అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-03-21T05:30:00+05:30 IST
మనోహరాబాద్ మండలం ముప్పిడిపల్లిలో అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు.

యువకుడి స్నేహితులపై తండ్రి ఫిర్యాదు
తూప్రాన్ (మనోహరాబాద్), మార్చి 21: మనోహరాబాద్ మండలం ముప్పిడిపల్లిలో అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. మూల కిష్టయ్య కుమారుడు మూల మహేందర్ (30) శనివారం రాత్రి గ్రామానికి చెందిన స్నేహితులైన దుందిగల్ వెంకటేశ్, మూల సురేష్ ఫోన్ చేయగా బయటకు వెళ్లాడు. మహేందర్ భార్య దివ్య రాత్రి 9.30 గంటలకు మహేందర్‌కు ఫోన్ చేయగా, పది నిమిషాల్లో ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. రాత్రి 10 గంటల సమయంలో మహేందర్ మొబైల్ నుంచి వదిన హేమలతకు ఫోన్ కాల్ వచ్చింది. కాల్ లిఫ్టు చేసినప్పటికీ హేమలతతో మాట్లాడకుండా పదినిమిషాలకుపైగా లైన్‌లో పెట్టారు. తిరిగి ఫోన్ చేస్తే ఫోన్‌ను లిఫ్టు చేయలేదు. రాత్రి 10.30 గంటల సమయంలో మూల మహేందర్ ఓవ్యక్తితో కలిసి వెళ్లడం మహేందర్ తండ్రి కిష్టయ్య గుర్తించాడు. ఎంఎల్‌ఆర్ ఏరియాలో కనిపించిన బొలెరో వాహనంలో మూల నవీన్, దుందిగల్ వెంకటేశ్‌ను తన కుమారుడు ఎక్కడున్నాడని అడగ్గా వారు కిష్టయ్యపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. గట్టిగా నిలదీయడంతో బొలెరో వాహనం డోర్ తీసి అందులో మహేందర్ శవం చూపించారు. అనంతరం కిష్టయ్యను నెట్టేసి బొలెరో వాహనంతో సహా పారిపోయారు. తన కొడుకు మృతికి మూల నవీన్, దుందిగల్ల వెంకటేశ్, మూల సురేష్, మూల మహేందర్ (తండ్రి రాజులు), బస్వన్నగారి శ్రీదర్, మాజీ ఉపసర్పంచు రొడ్డ బిక్షపతి కారణమని అనుమానిస్తూ మృతుడి తండ్రి కిష్టయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.