లారీకి తీగలు తగిలి విద్యుదాఘాతంతో డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2021-12-10T04:52:28+05:30 IST

లారీకి విద్యుత్‌ తీగలు తగలడంతో విద్యుదాఘాతంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నర్సాపూర్‌లో చోటు చేసుకుంది.

లారీకి తీగలు తగిలి విద్యుదాఘాతంతో డ్రైవర్‌ మృతి

నర్సాపూర్‌, డిసెంబరు 9: లారీకి విద్యుత్‌ తీగలు తగలడంతో విద్యుదాఘాతంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నర్సాపూర్‌లో చోటు చేసుకుంది. సంగారెడ్డి నుంచి తూప్రాన్‌కు వెళ్తున్న ఓ కంటైనర్‌ను డ్రైవర్‌ గురువారం మధ్యాహ్నం నర్సాపూర్‌లో రోడ్డు పక్కన నిలిపి టైర్లలో గాలిని పరిశీలిస్తున్నాడు. కాగా అతడికి తెలియకుండానే విద్యుత్‌ తీగల కిందనే కంటైనర్‌ను నిలిపాడు. దీంతో తీగలు కంటైనర్‌ పైభాగానికి తగలడంతో విద్యుదాఘాతానికి గురై డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డుపై వెళ్తున్న వారు గమనించి ఎస్‌ఐలు గంగరాజు, మురళికి సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కంటైనర్‌ వెంట డ్రైవర్‌ ఒక్కడే ఉన్నట్లు గుర్తించారు. అతడి వద్ద లభించిన ఫోన్‌ ఆధారంగా మహరాష్ట్రలోని నాందెడ్‌ ప్రాంతానికి చెందిన జీవత్‌గా గర్తించారు. అతడి కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. మృతదేహాన్ని నర్సాపూర్‌ ప్రభుత్వాసుపత్రిలోని మార్చురికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇప్పటికైనా విద్యుత్‌ అధికారులు రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ తీగలను మార్చాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2021-12-10T04:52:28+05:30 IST