టెస్టులు చేయరు.. టీకా ఇవ్వరు

ABN , First Publish Date - 2021-05-06T05:15:06+05:30 IST

మెదక్‌ అర్బన్‌, మే 5: కరోనా టెస్టుల కోసం ప్రజలు కేంద్రాల వద్దకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ప్రతిరోజు వంద పరీక్షలు మాత్రమే చేస్తుండడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు

టెస్టులు చేయరు.. టీకా ఇవ్వరు
మెదక్‌ పట్టణంలోని ఓ ల్యాబ్‌లో పగిలిన అద్దం

పరీక్షలు చేయడంలో, టీకా స్లాట్‌ బుకింగ్‌లోనూ ఆలస్యం 

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న  బాధితులు 

సహనం కోల్పోయి ల్యాబ్‌ అద్దాల ధ్వంసం

మెదక్‌లో జిల్లాలో 67, సిద్దిపేటలో 500, సంగారెడ్డిలో 227 కేసులు నమోదు

మెదక్‌లో ఇద్దరు, సిద్దిపేటలో పన్నెండు మంది మృతి!


మెదక్‌ అర్బన్‌, మే 5: కరోనా టెస్టుల కోసం ప్రజలు కేంద్రాల వద్దకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ప్రతిరోజు వంద పరీక్షలు మాత్రమే చేస్తుండడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. మెదక్‌ పట్టణానికి చెందిన ఓ కుటుంబం కరోనా పరీక్షల కోసం రెండుమూడు రోజుల నుంచి జిల్లా కేంద్ర ఆసుపత్రికి వచ్చి వెళ్తున్నారు. అయినా టెస్టులు చేయకపోవడంతో ఆగ్రహించిన యువకుడు ల్యాబ్‌ ముఖద్వారం అద్దాన్ని పగలగొట్టాడు. ల్యాబ్‌ సిబ్బం ది వెంటనే పట్టణపోలీసుల సమాచారం ఇవ్వడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు యువకున్ని సముదాయించారు. 


అద్దాలు పగిలాయి.. టెస్టులు నిలిచాయి

సంగారెడ్డి అర్బన్‌: కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య తగ్గించడంతో టెస్టులు చేయించుకునేందుకు వచ్చిన ప్రజలు సహనం కోల్పోయారు. కోపోద్రేకులైన వారు సంగారెడ్డిలోని ఇంద్రానగర్‌ యూపీహెచ్‌సీ కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈసంఘటన బుధవారం చోటుచేసుకుంది. ప్రతీ పీహెచ్‌సీకి నిత్యం 50మందికే ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించాలని వైద్యఆరోగ్యశాఖ సూచించింది. ఉదయం నుంచి వేచి ఉన్నా కూడా కిట్లు లేవని వెనక్కి పంపిస్తుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్టుల కోసం వచ్చిన వారు యూపీహెచ్‌సీ కిటికి అద్దాలు ధ్వంసం చేసింది వాస్తవమేనని,  జిల్లావైద్య ఆరోగ్యశాఖ అధికారుల నుంచి తదుపరి ఆదేశాల అనంతరం తిరిగి టెస్టులు ప్రారంభిస్తామని ఇంద్రానగర్‌ యూపీహెచ్‌సీ మెడిక ల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రజిని తెలిపారు. 


స్లాట్‌ బుకింగ్‌ అందరికీ సాధ్యం కాదు

వ్యాక్సిన్‌ కోసం ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ అందరికీ సాధ్యం కాదని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మయ్యయాదవ్‌ సోమశేఖర్‌ అభిప్రాయపడ్డారు. అన్ని పీహెచ్‌సీలకు సరిపడా వ్యాక్సిన్‌ పంపి వ్యాక్సిన్‌ కోసం వచ్చిన వారికి స్లాట్‌తో సంబంధం లేకుండా టీకా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులు సాంకేతిక నైపుణ్యం లేని వారి ని దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రుల వద్ద టోకెన్‌ ఇచ్చే సదుపాయాన్ని కల్పించాలన్నారు. ముందస్తు స్లాట్‌తో కాకుండా గతంలో మాదిరిగా వచ్చిన ప్రతి ఒక్కరికీ వెనక్కి పంపకుండా టీకా ఇవ్వాలని అధికారులను కోరారు. 


స్లాట్‌ బుకింగ్‌ ద్వారానే టీకా :  మెదక్‌ జిల్లా వైద్యాధికారి 

మెదక్‌ అర్బన్‌: కొవిడ్‌ టీకా వేయించుకోవాలనుకునే వారు తప్పనిసరిగా రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మెదక్‌ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మొదటి డోస్‌ టీకా వేసుకుని రెండో డోస్‌ కోసం ఎదురు చూస్తున్న వారు మాత్రం ఒకరోజు ముందుగా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలన్నారు. మెదక్‌ జిల్లావ్యాప్తంగా 24 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో లక్షా 7 వేల మందికి టీకా వేశామని ఆయన తెలిపారు. 


