అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

ABN , First Publish Date - 2021-10-30T04:17:35+05:30 IST

మండల పరిధిలోని హుల్గేర శివారులో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

రాయికోడ్‌, అక్టోబరు 29: మండల పరిధిలోని హుల్గేర శివారులో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం..  మునిపల్లి మండలం పెద్ద చెల్మెడ గ్రామానికి చెందిన శంకరమ్మ(27)కు నాలుగున్నర ఏళ్ల క్రితం మండలంలోని హుల్గేర గ్రామానికి చెందిన బిచ్చప్పతో  వివాహం జరిగింది. భార్యభర్తల మధ్య విబేధాల కారణంగా పెళ్లయిన నాలుగు నెలలకే శంకరమ్మ పుట్టింటికి వెళ్లింది. అనంతరం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నాటినుంచి భర్తకు దూరంగా పెద్ద చెల్మెడలోని తల్లి పద్మమ్మ వద్దే ఉంటున్నది. గురువారం పెద్దచెల్మెడలో తల్లితో పాటు పత్తి తీయడం కోసం పొలానికి వెళ్లింది.  మధ్యాహ్నం పత్తి సంచిని ఇంటి వద్ద వేసి వచ్చేందుకు శంకరమ్మ బయలుదేరింది. ఆమె తిరిగి పొలానికి రాకపోవడంతో, తల్లి గ్రామంలోకి వచ్చి వెతికినా ఫలితం లేకపోయింది. శుక్రవారం వేకువజామున హుల్గేర శివారు వాగులో మహిళ మృతదేహం పడిఉన్నట్టు పలువురు గమనించి  పోలీసులకు సమాచారమందించారు. తల్లి, సోదరుడు శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం శంకరమ్మదిగా గుర్తించారు.  జహీరాబాద్‌ డీఎస్పీ శంకర్‌రాజ్‌, జహీరాబాద్‌ రూరల్‌ సీఐ నాగేశ్వర్‌రావు, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం అధికారులు ఆధారాలను సేకరించారు. మృతురాలి అన్న శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-10-30T04:17:35+05:30 IST