కూల్చివేతలకు కలెక్టర్‌దే బాధ్యత

ABN , First Publish Date - 2021-01-13T06:05:41+05:30 IST

కంది మండలం చెర్యాల, తదితర గ్రామాల్లో రైతులు, మైనార్టీలు చేపట్టిన నిర్మాణాలను అక్రమమంటూ కూల్చివేసిన ఘటనలో ఆస్తి నష్టానికి కలెక్టర్‌ హన్మంతరావు బాధ్యత వహించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

కూల్చివేతలకు కలెక్టర్‌దే బాధ్యత
చెర్యాలలో అధికారులు కూల్చివేసిన ఇళ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి


 మా పార్టీ అధికారంలోకి రాగానే  ఇలాంటి అధికారులపై చర్యలు

 పది రోజుల్లో బాధితులకు న్యాయం చేయాలి

 లేకపోతే కూల్చిన షెడ్‌ కిందే కూర్చుంటా

 ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరిక

 పార్టీ మారాలని కాంగ్రెస్‌ సర్పంచ్‌లపై  ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన


కంది, జనవరి 12 : కంది మండలం చెర్యాల, తదితర గ్రామాల్లో రైతులు, మైనార్టీలు చేపట్టిన నిర్మాణాలను అక్రమమంటూ కూల్చివేసిన ఘటనలో ఆస్తి నష్టానికి కలెక్టర్‌ హన్మంతరావు బాధ్యత వహించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని చెర్యాల గ్రామ శివారులో, కందిలో అధికారులు కూల్చివేసిన ఇంటి నిర్మాణాలను, రేకుల షెడ్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే బాధితులను ఓదార్చి మీకు నష్టపరిహారం వచ్చే వరకూ అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. దాదాపుగా కోటిన్నర రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని, నిర్మాణ దశలోనే పంచాయతీ అధికారులు అడ్డుకుంటే ఇంత నష్టం వాటిల్లేది కాదని బాధితులంతా జగ్గారెడ్డికి తమ గోడును చెప్పుకొని భోరుమన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కలెక్టర్‌ మొదలుకొని అధికారులంతా టీఆర్‌ఎస్‌ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పేదలు ఇళ్లు నిర్మించుకుంటే కూలగొట్టిన అధికారుల భరతం పడతామని వ్యాఖ్యానించారు. ఓ మైనార్టీ వ్యక్తి బతుకుదెరువుకోసం కందికి వచ్చాడని, అప్పులు చేసి సుమారు రూ.70 లక్షల వ్య యంతో షెడ్డు నిర్మించుకున్నాడని, ఇప్పుడు ఈ షెడ్డు అక్రమమంటూ కూల్చివేయడంతో కుటుంబమంతా ఆగమైందన్నారు. ఇతడికి పది రోజుల్లో కలెక్టర్‌ న్యాయం చేయకపోతే తాను వచ్చి ఈ షెడ్డు ప్రాంతంలోనే కూర్చుంటానని జగ్గారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఇలాంటి అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తాను పదేళ్లు అధికారంలో ఉన్నపుడు ఏ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులను, కార్యకర్తలను పట్టుబట్టి మరీ వేధిస్తున్నారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సర్పంచులను, ఇతర ప్రజాప్రతినిధులను టీఆర్‌ఎ్‌సలో చేరాలంటూ కలెక్టర్‌ ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సంగారెడ్డి కలెక్టర్‌ ఏం గొప్ప పని చేశాడని సీఎం ప్రశంసించాడో అర్థం కావడం లేదన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో పేదల ఇళ్లు కూల్చినందుకు హన్మంతరావు సీఎం కేసీఆర్‌కు బెస్ట్‌ కలెక్టర్‌ అయ్యాడా అని ఎమ్మెల్యే ప్రశ్నించాడు. ఈ జిల్లాలో బుర్రా వెంకటేశం, ఏ.కె.సింఘాల్‌, పీయూష్‌ కుమార్‌, సురేశ్‌కుమార్‌ లాంటి ఎందరో కలెక్టర్లుగా పని చేసి అందరి మెప్పులు పొందారన్నారు. అయితే టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఇలాంటి కలెక్టర్‌ను ఎప్పుడూ చూడలేదన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ పోస్టులకు కొందరు అధికారులు తల దించుకునేలా వ్యవహరిస్తున్నారని, డైరెక్ట్‌ ఐఏఎ్‌సకు, కన్మర్మ్‌ ఐఏఎ్‌సకు తేడా ఉంటుందని, అందుకే సీఎం కేసీఆర్‌ కన్మర్మ్‌ ఐఏఎ్‌సలకే ఎక్కువగా పోస్టింగులను ఇస్తున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశాడు. అనుమతి లేని ని ర్మాణాలను ప్రారంభ దశలోనే అడ్డుకోని డీఎల్పీవో, కార్యదర్శులపై వెంట నే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు ఆంజనేయులు, ప్రకాష్‌, భుజెందర్‌ రెడ్డి, నవాజ్‌రెడ్డి, ఎద్దుమైలారం సర్పంచ్‌ మల్లారెడ్డి, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-01-13T06:05:41+05:30 IST