ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అవకాశమే లేదు
ABN , First Publish Date - 2021-12-27T04:39:09+05:30 IST
కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయనందున, రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అవకాశమే లేదని, రైతులు యాసంగిలో పంట మార్పిడి చేయడమే శరణ్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి రైతులకు సూచించారు.

పంట మార్పిడే శరణ్యం : ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
కల్హేర్, డిసెంబరు 26 : కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయనందున, రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అవకాశమే లేదని, రైతులు యాసంగిలో పంట మార్పిడి చేయడమే శరణ్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి రైతులకు సూచించారు. సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా యాసంగి ఆరుతడి పంటలకు ఆదివారం నీటిని విడుదల చేశారు. అనంతరం ప్రాజెక్టు సమీపంలో జరిగిన రైతుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. యాసంగిలో పండించే ధాన్యాన్ని కచ్చితంగా బాయిల్డ్ చేస్తేనే నూక శాతం కాదని, అయితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారత ఆహార సంస్థ యాసంగిలో పండించే ధాన్యాన్ని కొనబోమని చెప్పడంతో నల్లవాగు ప్రాజెక్టు కింద వరి పంటకు సరిపోనూ నీరు ఉన్నా ఆరుతడి పంటలే వేసుకోవాల్సి వస్తుందన్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో 1,493 అడుగుల నీటి నిల్వ ఉన్నదని, ఆయకట్టు పరిధిలోని కుడి, ఎడమ కాలువల కింద 5,100 ఎకరాల్లో ఆరుతడి పంటలు వేసుకోవడానికి కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు పాల్గొనే నీటిపారుదల సలహా సంఘం బోర్డు తీర్మానించినందున, రైతులు ఎవరూ నల్లవాగు ప్రాజెక్టు కింద వరి వేయొద్దని ఎమ్మెల్యే సూచించారు. నల్లవాగు ప్రాజెక్టు కాలువల మరమ్మతుల కోసం రూ.24.54 కోట్లు మంజూరు చేయించామని, కాంట్రాక్టర్ సమస్యతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని చెప్పారు. త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. ఇదివరకు నీటి పారుదల అధికారుల నిర్లక్ష్యం కారణంగా చివరి ఆయకట్టు వరకు సాగు నీరందక రైతులు నష్టపోయారని, యాసంగిలో అలాంటి సమస్య పునరావృతం కాకుండా ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ వెంకట్‌రాంరెడ్డి, ఖేడ్ ఆత్మ కమిటీ చైర్మన్ రాంసింగ్, సిర్గాపూర్ ఎంపీపీ జారా మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీలు రాఘవరెడ్డి, నర్సింహారెడ్డి, జడ్పీ కోప్షన్ సభ్యుడు ఎండి.అలీ, రైతుబంధు మండల కో ఆర్డినేటర్ కృష్ణమూర్తి, సిర్గాపూర్, కల్హేర్ వైస్ ఎంపీపీలు ప్రయాగబాయి మాధవరావ్, నారాయణరెడ్డి, సర్పంచులు గంగామణి నర్సింహులు, సంజీవరెడ్డి, సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఆశయాలను ఆచరించాలి
అంబేడ్కర్ ఆశయాలను ప్రతిఒక్కరూ ఆచరించాలని ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి అన్నారు. కల్హేర్ మండల పరిధిలోని ఫత్తేపూర్ అక్షర యువస్టార్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి మాట్లాడారు. బడుగు, బలహీనవర్గాల ప్రజల కోసం అంబేడ్కర్ ఎంతో పరితపించేవారని, ఆయన కల్పించిన రిజర్వేషన్ల ఫలితంగా ఎస్సీ, ఎస్టీలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్హేర్ జడ్పీటీసీ నర్సింహారెడ్డి, జడ్పీ కోప్షన్ సభ్యుడు ఎండి.అలీ, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, ఫత్తేపూర్ సర్పంచ్ కవిత, అక్షర స్టార్ యూత్ బాధ్యులు లింగం, బాలయ్య, సాయిబాబా, బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవన్, లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రాథోడ్ పాల్గొన్నారు.