వేధింపులను భరించలేక భార్యే కడతేర్చింది

ABN , First Publish Date - 2021-12-05T04:31:11+05:30 IST

వేధింపులను భరించలేక భార్య కూతురుతో కలిసి మరో వ్యక్తి సాయంతో భర్తను కడతేర్చింది.

వేధింపులను భరించలేక భార్యే కడతేర్చింది
విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడిస్తున్న సీఐ జార్జి

 హత్య కేసును ఛేదించిన పోలీసులు

 అల్లాదుర్గం సీఐ జార్జి వెల్లడి

 పెద్దశంకరంపేట, డిసెంబరు 4: వేధింపులను భరించలేక భార్య కూతురుతో కలిసి మరో వ్యక్తి సాయంతో భర్తను కడతేర్చింది. శనివారం అల్లాదుర్గం సీఐ జార్జి, పెద్దశంకరంపేట ఎస్‌ఐ నరేందర్‌ పెద్దశంకరంపేట పోలీ్‌సస్టేషన్‌లో విలేకరులతో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ మేరకు..  పెద్దశంకరంపేట మండలంలోని మల్కాపూర్‌ గ్రామానికి చెందిన ఎరుకల వెంకయ్య(40) తన భార్య శ్యామలతో పాటు 11 ఏళ్ల కూతురును తరచుగా డబ్బుల కోసం వేధించేవాడు. ఏ విధంగానైనా సరే తనకు డబ్బును తెచ్చివ్వమంటూ వేధింపులకు గురి చేసేవాడు. దీంతో విసిగిపోయిన భార్య, కూతురు కలిసి మల్కాపూర్‌ గ్రామానికి చెందిన మరో వ్యక్తి వడ్డె మల్లయ్య  సాయంతో పథకం ప్రకారం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు. పథకంలో భాగంగా  గత నెల 29న మధ్యాహ్నం మల్కాపురం నుంచి ఆస్పత్రి కోసం వెంకయ్యతో పాటు భార్య, కూతురు, వడ్డె మల్లయ్య కలసి పెద్దశంకరంపేటకు వచ్చి కల్లు దుకాణంలో కల్లు తాగారు. అనంతరం వైన్స్‌లో మద్యం సేవించి మరికొంత మద్యాన్ని వెంట తీసుకెళ్లారు. మార్గమధ్యంలో గురుపాద గుట్ట వద్ద వెంట తెచ్చుకున్న మద్యం తాగారు. ఈ క్రమంలో వెంకయ్య స్పృహ కోల్పోగా ముగ్గురు కలసి వెంకయ్య గొంతును  తాడుతో బిగించి  హత్య చేశారు. దీన్ని ఆత్మహత్యగా చూపేందుకు మృతుడి పంచతో దగ్గరలోని విద్యుత్‌ హైటెన్షన్‌ స్తంభానికి ఉరి వేసి, ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించారు. కాగా మృతుడి తండ్రి నాగయ్య తన కుమారుడైన వెంకయ్య అనుమానాస్పదంగా మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ కేసును విచారించి హత్య చేసిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని ఇద్దరిని జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించడంతో పాటు మైనర్‌ బాలికను జువైనల్‌ హోంకు తరలించామని సీఐ, ఎస్‌.ఐ వివరించారు.  

Updated Date - 2021-12-05T04:31:11+05:30 IST