కొత్త సూపరింటెండెంట్‌ వచ్చారు.. వెళ్లారు!

ABN , First Publish Date - 2021-12-16T04:36:49+05:30 IST

సంగారెడ్డికి మంజూరైన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, దాని అనుబంధ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి నియమితులైన కొత్త సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.ప్రకాశ్‌రావు బుధవారం జిల్లా ఆస్పత్రికి వచ్చి వెళ్లారు.

కొత్త సూపరింటెండెంట్‌ వచ్చారు.. వెళ్లారు!

కానీ విధుల్లో చేరలేదు

ప్రశ్నార్థకంగా మారిన బాధ్యతల స్వీకరణ

సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 15: సంగారెడ్డికి మంజూరైన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, దాని అనుబంధ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి నియమితులైన కొత్త సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.ప్రకాశ్‌రావు బుధవారం జిల్లా ఆస్పత్రికి వచ్చి వెళ్లారు. సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి బోధనాస్పత్రిగా మారిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తు న్న డాక్టర్‌ ప్రకాశ్‌రావును పదోన్నతిపై సంగారెడ్డి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఈ నెల 7న ప్రిన్సిపల్‌ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నూతనంగా నియమితులైన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రకాశ్‌రావు జిల్లా ఆస్పత్రిలోని ఆయా విభాగాల్లో కలియ తిరిగి పరిశీలించారు. ఎంసీహెచ్‌తో పాటు ఆస్పత్రిలోని పలు కీలక విభాగాలను సందర్శించారు. ఆస్పత్రిలో ఆయా విభాగాలను ప్రస్తుత జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డి దగ్గరుండి ఆయనకు చూపించారు. ఆస్పత్రి అంతా కలియ తిరిగినప్పటికీ ఆయన చివరికి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించకుండా తిరిగి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కొత్త సూపరింటెండెంట్‌గా నియమితులైన ప్రకాశ్‌రావు విధుల్లో చేరుతారా? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారడంతో పాటు ఆస్పత్రి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-12-16T04:36:49+05:30 IST