వేరుశనగ విత్తనోత్పత్తి దిశగా..

ABN , First Publish Date - 2021-11-29T05:03:11+05:30 IST

రైతులు విత్తనోత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో గతంలో ఎన్నడూ వేయని వేరుశనగ పంటను సాగు చేయడమే కాకుండా విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కుక్‌ మండల పరిధిలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టగా ఊహించని రీతిలో దిగుబడి వస్తున్నదని వ్యవసాయాధికారులు తెలిపారు.

వేరుశనగ విత్తనోత్పత్తి దిశగా..
విరగకాసిన వేరుశనగను చూపిస్తున్న వ్యవసాయాధికారి, రైతు

మర్కుక్‌ మండలంలో పైలట్‌ ప్రాజెక్టుగా 46 ఎకరాల్లో సాగు

అధిక దిగుబడి వస్తుండడంతో రైతుల్లో ఆనందం


గజ్వేల్‌, నవంబరు 28 : రైతులు విత్తనోత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో గతంలో ఎన్నడూ వేయని వేరుశనగ పంటను సాగు చేయడమే కాకుండా విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కుక్‌  మండల పరిధిలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టగా ఊహించని రీతిలో దిగుబడి వస్తున్నదని వ్యవసాయాధికారులు తెలిపారు.

 

20 క్వింటాళ్ల వరకు దిగుబడి

సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటతో పాటు గణేశ్‌పల్లి, పాములపర్తి, మర్కుక్‌ గ్రామాలకు చెందిన 16 మంది రైతులను ఎంపిక చేశారు. 49 ఎకరాల్లో పునాసలో వేరుశనగ పంటను పైలట్‌ ప్రాజెక్టుగా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సహకారంతో జిల్లా వ్యవసాయాధికారి శ్రావణ్‌కుమార్‌, మండల వ్యవసాయాధికారి టి.నాగేందర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో సాగుచేయించారు. కదిరి లేపాక్షి రకం విత్తనాలను రైతులకు వ్యవసాయాధికారులు అందజేశారు. రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తూ సాగు చేయించగా, సాధారణంగా ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావించారు. కానీ ఊహించని రీతిలో 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నది. ఇతర పంటలతో పోలిస్తే వేరుశనగ పంటకు మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉండగా, కొనుగోలు కేంద్రాలతో నిమిత్తం లేకుండా అమ్ముకునే వీలు ఉంది. నర్సన్నపేట గ్రామానికి చెందిన ఊడెం పరమేశ్వర్‌రెడ్డి అనే రైతుకు సంబంధించి పంట చేతికి వచ్చింది. ఒక్కో చెట్టుకు 60 నుంచి 80 కాయలున్నాయి. ఈ రైతుకు ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పరమేశ్వర్‌రెడ్డి పంటతో పోల్చితే మిగిలిన రైతుల పంట ఆశాజనకంగా ఉండడంతో 20 క్వింటాళ్ల దిగుబడి లభిస్తుందని భావిస్తున్నారు. ఇక వేరుశనగకు బహిరంగ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.6,500  పలుకుతున్నది. విత్తనోత్పత్తిలో భాగంగా చేపట్టిన ఈ పంటను క్వింటాలుకు రూ.8వేల నుంచి రూ.8500 వరకు చెల్లిస్తూ విత్తన కంపెనీయే కొనుగోలు చేస్తుంది. దీంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. అంతేకాకుండా యాసంగిలో 200 ఎకరాల్లో విత్తనోత్పత్తి చేసేందుకు రైతులు ముందుకు వచ్చినట్లు తెలిసింది. 


Updated Date - 2021-11-29T05:03:11+05:30 IST