అభివృద్ధికి ఆమడదూరం

ABN , First Publish Date - 2021-11-01T04:27:55+05:30 IST

పేదల దేవుడు రేకులకుంట మల్లిఖార్జునస్వామి ఆలయం అభివృద్ధికి ఆమడదూరంలో నిలుస్తున్నది.

అభివృద్ధికి ఆమడదూరం
రేకులకుంట మల్లికార్జున ఆలయం

అడవిలో ఆగమమవుతున్న రేకులకుంట మల్లన్న ఆలయం

విరాళాలు ఇచ్చేందుకు భక్తులు సిద్ధం అయినా  అటవీశాఖ ఆంక్షలు 

 డెల్టాకాన్‌ సంస్థ సర్వే పూర్తి


దుబ్బాక, అక్టోబరు 31: పేదల దేవుడు రేకులకుంట మల్లిఖార్జునస్వామి ఆలయం అభివృద్ధికి ఆమడదూరంలో నిలుస్తున్నది. పక్క రాష్ర్టాల నుంచి సైతం భక్తులు తరలివస్తుంటారు. అయితే ఆలయాభివృద్ధికి విరాళాలివ్వడానికి అనేకమంది సిద్ధంగా ఉన్నా అటవీశాఖ అధికారుల తీరుతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దుబ్బాక మండలం రేకులకుంట మల్లిఖార్జునస్వామి ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నదని భక్తులు చెప్పుకుంటారు. 1600 సంవత్సరాల క్రితం దట్టమైన మల్లన్నగుట్ట అటవీ ప్రాంతంలో రాతిబండకింద మల్లన వెలిశాడు. మొదట జెండా గుట్టమీద వెలిసిన దేవుడు అక్కడ అపచారం తలెత్తడంతో బండరాయిమారి పొర్లుతూ వచ్చి ఇక్కడ వెలిశాడని భక్తుల నమ్మకం. స్వామివారి పక్కనే రేణుకా ఎల్లమ్మదేవి కూడా కొలువై ఉన్నది. ఈ ఆలయానికి సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్‌, మహారాష్ట్రలోని బివాండి, నాందేడ్‌, షోలాపూర్‌, నాసిక్‌తో తదితర సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివస్తారు. దట్టమైన అడవిలో వెలసిన ఈ ఆలయానికి సరైన దారి లేకపోవడంతో కొన్నేళ్ల క్రితం వరకు కేవలం కాలినడకన మాత్రమే ఇక్కడికి వెళ్లగలిగేవారు. ప్రస్తుతం ఆది, బుధవారం జాతరలా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బోనాలు, పట్నాలు, మేకపిల్ల మత్తగొలుపుడు, ఎల్ల్లమ్మ, మల్లన్న పూజ లు, బియ్యం సుంకుపట్టడం, వాన పూజలు చేస్తుంటారు. దేవాదాయశాఖ పరిధిలోని ఈ ఆలయ ఆదాయం ఏటా రూ. 50లక్షల వరకు ఉంటుంది. 


సౌకర్యాలు లేక ఇబ్బందులు

దుబ్బాక పట్టణం నుంచి ఆలయానికి నేరుగా రహదారి సౌకర్యం లేకపోవడంతో రాజక్కపేట మీదుగా సుమారు 10 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. దట్టమైన అటవీప్రాంతం కావడంతో రాత్రులు జాతర చేయడం కూడా ఇబ్బందిగా మారింది. భక్తులు పాములు, విష కీటకాల బారినపడుతున్నారు. అయినా మల్లన్న మీదనే భారంవేసి జాతర సాగించాల్సి వస్తున్నది. హెక్టారు భూమి కోసం అటవీశాఖ అధికారులను ఎన్నిసార్లు కోరినా స్పందించకపోవడంతో పేదల దేవుడి జాతరకు ఇక్కట్లు తప్పడం లేదు. 


రిజర్వు ఫారెస్టులో ఆలయం

మల్లన్నగుట్టలు రిజర్వు ఫారెస్టు పరిధిలో 111 సర్వే నంబరులో మైసాసురగుట్టగా పిలువబడే ప్రాంతంలో హెక్టారు విస్తీర్ణంలో ఆలయం ఉన్నది. 60 మంది ఒగ్గుపూజారులు ఈ ఆలయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. దేవాదాయశాఖ సిబ్బంది 14 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. ఒగ్గు పూజారులకు ప్రతీవారం వచ్చే టిక్కెట్ల ఆధారంగా పర్సంటేజీ ప్రకారం ఆదాయం పంపిణీ చేస్తారు. ఆలయ అభివృద్ధికి రెండు దశాబ్దాలుగా ఆనేకమంది ప్రయత్నించినా అటవీశాఖ అభ్యంతరాలతో అడుగు ముందుకు పడటంలేదు. ఆలయాభివృద్ధికి అవసరమైన భూమిని ఇక్కడ కేటాయిస్తే అడవికి అనుకుని ఉన్న ప్రాంతంలో భూమిని కొనిస్తామని దాతలు, దేవాదాయశాఖ పలుమార్లు అటవీశాఖకు విన్నవించారు. కానీ అటవీశాఖ నుంచి స్పందనలేదు. రిజర్వు ఫారెస్టు అనే సాకుతో ఒక్క ఇటుక కూడా పేర్చకుండా అడ్డుకుంటున్నారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఇటీవల రూ.లక్ష ఖర్చుతో ఆలయ భూ మిని ఇటీవల డెల్టాకామ్‌ సంస్థ సర్వే చేయించింది. భక్తులకు విడిది, కార్యాలయం, కల్యాణ మండపం, స్నానపు గదులు, దుకాణ సముదాయం, ఆలయ మండపం, సత్రాల నిర్మాణం చేయాలని ప్రయత్నించింది. ఈ సర్వే ప్రకారం ఆలయానికి భూమి కేటాయించడం వల్ల ఎలాంటి అభ్యంతరాలుండవని అటవీశాఖకు, అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌కు విన్నవించింది.



Updated Date - 2021-11-01T04:27:55+05:30 IST