కరోనా కేసులను గుర్తించడానికి ఇంటింటి సర్వే

నర్సాపూర్‌: నర్సాపూర్‌తో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో కరోనా కేసులు గుర్తించి వారికి సకాలంలో మందులు అందజేసేందుకు ఇంటింటి సర్వే చేపట్టినట్లు ఇన్‌చార్జి తహసీల్దార్‌ తిరుమలరావు పేర్కొన్నారు. ‘చేజ్‌ ద వైరస్‌’ పేరిట  వైద్య, పంచాయతీ, రెవెన్యూ, శిశుసంక్షేమ శాఖకు చెందిన సిబ్బంది ప్రతీగ్రామంలో ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారన్నారు. దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు వంటి లక్షణాలు ఉంటే వారిని గుర్తించి వారికి మందులు అందజేస్తామన్నారు. సిబ్బందికి ప్రజలు సహకరించి కరోనా నివారణలో భాగస్వామ్యం కావాలన్నారు. 


తగ్గని కరోనా ఉధృతి

మెదక్‌అర్బన్‌/పాపన్నపేట, మే5: మెదక్‌ జిల్లాలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. బుధవారం జిల్లావ్యాప్తంగా 665 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. 67 మందికి పాజిటివ్‌ వచ్చింది. నర్సాపూర్‌లో 28, రామాయంపేట 28, పాపన్నపేటలో 23, మెదక్‌లో 21, తూప్రాన్‌ 14, పెద్దశంకరంపేటలో 14, చేగుంట, కొల్చారం, టేక్మాల్‌లో 12 చొప్పున నమోదయ్యాయి మెదక్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 23 మంది గర్భిణులకు టెస్టులు చేయగా ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. మెదక్‌ పట్టణంలోని బ్రాహ్మణవీధికి చెందిన తల్లీకొడుకులు వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. స్ధానిక కౌన్సిలర్‌ చోళ మేఘామాల రాంచరణ్‌ మంగళవారం వారిని 108లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. టెస్టులు చేయగా పాజిటివ్‌గా తేలింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కొడుకు (55) మృతిచెందాడు. తల్లి చికిత్స పొందుతున్నది. మున్సిపల్‌ సిబ్బంది సహాయంతో సదరు వ్యక్తి మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తరలించి గిద్దకట్ట శ్మశానవాటికలో కొవిడ్‌ నిబంధనల మేరకు అంత్యక్రియలు నిర్వహించారు.  పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లికి చెందిన ఉపాధ్యాయుడు కరోనాతో మృతిచెందాడు. ఉపాధ్యాయుడి మృతికి పీఆర్టీయూ భవన్‌లో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, సుంకరి కృష్ణ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఉపాధ్యాయుడి స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు వైర్‌సబారిన పడిన వారిసంఖ్య 11,455కి చేరింది. ఇప్పటివరకు 70మంది మృత్యువాత పడ్డారు. 


సిద్దిపేట జిల్లాలో 12 మంది  మృతి

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో బుధవారం 12 మంది కొవిడ్‌ బారిన పడి మరణించినట్లు సమాచారం. సిద్దిపేట జీజీహెచ్‌లో 8 మంది, పారుపల్లి వీధిలో ఇద్దరు, భారత్‌నగర్‌కు చెందిన ఒకరు, మార్కెట్‌ యార్డులోని ఒక కమిషన్‌ ఏజెంట్‌ చనిపోయారని తెలిసింది. సిద్దిపేటలోని జీజీహెచ్‌లో 135 మంది, ఆర్‌వీఎం వైద్య కళాశాలలో 63 మంది చికిత్స పొందుతున్నారు. జీజీహెచ్‌లో రోజూ నలుగురు నుంచి 8మంది దాకా చనిపోతున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మంగళవారం జిల్లాలో అత్యధికంగా 650 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక బుధవారం 500 కేసులు వెల్లడైనట్లు తెలిసింది.  అయితే వైద్యాధికారులు మాత్రం వివరాలు వెల్లడించడం లేదు. 


సంగారెడ్డిలో 227 మందికి పాజిటివ్‌

సంగారెడ్డి జిల్లాలో బుధవారం 2,366 మందికి ర్యాపిడ్‌టెస్టులు నిర్వహించగా 227 మందికి పాజిటివ్‌గా తేలింది. సంగారెడ్డికి చెందిన శృతిలయ అకాడమీ వ్యవస్థాపకుడు, గాయకుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కరోనాతో మంగళవారం రాత్రి మృతిచెందాడు. 

Updated Date - 2021-05-06T05:15:06+05:30 IST