జిల్లా కేంద్రంలో తైబజార్‌ దౌర్జన్యాలు

ABN , First Publish Date - 2021-03-24T05:32:57+05:30 IST

మెదక్‌ జిల్లా కేంద్రంలో తైబజార్‌ అక్రమ వసూళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇష్టారీతిగా వసూళ్లకు పాల్పడుతూ వ్యాపారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.

జిల్లా కేంద్రంలో తైబజార్‌ దౌర్జన్యాలు
బాధితులు వీరమ్మ, మూగయ్య దంపతులు

రూ. వెయ్యి ఇవ్వాలని మూగ వ్యాపారిపై దాడి


మెదక్‌ అర్బన్‌, మార్చి 23: మెదక్‌ జిల్లా కేంద్రంలో తైబజార్‌ అక్రమ వసూళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇష్టారీతిగా వసూళ్లకు పాల్పడుతూ వ్యాపారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అడిగినంత  చెల్లించాల్సిందేనని జులుం చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ జులుంపై మున్సిపాలిటీకి ఫిర్యాదు వెల్లువెత్తుతున్నాయి. తైబజార్‌ రుసుం కింద రూ. వెయ్యి ఇవ్వాలని వికలాంగుడైన చిరు వ్యాపారి దంపతులపై దాడికి పాల్పడగా, ఈ విషయంపై ఇఫ్కో డైరెక్టర్‌  దేవేందర్‌రెడ్డికి బాధితులు మొరపెట్టుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద సోఫాలు అమ్ముకుంటున్న నెల్లూరుకు చెందిన వీరమ్మ, మూగయ్య దంపతుల వద్దకు తైబజార్‌ ఉద్యోగులు వెళ్లారు. ఒక్కో సోఫాకి రూ. వెయ్యి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంత ఇవ్వడం సాధ్యం కాదని. రూ. 200 వరకు ఇస్తామని దంపతులు బ్రతిమిలారు. వినకపోవడంతో మున్సిపల్‌ చైర్మన్‌కు ఫోన్‌ చేసే ప్రయత్నం చేయగా తైబజార్‌ ఉద్యోగులు వీరమ్మ వద్ద నుంచి ఫోన్‌ను లాక్కొని పగలగొట్టారు. అడ్డొచ్చిన మూగయ్యపై దాడి చేశారు. ఈ విషయంపై వారు మంగళవారం ఇఫ్కో డైరెక్టర్‌  దేవేందర్‌రెడ్డితో మొరపెట్టుకున్నారు. ఆయన వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి బాధితుల వద్ద కేసు తీసుకొని దర్యాప్తు చేయాలని సూచించారు. బాధితులు ఈ విషయంపై పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 


నిత్యం వివాదాలే..

 పట్టణంలో కూరగాయల మార్కెట్‌, ప్రధాన రహదారుల వెంట తైబజార్‌ వసూలు కాంట్రాక్టును గతేడాది సెప్టెంబరు మాసంలో సున్నం నరేష్‌ అనే వ్యక్తి రూ. 14 లక్షలకు దక్కించుకున్నారు. కానీ మున్సిపాలిటీ ధ్రువీకరించిన దానికంటే ఎక్కువగా వసూల చేయడం బల్దియాకు తలనొప్పిగా మారింది. తైబజార్‌ రశీదులో ఉన్నదానికి రెట్టింపు వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని దబాయిస్తున్నారు. వాణిజ్య వాహనాల వద్ద కూడా రెండింతలు వసూలు చేస్తున్నారు. చిరు వ్యాపారులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కూరగాయలను పారబోస్తున్నారు. ఈ విషయంపై గతంలో మున్సిపాలిటీకి పలుమార్లు ఫిర్యాదులు అందాయి. మున్సిపల్‌ సమావేశంలో సైతం ఈ విషయంపై చర్చ జరిగింది. అయినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది.

Updated Date - 2021-03-24T05:32:57+05:30 IST