రేబర్తి ఉపసర్పంచ్‌పై నెగ్గిన అవిశ్వాసం
ABN , First Publish Date - 2021-10-21T04:23:00+05:30 IST
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని రేబర్తి ఉపసర్పంచ్ బొద్దుల చంద్రమౌళిపై గతనెల 3న వార్డుసభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి సమక్షంలో బుధవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో నెగ్గింది.

పదవి కోల్పోయిన చంద్రమౌళి
సమావేశానికి రాకుండా వార్డుసభ్యులను అడ్డుకున్న బొద్దుల
ఇరువురి మధ్య తోపులాట, పోలీసుల లాఠీచార్జి
మద్దూరు, అక్టోబరు 20 : సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని రేబర్తి ఉపసర్పంచ్ బొద్దుల చంద్రమౌళిపై గతనెల 3న వార్డుసభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి సమక్షంలో బుధవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో నెగ్గింది. గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానానికి ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో సుధీర్‌కుమార్, సెక్రటరీ భాగ్యలక్ష్మి, సర్పంచ్ నాంపల్లి సవితాచంద్రశేఖర్, ఉపసర్పంచ్ బొద్దుల చంద్రమౌళితో పాటు వార్డుసభ్యులు డాకూరి లక్ష్మి, మేర్గు గోవిందరాజు, గూళ్ల నాగలక్ష్మి, బొమ్మ మల్లమ్మ, కూకట్ల లక్ష్మి, కడవేర్గు మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానానికి వార్డుసభ్యులు హాజరవుతుండగా ఉపసర్పంచ్ చంద్రమౌళి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మాన పత్రాలపై ఉన్న సంతకాలను ఆర్డీవో పరిశీలించి వాస్తవమేనా అని వార్డుసభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అవిశ్వాస తీర్మానానికి సర్పంచ్‌తో పాటు ఆరుగురు వార్డుసభ్యులు చేతులెత్తి మద్దతు తెలపడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీవో ప్రకటించారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ బొద్దుల చంద్రమౌళి ఉపసర్పంచ్ పదవి కోల్పోయినట్లు తెలిపారు. ఈనెల 25న తాత్కాలికంగా చెక్‌పవర్ కోసం ఇన్చార్జిగా ఓ వార్డుసభ్యుడిని ఎంపీవో సమక్షంలో ఎన్నుకుని అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా చూడాలని ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల కమిషన్ గజిట్ ప్రకటించిన అనంతరం ఉపసర్పంచ్ పదవికి వార్డుసభ్యుడిని ఎన్నుకోవచ్చని తెలిపారు.
మీడియాను అడ్డుకున్న తహసీల్దార్
ఇదిలా ఉండగా సమావేశానికి అధికారులు స్థానిక మీడియాను ఆహ్వానించారు. విలేకరులు లోపలికి వెళ్లే క్రమంలో తహసీల్దార్ నరేందర్ రావొద్దని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆర్డీవో వచ్చేవరకు ఎవరూ లోపలికి రాకుండా చూడాలని పోలీసులకు హుకూం జారీచేశారు. ఫొటోలు తీసే క్రమంలో ఓ విలేకరి ఫోన్ లాక్కొని తహసీల్దార్ వాగ్వివాదానికి పాల్పడడం శోచనీయం. ఈ విషయమై ఆర్డీవో జయచంద్రారెడ్డిని వివరణ కోరగా తహసీల్దార్‌కు ఇలాంటి విషయాలు తెలియవని, ఇక ముందు జరగవని చెప్పారు.