ఆరేళ్ల బాలుడిని కొట్టి చంపిన సవతి తండ్రి

ABN , First Publish Date - 2021-11-03T04:37:04+05:30 IST

అకారణంగా ఆరేళ్ల బాలుడిపై ద్వేషం పెంచుకున్న సవతి తండ్రి ఉన్మాదిగా మారాడు.

ఆరేళ్ల బాలుడిని కొట్టి చంపిన సవతి తండ్రిఅకారణంగా బాలుడిపై ద్వేషం పెంచుకున్న ఉన్మాది

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో ఘటన 

పటాన్‌చెరు/పటాన్‌చెరు రూరల్‌, నవంబరు 2: అకారణంగా ఆరేళ్ల బాలుడిపై ద్వేషం పెంచుకున్న సవతి తండ్రి ఉన్మాదిగా మారాడు. వీడిని చూస్తేనే అసహ్యం వేస్తోంది అంటూ తరచూ కారణం లేకుండా తీవ్రంగా కొట్టేవాడు. ఈ క్రమంలో చివరకు ఇంట్లో తల్లిలేని సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చితకబాదడంతో బాలుడు మృతిచెందిన హృద య విదారకమైన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీ్‌సస్టేసన్‌ పరిధిలోని ఇస్నాపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాలుడి తల్లి అరుణకు కోహిర్‌ మండలం దిగ్వాల్‌ గ్రామానికి చెందిన నర్సింహులుతో పదకొండేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు మగపిల్లలు. జాన్‌పాల్‌ పదేళ్లు, జస్వంత్‌కు ఎనమిదేళ్లు, చిన్నవాడైన అరుణ్‌కుమార్‌కు ఆరేళ్లు ఉన్నాయి. కాగా తాగుడుకు బానిసైన భర్త లివర్‌ పాడై సంవత్సరం క్రితం మృతిచెందాడు. భర్త చనిపోక ముందే గద్వాల్‌లోని తిరుమల్‌ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో వినయ్‌ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. తన భర్త మరణించిన సంవత్సరం నుంచి దిగ్వాల్‌లో ఇద్దరు కలిసి ఉండేవారు. నెలరోజుల క్రితం మెదక్‌ చర్చిలో వివాహం చేసుకున్నారు. ఉపాధి కోసం పిల్లలతో సహా ఇస్నాపూర్‌ పద్మారావునగర్‌లో నివాసం ఉంటున్నారు. ముందునుంచి అకారణంగా చిన్నకొడుకు అరుణ్‌కుమార్‌పై సవతితండ్రి వినయ్‌ ద్వేషం పెంచుకున్నాడు. చిన్నచిన్న కారణాలు చూపుతూ తరచూ తీవ్రంగా చితకబాదేవాడు. బాబును కొడితే వెళ్లిపోతానని అనేక మార్లు అరుణ వినయ్‌ను హెచ్చరించింది. మూడు రోజుల క్రితం నెక్కర్‌లో మలమూత్రాలు పోతున్నాడు అన్న సాకును చూపి తీవ్రంగా కొట్టాడు. అరుణ తీవ్రంగా మందలించడంతో ఇకపై కొట్టనని వినయ్‌ నమ్మబలికాడు. అరుణ మంగళవారం స్థానికంగా ఉండే ఓ పరిశ్రమలో పనికి వెళ్లింది. ఇదే అదనుగా ఇంట్లో ఉన్న అరుణ్‌కుమార్‌ను పలు దఫాలుగా తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. బాలుడి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. గోడకేసి అదిమిపట్టి ఉన్మాదిలా కొట్టడంతో దెబ్బలు తీవ్రంగా తగిలాయి. ఇంట్లోనే ఉన్న మరో ఇద్దరు పిల్లలు ఇదంతా చూస్తూ భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కళ్లముందే తమ తమ్ముడిని కొడుతున్నా నిశ్చేష్టులై ఉండిపోయారు.  ఉలుకుపలుకు లేకుండా పడి ఉన్న బాలుడిని సాయంత్రం ఇస్నాపూర్‌లోని పిల్లల డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. తిరిగి బాలుడిని ఇంట్లో పడుకోబెట్టి నిందితుడు వినయ్‌ పరారయ్యాడు. పని నుంచి వచ్చిన తల్లి జరిగిన ఘోరం చూసి బోరుమంది. ఇరుగు పొరుగు వారి సహాయంతో పటాన్‌చెరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టుం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నిందితుడిని పట్టుకుంటామని సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-11-03T04:37:04+05:30 IST