ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-07-09T04:43:17+05:30 IST
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు.

చిన్నకోడూరు, జూలై 8: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చెర్లఅంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పసునూరి కనకారెడ్డి(58) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం పని మీద సిద్దిపేటకు వెళ్లాడు. పని ముగించుకుని సాయంత్రం సిద్దిపేట నుంచి బస్సులో వచ్చి చెర్లఅంకిరెడ్డి పల్లి స్టేజి వద్ద దిగాడు. రాజీవ్‌రహదారి దాటుతుండగా కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చి కనకారెడ్డిని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన కనకారెడ్డిని అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. కనకారెడ్డి భార్య భారతవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.