ఎమ్మెల్యేను విమర్శించే నైతిక హక్కు లేదు
ABN , First Publish Date - 2021-08-04T03:42:49+05:30 IST
టీఆర్‌ఎస్ నాయకులకు ఎమ్మెల్యే రఘునందన్‌రావును విమర్శించే నైతిక హక్కులేదని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కన్వీనర్ భూపాల్ మండిపడ్డారు.

దుబ్బాక, ఆగస్టు 3: టీఆర్‌ఎస్ నాయకులకు ఎమ్మెల్యే రఘునందన్‌రావును విమర్శించే నైతిక హక్కులేదని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కన్వీనర్ భూపాల్ మండిపడ్డారు. మంగళవారం దుబ్బాకలోని బీజేపీ దళిత మోర్చా పట్టణ అధ్యక్షుడు బద్రి ఆధ్వర్యంలో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత వాదం, దళిత ఎజెండా ముసుగులో కొంతమంది టీఆర్‌ఎస్ నాయకులు పార్టీ కండవాలను పక్కనబెట్టి రఘునందన్‌రావును విమర్శంచే పని పెట్టుకున్నారని విమర్శించారు. వల్లూరు దళిత సర్పంచును ఎమ్మెల్యే అవమాన పరిచారని టీఆర్‌ఎస్ నాయకులు బురదజల్లుతున్నారని చెప్పారు. సర్పంచ్ ఆహ్వానం మేరకే ఎమ్మెల్యే వెళ్లారని, సర్పంచును కొంతమంది ప్రజాప్రతినిధులు బెదిరించడంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ దళిత మోర్చా నాయకులు కుతూరు నర్సింలు, రాజేష్, సోశయ్య, యాదగిరి, కనకరాజు, బాల్‌రాజు, యాదగిరి, వెంకట్, కరుణాకర్, సంజీవ్, స్వామి పాల్గొన్నారు.