బరిలో ముగ్గురు అభ్యర్థులు

ABN , First Publish Date - 2021-11-27T04:59:16+05:30 IST

నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మెదక్‌ నియోజకవర్గ స్థానికసంస్థల ఎమ్మెల్సీ బరిలో ముగ్గురు అభ్యర్థులు మిగిలారు. టీఆర్‌ఎస్‌ నుంచి యాదవరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మలాజగ్డారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డి పోటీలో ఉన్నారు. సంగారెడ్డి మున్సిపల్‌ కౌన్సిలర్‌ విజయలక్ష్మి తన నామినేషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు.

బరిలో ముగ్గురు అభ్యర్థులు

విజయలక్ష్మి నామినేషన్‌ ఉపసంహరణ


సంగారెడ్డి టౌన్‌/మెదక్‌ రూరల్‌; నవంబరు 26 : నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మెదక్‌ నియోజకవర్గ స్థానికసంస్థల ఎమ్మెల్సీ బరిలో ముగ్గురు అభ్యర్థులు మిగిలారు. టీఆర్‌ఎస్‌ నుంచి యాదవరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మలాజగ్డారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డి పోటీలో ఉన్నారు. సంగారెడ్డి మున్సిపల్‌ కౌన్సిలర్‌ విజయలక్ష్మి తన నామినేషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎం.విజయలక్ష్మితో కలిసి వచ్చిన ఆమె ఉపసంహరణపత్రాన్ని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ హరీశ్‌కు అందజేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇవ్వడంతోనే నామినేషన్‌ ఉపసంహరించుకున్నానని బోయిని విజయలక్ష్మి తెలిపారు. పట్టణాభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగిన టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ బోయిని విజయలక్ష్మిని బుజ్జగించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించడంతో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ మల్కపురం శివకుమార్‌, బొంగుల రవి, గోవర్ధన్‌నాయక్‌ రంగంలోకి దిగారు. బోయిని విజయలక్ష్మితోపాటు కౌన్సిలర్‌ కొత్తపల్లి శ్రీకాంత్‌, మరో కౌన్సిలర్‌ స్వప్న భర్త నర్సింహులు, మాజీ కౌన్సిలర్లు ప్రదీ్‌పకుమార్‌, చంద్రశేఖర్‌ తదితరులతో చర్చించారు. వారందరితో కలిసి మంత్రి హరీశ్‌రావును గురువారం రాత్రి సిద్దిపేటలో కలిశారు. పట్టణంలో అభివృద్ధి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతా ప్రభాకర్‌ తీరుపై టీఆర్‌ఎస్‌ నాయకులు, కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనికి మంత్రి స్పందిస్తూ సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి నిధులను మంజూరు చేస్తానని, పార్టీ పటిష్టతకు కృషిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో బోయిని విజయలక్ష్మి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. 

Updated Date - 2021-11-27T04:59:16+05:30 IST