రైతు మృతిపై జాలిగామలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-12-30T05:55:00+05:30 IST

ఈ నెల 27 పొలానికి వెళ్లిన రైతు మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది

రైతు మృతిపై జాలిగామలో ఉద్రిక్తత
జాలిగామ గ్రామంలోని గజ్వేల్‌-దౌల్తాబాద్‌ రోడ్డుపై మృతదేహంతో ఆందోళన చేస్తున మృతుడి బంధువులు, గ్రామస్థులు, (ఇన్‌సెట్‌లో) నర్సయ్య(ఫైల్‌)

 విద్యుదాఘాతంతో మృతి చెందాడని పోలీసుల వెల్లడి

 హత్యేనంటూ బంధువుల ఆందోళన

 గజ్వేల్‌-దౌల్తాబాద్‌ రోడ్డుపై మృతదేహంతో 3 గంటల పాటు రాస్తారోకో

 పోలీసుల హామీతో  ఆందోళన విరమణ 

 గజ్వేల్‌/గజ్వేల్‌టౌన్‌, డిసెంబరు 29: ఈ నెల 27 పొలానికి  వెళ్లిన రైతు మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యుదాఘాతంతో మృతి చెందాడని పోలీసులు నిర్ధారణకు రాగా, ఇది హత్యేనని కుటుంబీకులు, బంధువులు ప్రధాన రహదారిపై మృతదేహంతో ఆందోళనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన గజ్వేల్‌  మండలంలోని జాలిగామ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని జాలిగామ గ్రామానికి చెందిన  మీసాల నర్సయ్య(50) ఈ నెల 27న ఉదయం తన వ్యవసాయ పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబీకులు సాయంత్రం పొలం వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. 


ఇది హత్యేనంటూ ఆందోళన

కాగా నర్సయ్య మృతిపై తమకు అనుమానాలున్నాయని ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బుధవారం మృతదేహాన్ని గజ్వేల్‌-దౌల్తాబాద్‌ రోడ్డుపై పెట్టి ఆందోళన చేపట్టారు. నర్సయ్య మృతి ప్రమాదవశాత్తు జరిగింది కాదని కుటుంబీకులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. మృతదేహం బోరు మోటారుకు దూరంగా పడిందని, అంతేగాకుండా మృతుడి ఒంటిపై గాయాలున్నాయని తెలిపారు.  భూ తగాదాలతోనే ఆయనను హత్య చేసి ఉంటారని పలువురిపై  అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉదయం  సుమారు  9:30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆందోళన చేపట్టారు.. సమగ్రంగా విచారించి బాధిత కుటుంబానికి న్యాయం చే స్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. 


Updated Date - 2021-12-30T05:55:00+05:30 IST