ట్రైడెంట్ షుగర్ పరిశ్రమ పున:ప్రారంభం!
ABN , First Publish Date - 2021-10-21T04:51:14+05:30 IST
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు(బి) గ్రామంలో ఉన్న ట్రైడెంట్ షుగర్ పరిశ్రమను పున:ప్రారంభించేందుకు పరిశ్రమ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది.

సన్నాహాలు చేస్తున్న యాజమాన్యం
విధుల్లో చేరిన 85 మంది కార్మికులు
పెండింగ్ వేతనాల్లో కొంతమేర చెల్లింపు
నవంబరు 25వ లోగా పూర్తిస్థాయిలో చెరకు గానుగ
జహీరాబాద్ అక్టోబరు 20: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు(బి) గ్రామంలో ఉన్న ట్రైడెంట్ షుగర్ పరిశ్రమను పున:ప్రారంభించేందుకు పరిశ్రమ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే లే ఆఫ్‌ను ఎత్తివేసి బుధవారం 85 మంది పర్మినెంట్ కార్మికులను పరిశ్రమ యాజమాన్యం తిరిగి విధుల్లోకి తీసుకుంది. గత 18 నెలలుగా తాత్కాలికంగా మూతపడిన పరిశ్రమను పున:ప్రారంభించిన అనంతరం పరిశ్రమలో చెరకును గానుగ ఆడించేందుకు కార్మికులతో పూజలు నిర్వహించారు. గతంలో పరిశ్రమల్లో పని చేసిన 190 మంది కార్మికుల్లో మొదటి విడతగా 85 మంది కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు. అందులో మెకానికల్, ఎలక్ట్రికల్, ఫీల్డ్మెన్లు ఉన్నారు. మిగిలిన 105 మంది సీజనల్ కార్మికులను త్వరలోనే విధుల్లోకి తీసుకుంటామని పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. నవంబరు 25 లోగా పరిశ్రమలో పూర్తిస్థాయిలో చెరకు పంట గానుగ పట్టేలా చూస్తామన్నారు. అలాగే పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు పెండింగ్ వేతనంలో కొంతమేర చెల్లించినట్లు వెల్లడించారు. మిగిలిన డబ్బు కూడా త్వరలోనే చెల్లించి సాధ్యమైనంత త్వరగా పరిశ్రమను ప్రారంభిస్తామని చెప్పారు.