బడుగులకు రాజ్యాధికారమే బీఎస్పీ ధ్యేయం

ABN , First Publish Date - 2021-12-08T04:38:37+05:30 IST

బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారంలోకి రావాలన్నదే బహుజన సమాజ్‌పార్టీ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌ కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ పేర్కొన్నారు.

బడుగులకు రాజ్యాధికారమే బీఎస్పీ ధ్యేయం
నర్సాపూర్‌లో విలేకరులతో మాట్లాడుతున్న ఆర్‌ఎ్‌స ప్రవీణ్‌

 బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎ్‌స ప్రవీణ్‌

నర్సాపూర్‌, డిసెంబరు 7: బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారంలోకి రావాలన్నదే బహుజన సమాజ్‌పార్టీ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌ కో ఆర్డినేటర్‌  ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌కు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.  కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ రెండు కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఈ రెండు ప్రభుత్వాలు కేవలం మాటల గారడితో కాలం వెళ్లదీయడమే తప్ప ప్రజల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్నారు.  కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వస్తే రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని, బ్లాక్‌ మనీ విదేశాల నుంచి తెప్పించి పేదల అకౌంట్లలో వేస్తామని గొప్పలు చెప్పి ఇప్పుడు మాట తప్పారన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టి కార్పొరేట్‌ సంస్థలు, పెట్టుబడిదారులకు మేలు చేస్తున్నారన్నారు. ఇక రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ కూడా ఎన్నో హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.  తాత్కాలిక ప్రయోజనాలతో తమ రాజకీయ లబ్ధి కోసం బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. బీఎస్పీ వల్లే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, అందువల్ల రాష్ట్రంలో కూడా  బీఎస్పీకి ఆదరణ పెరుగుతున్నదన్నారు. రానున్న కాలంలో బీఎస్పీ ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే కాకుండా, రాజ్యాధికారంలోకి కూడా వస్తుందన్నారు. బీఎస్పీని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం చేయడానికి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ తెలిపారు.   

Updated Date - 2021-12-08T04:38:37+05:30 IST