T05:35:18+05:30 IST