చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహమై లభ్యం
ABN , First Publish Date - 2021-10-21T04:32:34+05:30 IST
చెరువులో స్నానం చేస్తూ గల్లంతైన వ్యక్తి మృత దేహమై లభ్యమైన ఘటన బుధవారం మండలంలోని చిమ్నాపూర్‌లో జరిగింది.

కంది, అక్టోబరు 20: చెరువులో స్నానం చేస్తూ గల్లంతైన వ్యక్తి మృత దేహమై లభ్యమైన ఘటన బుధవారం మండలంలోని చిమ్నాపూర్‌లో జరిగింది. సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ కె.సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. కంది గ్రామానికి చెందిన ఆశగోని పాండు(40) మంగళవారం చిమ్నాపూర్‌లో తన మామ మునుగల బాలయ్య అంత్యక్రియలకు కుటుంబసభ్యులతో కలసి వెళ్లాడు. ఈ సందర్భంగా చిమ్నాపూర్ శివారులోని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి నీట మునిగాడు. సాయంత్రం నుంచి పాండు కుటుంబసభ్యులు, జాలర్లు, పోలీసులు చెరువులో గాలించినా ఫలితం లేకపోయింది. బుధవారం ఉదయం 6 గంటలకు మృతదేహం లభ్యమైంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.