సూపర్‌ స్ర్పెడర్లకు వ్యాక్సిన్‌ స్పెషల్‌డ్రైవ్‌ విజయవంతం

ABN , First Publish Date - 2021-05-30T05:53:26+05:30 IST

మెదక్‌ జిల్లాలో మొత్తం 40వేల మంది సూపర్‌స్ర్పెడర్లకు వాక్సిన్‌ వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు జిల్లా వైద్యాదికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు. తూప్రాన్‌ పట్టణంలో సూపర్‌స్ర్పెడర్ల కోసం ఏర్పాటుచేసిన వాక్సినేషన్‌ కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ

సూపర్‌ స్ర్పెడర్లకు వ్యాక్సిన్‌ స్పెషల్‌డ్రైవ్‌ విజయవంతం
తూప్రాన్‌ దవాఖానాలో వ్యాక్సిన్‌ వేస్తున్న డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు

మెదక్‌ రూరల్‌, మే 29: సూపర్‌ స్ర్పెడర్లకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ స్పెషల్‌డ్రైవ్‌ మెదక్‌ జిల్లాలో విజయవంతమైందని కలెక్టర్‌ హరీశ్‌ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సూపర్‌ స్ర్పేడర్లకు టీకా కార్యక్రమం రెండోరోజు శనివారం 1,446 మందికి కొవిషిల్డ్‌ వ్యాక్సిన్‌ వేసినట్టు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంతోపాటు పాన్నపేట, కౌడిపల్లి, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌, పెద్దశంకరంపేటలో టీకాలు వేసినట్టు తెలిపారు. జిల్లాలో తొలివిడతలో 3,119 మంది సూపర్‌స్ర్పేడర్లను గుర్తించగా వీరిలో 83 శాతం (2,582) మందికి టీకాలు వేసినట్టు తెలియజేశారు. మిగిలినవారు గతంలోనే 45 సంవత్సరాలు పైబడిన కోటాలో టీకాలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఈమేరకు సూపర్‌స్ర్పెడర్లు దాదాపుగా అందరూ టీకా తీసుకున్నట్టుగా భావించాలని కలెక్టర్‌ వివరించారు. వ్యాక్సినేషన్‌లో వైద్యసిబ్బంది కృషి ఎంతోఉందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన పోలీసులు, జిల్లా యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కొవిడ్‌ బాధితులకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఎక్కడా ఆక్సిజన్‌, వెంటలేటర్ల కొరతలేదని, కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్నారు. కరోనా సోకినవారు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవద్దని, ప్రభుత్వ దవాఖానాల్లో సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


మూడు కేంద్రాల్లో జోరుగా వాక్సినేషన్‌

తూప్రాన్‌, మే 29: మెదక్‌ జిల్లాలో మొత్తం 40వేల మంది సూపర్‌స్ర్పెడర్లకు వాక్సిన్‌ వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు జిల్లా వైద్యాదికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు. తూప్రాన్‌ పట్టణంలో సూపర్‌స్ర్పెడర్ల కోసం ఏర్పాటుచేసిన వాక్సినేషన్‌ కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో తూప్రాన్‌, మెదక్‌, రామాయంపేట, కౌడిపల్లి, నర్సాపూర్‌, పాపన్నపేట, పెద్దశంకరంపేటలో ఏడు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు.  ఇందులో తూప్రాన్‌, మెదక్‌, రామాయంపేటలో వాక్సినేషన్‌కు స్పందన ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. మొదటి ధపాలో ఎల్పీజీ డీలర్లు, సప్లయ్‌ బాయ్‌లు, పెట్రోల్‌బంక్‌ డీలర్లు, వర్కర్లు, రేషన్‌ డీలర్లు, ఫెస్టిసైడ్‌ దుకాణదారులు, జర్నలిస్టులకు వాక్సినేషన్‌ చేసినట్టు ఆయన వివరించారు. రెండో దఫాలో కూరగాయల విక్రయదారులు, స్ట్రీట్‌వెండర్స్‌, హమాలీలు, రైస్‌మిల్‌వర్కర్లు తదితరవర్గాలకు వాక్సిన్‌ వేయనున్నట్టు ఆయన వివరించారు. తూప్రాన్‌లో సూపర్‌స్ర్పెడర్ల పేరిట తప్పుడు ధ్రువపత్రాలను చూపిన కొందరు ఇతరులు కూడా వాక్సిన్‌ వేసుకున్నట్టు డీఎంహెచ్‌వో విమర్శించారు. జిల్లాలో ప్రతీరోజు 10వేల మందికి టీకావేసే సామర్థ్యం వైద్యఆరోగ్యశాఖకు ఉందని ఆయన పేర్కొన్నారు. కొవిషీల్డ్‌ రెండోడోసు 12 నుంచి 16 వారాల మధ్యన తీసుకుంటేనే యాంటిబాడీలు తయారవుతాయన్నారు. జిల్లాలో మొదటివిడత జ్వర సర్వేలో 1.75 లక్షల ఇళ్లు సర్వేచేశామని, 7,400 మందికి లక్షణాలు ఉన్నట్టు గుర్తించి కరోనాకిట్‌లు అందజేశామన్నారు. రెండోవిడత సర్వేలో 4,255 మందికి లక్షణాలున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. జిల్లాలో 24 కేంద్రాల్లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ప్రతీ పీహెచ్‌సీలో రోజూ 100 పరీక్షలు చేస్తున్నట్టు వివరించారు. ఆయన వెంట పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్‌ కృష్ణమూర్తి, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి సుమిత్ర, పీహెచ్‌సీ వైద్యాధికారి ఆనంద్‌ ఉన్నారు. 

Updated Date - 2021-05-30T05:53:26+05:30 IST