ఈటల గెలుపు ఖాయం

ABN , First Publish Date - 2021-10-30T04:36:02+05:30 IST

టీఆర్‌ఎస్‌ ఓటుకు రూ.6 వేలు పంచి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నా హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపు ఖాయమని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని శుక్రవారం రాత్రి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈటల గెలుపును కాంక్షిస్తూ మల్లన్నకు ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ఈటల గెలుపు ఖాయం
మల్లన్న ఆలయంలో పూజలు చేస్తున్న జితేందర్‌రెడ్డి

బీజేపీ పట్ల అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మరు 

కేసీఆర్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇస్తారు

మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి


చేర్యాల, అక్టోబరు 29 : టీఆర్‌ఎస్‌ ఓటుకు రూ.6 వేలు పంచి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నా హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపు ఖాయమని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని శుక్రవారం రాత్రి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈటల గెలుపును కాంక్షిస్తూ మల్లన్నకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ గెస్ట్‌హౌజ్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో సమానంగా 14 ఏళ్లు పోరాటం చేసిన యోధుడు ఈటల రాజేందర్‌ అని తెలిపాడు. ఆయనపై లేనిపోని అభాండాలు మోపితే భరించలేక బయటకు వచ్చాడని అన్నారు. ఈటల రాజేందర్‌ మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుజూరాబాద్‌ ఉపఎన్నికలో నిలబడితే అక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారని చెప్పారు. ఎక్కడ చూసినా నీరాజనం పలుకుతున్నారన్నారు. ఈటల రాజీనామాతోనే ప్రభుత్వానికి హుజూరాబాద్‌ అభివృద్ధి గుర్తుకు వచ్చిందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. అడ్డదారిలో గెలవడానికి ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని మోసపూరిత పథకాలు తెచ్చినా ఈటల గెలుపును అడ్డుకోలేరన్నారు. హుజూరాబాద్‌  ప్రజలు సీఎం కేసీఆర్‌కు దిమ్మదిరిగే షాక్‌ ఇవ్వడం ఖాయమని అన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఉడుత మల్లేశంయాదవ్‌, సనాది కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


సెంటిమెంట్‌ ఫలించేనా..!

దుబ్బాక ఉపఎన్నిక సమయంలోనూ ఇన్‌చార్జిగా వ్యవహరించిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఎన్నికకు ముందు రఘునందన్‌రావు గెలుపును కాంక్షిస్తూ కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని ముడుపు కట్టారు. రఘునందన్‌రావు విజయానంతరం మొక్కులు తీర్చుకున్నారు. ఇదే క్రమంలో హుజురాబాద్‌ ఉప ఎన్నికకు ఒక రోజు ముందు మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో అదే సెంటిమెంట్‌ ఫలిస్తుందా.. లేదా అన్న విషయం నవంబర్‌ 2న తేలనున్నది. 


Updated Date - 2021-10-30T04:36:02+05:30 IST