కోలాహలంగా..

ABN , First Publish Date - 2021-11-24T04:56:16+05:30 IST

స్థానిక సంస్థల ఉమ్మడి మెదక్‌ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల నామినేషన్ల ఘట్టం మంగళవారంతో పూర్తయింది.

కోలాహలంగా..
నామినేషన్‌ దాఖలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి యాదవరెడ్డి, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, భూపాల్‌ రెడ్డి, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి

చివరిరోజు నామినేషన్లు దాఖలు చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఒంటరి యాదవరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మలాజగ్గారెడ్డి

ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ 

 ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి నామినేషన్లు దాఖలు చేసిన ఏడుగురు అభ్యర్థులు


మెదక్‌, నవంబరు 23: స్థానిక సంస్థల ఉమ్మడి మెదక్‌ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల నామినేషన్ల ఘట్టం మంగళవారంతో పూర్తయింది. ఈనెల 16న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి ఏడుగురు అభ్యర్థులు 13 నామినేషన్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరీశ్‌కు అందజేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన ఒంటరి యాదవరెడ్డితో రాష్ట్ర ఆర్థికశాఖ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నామినేషన్‌ దాఖలు చేయించారు. యాదవరెడ్డి రెండు సెట్లు దాఖలు చేశారు. ఈయన వెంట అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, నారాయణఖేడ్‌ భూపాల్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి ఉన్నారు. 

  కాంగ్రెస్‌ అభ్యర్థిగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలాజగ్గారెడ్డి కూడా రెండు సెట్లు నామినేషన్‌ వేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహ, జిల్లా కాంగ్రెస్‌ అభ్యర్థులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, పార్టీ నేతలు హాజరయ్యారు. దుబ్బాక నియోజకవర్గానికి చెందిన మల్లారెడ్డి స్వతంత్య్ర అభ్యర్థిగా రెండు నామినేషన్లు, సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన బోయిని విజయలక్ష్మ్మి స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. 

ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు

స్థానిక సంస్థల మండలి ఎన్నికల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి యాదవరెడ్డి  మెదక్‌లోని కలెక్టరేట్‌లో మంగళవారం నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయడానికి విచ్చేయగా ఆయనకు మద్ధతుగా వచ్చిన ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. అభ్యర్థితో పాటు పరిమిత సంఖ్యలో మాత్రమే వ్యక్తులకు ఛాంబర్‌లో ప్రవేశించడానికి అనుమతి ఉందని పోలీసులు ఎమ్మెల్యేలను వారించారు. నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డిని మొదట నిలువరించారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నాతాధికారులు వెంటనే అనుమతించారు. అప్పటి కే కలెక్టర్‌ ఛాంబర్‌లో మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌  హరీశ్‌తో భేటీ అయ్యారు. 


మన అభ్యర్థి గెలిస్తే కేసీఆర్‌కు షాక్‌!

దోపిడీ చేసిన డబ్బుతోనే ఎమ్మెల్సీసీటు కొన్న వెంకట్రామారెడ్డి 

టీఆర్‌ఎస్‌ నేతల వద్ద డబ్బు తీసుకొని కాంగ్రె్‌సకు ఓటేయండి

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి 


మెదక్‌, నవంబరు 23: ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మన అభ్యర్థి గెలిస్తే సీఎం కేసీఆర్‌కు షాక్‌ తగులుతుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సతీమణి నిర్మలారెడ్డి మెదక్‌ కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్‌ తరఫున నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో కలిసి మెదక్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రె్‌సకు 230 ఓట్లు ఉన్నాయని, మిగతా 600 వందల ఓట్లను దక్కించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ నేతల వద్ద డబ్బు తీసుకొని కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వెయ్యాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి దోపిడీ చేసిన డబ్బును టీఆర్‌ఎస్‌ నేతలకు ముట్టచెప్పి ఎమ్మెల్సీ సీటు కొనుగోలు చేశారని విరుచుకుపడ్డారు. జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా కలెక్టర్‌గా విధులను నిర్వర్తించడమే కాక మల్లన్నసాగర్‌, కొల్లూరు, జహీరాబాద్‌ భూముల పేరిట దోచుకున్న కోట్ల రూపాయల సొమ్ముతో ఎమ్మెల్సీ పదవిని వెంకట్రామారెడ్డి దక్కించుకున్నారని ఆరోపించారు.  మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రమైన వ్యతిరేకత పెరిగిందని, అందువల్లే హుజూరాబాద్‌ ఎన్నికల్లో సీఎంకు బుద్ధిచెప్పేందుకే బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారని వివరించారు. రానున్న రోజుల్లో ఈ దోపిడీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారని జోస్యం చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలను కొనుగోలు కేంద్రాలుగా మార్చారని మండిపడ్డారు. ఈ సమావేశంలో మెదక్‌ డీసీసీ ప్రెసిడెంట్‌ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్‌ తూంకుంట నర్సారెడ్డి, రాష్ట్ర నేతలు మ్యాడం బాలకృష్ణ, సుప్రబాత్‌రావు, మామిళ్ల ఆంజనేయులు, ముస్లాపురం రాజలింగం పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-24T04:56:16+05:30 IST