ఉపాధ్యాయులకు బదిలీ క్షోభ
ABN , First Publish Date - 2021-12-27T05:06:21+05:30 IST
బదిలీల ప్రక్రియతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొన్నది. ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోతో స్థానికతను కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని జూనియర్లు ఆందోళన బాట పట్టారు. ఉమ్మడి జిల్లాలో మంజూరైన ఉపాధ్యాయ పోస్టులను మూడు జిల్లాలకు పంపిణీ చేశారు.

స్థానికతను కోల్పోతున్న జూనియర్లు
317జీవో సవరణకు డిమాండ్
సిద్దిపేట కైరం/కొండపాక డిసెంబరు 26 : బదిలీల ప్రక్రియతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొన్నది. ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోతో స్థానికతను కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని జూనియర్లు ఆందోళన బాట పట్టారు. ఉమ్మడి జిల్లాలో మంజూరైన ఉపాధ్యాయ పోస్టులను మూడు జిల్లాలకు పంపిణీ చేశారు. జిల్లాలకు కేటాయించిన పోస్టులను 317 జీవో ప్రకారం ఉపాధ్యాయుల సీనియారిటీ ఆధారంగా కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తున్నారు. సిద్దిపేట ప్రాంతంలో ఎక్కువగా టీచర్లు ఉండడంతో మెదక్, సంగారెడ్డి తదితర ప్రాంతాలకు ఆప్షన్ల ప్రకారం జూనియర్లను కేటాయించారు. సీనియారిటీతో పాటు స్థానికతను చూసి ఉంటే సిద్దిపేట జిల్లా నుంచి ఇతర ప్రాంతానికి వెళ్లే వారం కామని టీచర్లు వాపోతున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలతో పాటు కొత్తగా సిద్దిపేట జిల్లాలో కలిసిన వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కొన్ని మండలాల స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీ, ఇతర కేడర్లకుకు చెందిన ఉపాధ్యాయులు 861 మంది సిద్దిపేట జిల్లాకు కేటాయించబడ్డారు. మెదక్, సంగారెడ్డి ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారు సొంత జిల్లాకు రావడం వారిలో సంతోషాన్ని నింపగా సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్న 971 మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు బదిలీ కావడం వారిలో నిరాశను నింపింది. స్థానికతను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 317 జీవోను నిరసిస్తూ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. శనివారం సిద్దిపేట పట్టణం పాత బస్టాండ్ వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయులు ధర్నా చేశారు. అలాగే 317జీవోతో స్థానికతను కోల్పోతున్నామని తమకు న్యాయం చేయాలంటూ ఇతర జిల్లాలకు కేటాయించబడిన ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో శనివారం సిద్దిపేట లో మంత్రి హరీశ్‌రావుకు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. సీనియార్టీతో పాటు స్థానికతను పరిగణించాలని వేడుకున్నారు.
టాప్ ర్యాంక్ సంతోషం కొద్ది కాలమే
మాది సిద్దిపేట అర్బన్ మండలం నాంచార్‌పల్లి గ్రామం. నేను ఉమ్మడి జిల్లా 2017 డీఎస్సీలో చాలా కష్టపడి చదివి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సబ్జెక్టులో జిల్లా మొదటి ర్యాంకు సాధించాను. 2019 జూన్‌లో చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు. 317జీవో ప్రకారం స్థానికతకు ప్రాముఖ్యత ఇవ్వకుండా సీనియారిటీ ప్రాముఖ్యత ఇవ్వడంతో ఇప్పుడు నేను మెదక్ జిల్లాకు వెల్లసి వచ్చింది. మా అమ్మానాన్న, అత్తమ్మ, మామయ్య ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. మా పిల్లలు సిద్దిపేటలో చదువుకుంటున్నారు. ఇప్పుడు వారందర్నీ వదిలి మెదక్ జిల్లాలో ఉద్యోగానికి వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉంది.
-పి.ప్రతిభ స్కూల్‌అసిస్టెంట్, సిద్దిపేట జిల్లా
సొంత జిల్లాకు వచ్చేలా చర్య తీసుకోవాలి
నేను ఉమ్మడి మెదక్ జిల్లా 2012 డీఎస్సీలో సెకండ్ గ్రేడ్ టీచర్‌గా ఎన్నికయ్యాను. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ మండలంలో పోస్టింగ్ ఇచ్చారు. మా భార్య సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. గత ట్రాన్స్‌ఫర్‌లో పౌజ్ ద్వారా నేను సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలానికి బదిలీపై వచ్చాను. ఇన్ని రోజులు సొంత జిల్లాలో కుటుంబీకులతో కలిసి ఉంటూ ఉద్యోగం చేశాం. ఇప్పుడు స్థానికతకు కాకుండా సీనియార్టీకి ప్రాముఖ్యత ఇవ్వటంతో నేను, మా భార్య ఇద్దరం మెదక్ జిల్లాలకు వెళ్లాల్సి వస్తుంది.
-ఎస్.చంద్రశేఖర్, ఎస్జీటీ ఉపాధ్యాయుడు